
మొత్తం మరణాల్లో 31 శాతానికి కారణం ఇవే
తర్వాతి స్థానంలో నిలిచిన శ్వాసకోశ సమస్యలు
అజీర్ణ సమస్యలు, అకారణ జ్వరాలు, మధుమేహం
15–29 ఏళ్ల యువతలో ‘ఆత్మహత్యల’ మరణశాసనం
‘రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా’ తాజా నివేదిక
మనదేశంలో 2021–23 మధ్య సంభవించిన మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణమని.. ఆ తర్వాతి స్థానంలో శ్వాసకోశ సమస్యలు ఉన్నట్లు ‘రిజిస్ట్రార్ జనరల్ అండ్ సైన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా’ తన తాజా నివేదికలో వెల్లడించింది. మొత్తం మరణించిన వారిలో 40 శాతానికిపైగా.. 70 ఏళ్లకుపైబడిన వారే. భారతదేశ ప్రజారోగ్య వ్యూహాలను రూపొందించటానికి, పెరుగుతున్న అసాంక్రమిక వ్యాధుల భారాన్ని ఎదుర్కొనే ప్రణాళికల రూపకల్పనకు ఈ పరిశోధన ఫలితాలు కీలకమైనవని నివేదిక పేర్కొంది.
‘మరణ కారణాలు: 2021–2023’ పేరిట రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్జీఐ) సెప్టెంబర్ 3న విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే తాజా నివేదిక ప్రకారం దేశంలోని అనారోగ్య సంబంధ మరణాలకు దాదాపు 31 శాతం వరకు గుండె జబ్బులే ప్రధాన కారణం. మొత్తం మరణాల్లో 56.7 శాతం వరకు అసాంక్రమిక వ్యాధులు (గుండె జబ్బులతో సహా) ఉన్నట్లు నివేదిక తెలిపింది. గుండెజబ్బుల తర్వాత శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ వ్యాధులు మరణాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో ప్రసూతికి సంబంధించిన మరణాలు, పౌష్టికాహార లోపాల మరణాలు 23.4 శాతం వరకు ఉన్నాయి.
గుండెపై జీవనశైలి ఒత్తిళ్లు..
అన్ని రకాల హృద్రోగాలు కలిపి మరణాలకు ప్రధాన కారణంగా నిలిచాయని, దాదాపు 31 శాతం మంది ప్రాణాలను అవి బలిగొన్నాయని నివేదిక తెలిపింది. యువతలో జీవనశైలి వల్ల తలెత్తుతున్న గుండె జబ్బుల తర్వాత, ఆత్మహత్యలు వారి మరణానికి రెండో ప్రధానం కారణంగా ఉన్నాయని నివేదిక తెలిపింది. 30 ఏళ్లు దాటిన వారిలో మరణాలకు గుండె జబ్బులు ప్రధాన కారణంగా ఉంటుండగా, 15–29 ఏళ్ల యువత పాలిట ఆత్మహత్యలు మరణ శాసనాలుగా మారుతున్నాయి.
ప్రాంతాల వారీగా సర్వే
ఉత్తర, ఈశాన్య, తూర్పు, మధ్య, పశ్చిమ, దక్షిణ.. ఇలా ప్రాంతాల వారీగా రిజిస్ట్రార్ ఆఫ్ ఇండియా ‘మరణ కారణాలు: 2021–2023’ సర్వేను నిర్వహించింది.
» దక్షిణాదిన హృద్రోగ మరణాల శాతం 32.8 శాతం ఉండగా, ఉత్తరాదిన 34.5 శాతంగా ఉంది.
» శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వల్ల మరణాలు పశ్చిమ ప్రాంతంలో అత్యధికంగా 12.7 శాతం ఉన్నాయి. తరవాతి స్థానంలో (12.3 శాతం) మధ్య భారతం ఉంది. ఇవి అత్యల్పంగా (7.1 శాతం) సంభవించింది ఉత్తరాదిలో.
» మధుమేహం వల్ల అత్యధికంగా 4.6 శాతం మరణాలతో దక్షిణాది అగ్రస్థానంలో నిలిచింది. తరువాతి స్థానంలో (4.1 శాతం) ఉత్తరాది ఉంది.


