
నేడు(మార్చి 30) రాజస్థాన్ దినోత్సవం(Rajasthan Day). రాజస్థాన్ ఏర్పడి ఈరోజుకు 76 ఏళ్లు పూర్తయ్యాయి. 1949, మార్చి 30న రాజస్థాన్ ఒక రాష్ట్రంగా ఏర్పాటయ్యింది. ఈ రాష్ట్రంలోని అందమైన కోటలు, ప్రత్యేక సంస్కృతి, చరిత్ర ఎంతో ఆసక్తిగొలుపుతాయి. దేశంలో విస్తీర్ణం పరంగా ఈ రాష్ట్రం అతిపెద్దది. నేటి రాజస్థాన్‌ను ఒకప్పుడు ‘రాజపుతన’ అని పిలిచేవారు. అంటే రాజపుత్రుల దేశం అని అర్థం.
1949లో మార్చి 30న 19 రాచరిక రాష్ట్రాలతో పాటు మూడు ప్రదేశాలను కలిపి ‘రాజస్థాన్’ను స్థాపించారు. ఈ రాచరిక రాష్ట్రాల ఏకీకరణ ఏడు దశల్లో పూర్తయిన తర్వాత దీనికి ‘రాజస్థాన్’ అనే పేరుపెట్టారు. రాజస్థాన్ రాష్ట్రం ఎనిమిదేళ్ల, ఏడు నెలల, 14 రోజుల్లో మొత్తం ఏడు దశల్లో ఏర్పడింది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించాక దేశ ఏకీకరణ ప్రక్రియ(Integration process) జరుగుతున్నప్పుడు, పలు సంస్థానాల రాజులు దేశంలో విలీనానికి నిరాకరించారు. కానీ దేశంలోని అన్ని సంస్థానాలను విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ నేపధ్యంలోనే రాజస్థాన్‌లోని అన్ని రాచరిక రాష్ట్రాల ఏకీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. 1949లో పలు రాచరిక రాష్ట్రాలు, చిన్న రాజ్యాలు కలగలపడంతో రాజస్థాన్ పెద్ద రాష్ట్రంగా అవతరించింది. ఈ ఏకీకరణ ఘనత భారత ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు దక్కుతుంది. రాజస్థాన్ దినోత్సవం నాడు రాష్ట్ర వ్యాప్తంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ ప్రదర్శనలు నిర్వహిస్తారు.
ఇది కూడా చదవండి: నాగ్‌పూర్ చేరుకున్న ప్రధాని మోదీ.. సంఘ్ కార్యాలయం సందర్శన