పైలట్‌ వ్యూహం బెడిసి కొట్టిందా?

Sachin Pilots Hold On Congress Slowly Waning - Sakshi

కాంగ్రెస్‌లో సానుభూతి కనుమరుగు

జైపూర్‌ : రాజస్తాన్‌లో రాజకీయ హైడ్రామా కొనసాగుతుండగా.. తిరుగుబాటు నేత, మాజీ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్కు కాంగ్రెస్‌ శిబిరంలో మద్దతు, సానుభూతి తరిగిపోతోందని పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటును కొనసాగిస్తుండటంతో పార్టీలో అంతర్గతంగా పైలట్‌కున్న పట్టు, సానుభూతిని ఆయన కోల్పోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎల్పీ భేటీలకు డుమ్మా కొట్టడంతో రాజస్తాన్‌ డిప్యూటీ సీఎంగా పైలట్‌ను తొలగించిన సమయంలో ఆయన పట్ల కాంగ్రెస్‌ పార్టీలో సానుభూతి పెరిగింది. ఈ క్రమంలో అధీర్‌ రంజన్‌ చౌధరి, అభిషేక్‌ సింఘ్వి, సల్మాన్‌ ఖుర్షీద్‌, శశి థరూర్‌, జితిన్‌ ప్రసాద, ప్రియా దత్‌ వంటి సీనియర్‌ నేతలు సైతం పైలట్‌ తిరిగి పార్టీ గూటికి చేరతారని, పరిస్థితి సద్దుమణుగుతుందని ఆశించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం వంటి నేతలు కూడా పైలట్‌తో రాజీ యత్నాలకు చొరవ చూపారు.

పైలట్‌తో చర్చించి తిరిగి ఆయనను పార్టీ గూటికి చేర్చాలంటూ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలు సీనియర్‌ నేతలను రాయబారానికి పంపినా ఫలితం లేకపోయింది. ఈ ఆఫర్లను తోసిపుచ్చిన పైలట్‌ ముఖ్యమంత్రిగా అశోక్‌ గహ్లోత్‌ తొలగించాలని పట్టుపట్టారు. గహ్లోత్‌ సైతం గద్దెదిగేందుకు అంగకరించకపోవడంతో పాటు అదే రోజు డిప్యూటీ సీఎంగా పైలట్‌పై వేటు వేయడం పైలట్‌ సహా 18 మంది అసంతృప్త పార్టీ ఎమ్యెల్యేలకు రాజస్తాన్‌ అసెంబ్లీ స్పీకర్‌ అనర్హత నోటీసులు జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. గహ్లాత్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీతో కలిసి రెబల్‌ నేతలు కుట్ర పన్నారంటూ విడుదలైన ఆడియో టేప్‌లు కలకలం రేపాయి. సొంతపార్టీని గద్దెదింపేందుకు పైలట్‌ బీజేపీతో చేతులు కలుపుతున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. చదవండి : రాజస్తాన్‌ హైడ్రామా : అది మా హక్కు

పైలట్‌ సహా రెబల్‌ ఎమ్మెల్యేలకు జారీ అయిన అనర్హత పిటిషన్‌లపై విచారణ న్యాయస్ధానాల పరిధిలో ఉంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే పైలట్‌ ఏ పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారో వెల్లడవుతుందని కాంగ్రెస్‌ నేతలు పేర్కొంటున్నారు. అసెంబ్లీని సమావేశపరచడంపై పైలట్‌ ఎందుకు మౌనంగా ఉంటున్నారని పార్టీ నేతలు ఆయనను నిలదీస్తున్నారు. 20, 25 మంది ఎమ్మెల్యేలతో పైలట్‌ ముఖ్యమంత్రి కాలేరని, బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారుతున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు పైలట్‌కు పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని కాంగ్రెస్‌ నేతలు చెబుతుంటే ముఖ‍్యమంత్రి గహ్లోత్‌ మాత్రం విమర్శలతో చెలరేగుతున్నారని పైలట్‌ వర్గీయులు అంటున్నారు. ఇది ద్వంద్వ ప్రమాణాలను అనుసరించడం కాదా అని పైలట్‌ శిబిరం ప్రశ్నిస్తోంది. అసెంబ్లీని సమావేశపరిస్తే పైలట్‌ ఎలాంటి వ్యూహం అనుసరిస్తారనేది ఆసక్తి రేపుతోంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top