న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మహిళల ప్రవేశంపై కొనసాగుతున్న సుదీర్ఘ వివాదంలో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) తన వైఖరిని స్పష్టం చేస్తూ, సుప్రీంకోర్టులో కీలక వివరణ ఇచ్చింది. 10 నుండి 50 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలపై ఉన్న నియంత్రణ అనేది లింగ వివక్ష కిందకు రాదని, అది ఆలయ సంప్రదాయంలో భాగమని బోర్డు కోర్టుకు విన్నవించింది.
నైష్ఠిక బ్రహ్మచర్యమే ప్రాతిపదికగా..
శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామిని ‘నైష్ఠిక బ్రహ్మచారి’గా భక్తులు ఆరాధిస్తారని దేవస్వం బోర్డు తన వాదనలో పేర్కొంది. స్వామివారికి ఆధ్యాత్మిక శక్తి అనేది ఆయన ఆచరించిన తపస్సు, ఇంద్రియ నిగ్రహం, బ్రహ్మచర్యం ద్వారానే లభిస్తుందని.. ఈ క్రమశిక్షణను భక్తులు కూడా పాటిస్తారని వివరించింది. దేశవ్యాప్తంగా సుమారు వెయ్యికి పైగా అయ్యప్ప ఆలయాలు ఉన్నప్పటికీ, శబరిమల ప్రత్యేకత ఈ ‘నైష్ఠిక బ్రహ్మచర్యమే’నని బోర్డు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశంపై నియంత్రణలు ఉన్నాయని, అయితే 10 ఏళ్లలోపు బాలికలు, 50 ఏళ్లు దాటిన మహిళల ప్రవేశానికి ఎలాంటి అభ్యంతరం లేదని గుర్తు చేసింది.
అంతర్జాతీయ పరిశోధనల ప్రస్తావన
తన వాదనను బలపరుచుకునేందుకు దేవస్వం బోర్డు అంతర్జాతీయ స్థాయి పరిశోధనా పత్రాలను సుప్రీంకోర్టుకు సమర్పించింది. 1987లో ఒట్టావాలోని కార్లెటన్ యూనివర్శిటీకి చెందిన రాధికా శేఖర్ సమర్పించిన థీసిస్‌తో పాటు, 2003లో ‘రాయల్ ఆంత్రోపాలజికల్ ఇనిస్టిట్యూట్’ ప్రచురించిన అధ్యయనాలను బోర్డు గుర్తు చేసింది. ఈ పరిశోధనల ప్రకారం.. శబరిమలలో వయోపరిమితి అనేది పురాతన మతపరమైన ఆచారమే తప్ప, సమానత్వ హక్కులను కాలరాయడం కాదని బోర్డు ‘సుప్రీం’లో వాదించింది. ఒక సమూహాన్ని లేదా వర్గాన్ని ‘మతపరమైన శాఖ’గా గుర్తించాలా వద్దా అనేది కేవలం చట్టపరమైన అంశమే కాదని, అది వాస్తవాలతో కూడిన విషయమని బోర్డు అభిప్రాయపడింది. డాక్యుమెంటరీ ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే కోర్టు దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరింది.
ఇది కూడా చదవండి: ‘వెయిటింగ్ లిస్ట్’లో వందే భారత్ స్లీపర్


