
నోట్ రాసి ప్రాణం తీసుకున్న బాలుడు
కోల్‌కతా: పాపం 12 ఏళ్ల పసివాడు! చిప్స్ దొంగిలించాడని అభాండం వేయడమే గాక అందరిముందు దండించడాన్ని, తల్లి కూడా తననే తప్పుబట్టడాన్ని తట్టుకోలేకపోయాడు. ఏకంగా పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. ‘నేను చిప్స్ దొంగిలించలేదమ్మా’ అంటూ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు! ఈ దారుణం పశ్చిమబంగాల్‌లో పశ్చిమ మేదినీపూర్ జిల్లాలోని పన్‌స్కురాలో జరిగింది.
ఏడో తరగతి చదువుతున్న క్రిషేందు దాస్ చిప్స్ ప్యాకెట్ కొనడానికి ఓ దుకాణానికి వెళ్తే ఎవరూ కన్పించలేదు. ‘మామయ్య! చిప్స్ కావాలి’ అని యజమాని శుభాంకర్ దీక్షిత్‌ను ఎంత పిలిచినా స్పందన రాలేదు. దాంతో ఒక ప్యాకెట్ చిప్స్ తీసుకుని వెనుదిరిగాడు. అప్పుడొచ్చి చూసిన దీక్షిత్ కోపంతో క్రిషేందును దుకాణానికి లాక్కొచ్చి చెంపదెబ్బ కొట్టాడు. అందరి ముందూ గుంజిళ్లు తీయించడమే గాక బాలుని తల్లిని పిలిపించాడు.
ఆమె కూడా కొడుకునే తిట్టి చెంపదెబ్బ కొట్టింది. ఎంత పిలిచినా దీక్షిత్ రానందుకే చిప్స్ తీసుకున్నానని, తరువాతైనా డబ్బులు ఇచ్చేవాడినని ఎంత చెప్పినా ఎవరూ విన్లేదు. దాంతో అందరి ముందూ దాస్ క్షమాపణలు చెప్పాడు. అయినా తాను అబద్ధం చెబుతున్నాడని దీక్షిత్ పదేపదే తిట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లోకెళ్లగానే గదిలోకి దూరి గడియ వేసుకున్నాడు.
దాంతో తల్లి ఇరుగుపొరుగును పిలిచి తలుపు పగలగొట్టింది. అప్పటికే బాబు నోటి నుంచి నురగలు వస్తున్నాయి. పక్కన సగం తాగిన పురుగుమందుల సీసా, బెంగాలీలో నోట్ కనిపించింది. ‘‘అమ్మా! నేను దొంగను కాదు. దొంగతనం చేయలేదు. చాలాసేపు పిలిచినా మామయ్య (దుకాణదారు) రాలేదు. అందుకే కుర్కురే ప్యాకెట్ తీసుకున్నా. అవంటే నాకెంతో ఇష్టం కదా! ఇవి నా చివరి మాటలు. పురుగుమందు తాగినందుకు క్షమించు’’ అని అందులో రాశాడు.