
బిహార్‌లో బాహాటంగా ఓట్ల దోపిడీ
బీజేపీ కుట్రలను అడ్డుకుని తీరతాం
‘ఓటర్ అధికార యాత్ర’లో రాహుల్
అరారియా: మోదీ సర్కారు, కేంద్రం ఎన్నికల సంఘం కుమ్మక్కయ్యాయని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ముసుగులో బిహార్‌లో ఓట్ల దోపిడీకి పాల్పడుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. బిహార్‌లో ఓట్ల చోరీని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ‘ఓటర్ అధికార్ యాత్ర’లో భాగంగా అరారియా జిల్లాలో ఆదివారం బహిరంగ సభలో, అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.
‘‘నా యాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఓటు చోర్, గద్దీ ఛోడ్ (ఓట్ల దొంగా, దిగిపో) అంటూ ఆరేళ్ల బాలుడు సైతం నినదిస్తున్నాడు’’ అన్నారు. ‘‘బిహార్‌లో ఎస్‌ఐఆర్ ముసుగులో ఏకంగా 65 లక్షల మంది ఓటర్లను ముసాయిదా జాబితా నుంచి తొలగించారు. దీనిపై బీజేపీ నోరువిప్పడం లేదు. బీజేపీ, ఈసీ కుమ్మక్కుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఈసీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నానంటూ నాపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. ఎస్‌ఐఆర్‌ను బిహార్ ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు’’ అని చెప్పారు.
‘ఇండియా’దే గెలుపు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు విపక్ష ‘ఇండియా’ కూటమిదేనని రాహుల్ ధీమా వెలిబుచ్చారు. ‘‘కూటమి పార్టీలన్నీ కలిసికట్టుగా పని చేస్తున్నాయి. పరస్పరం గౌరవించుకుంటున్నాయి. మేం కలిసి పోటీ చేస్తాం. గెలుస్తాం. దీనిపై మా మేనిఫెస్టో కమిటీ కార్యాచరణ ప్రారంభించింది. రైతు సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం’’ అని వెల్లడించారు.