‘సంప్రదాయ పోలీసింగ్‌’ బలోపేతం

Police Forces Should Be Trained In Emerging Technologies - Sakshi

డీజీపీలు/ఐజీపీల సదస్సులో మోదీ పిలుపు

న్యూఢిల్లీ: పోలీసు దళాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. కొత్త టెక్నాలజీలో సుశిక్షితులు కావాలన్నారు. అదేసమయంలో సంప్రదాయ పోలీసింగ్‌ విధానాలను బలోపేతం చేసుకోవాలని చెప్పారు. ఆదివారం డైరెక్టర్‌ జనరల్స్‌ ఆఫ్‌ పోలీస్‌/ఇన్‌స్పెక్టర్‌ జనరల్స్‌ ఆఫ్‌ పోలీస్‌ 57వ అఖిల భారత సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు.

రాష్ట్ర పోలీసులు, కేంద్ర భద్రతా సంస్థలు పరస్పరం సహకారం పెంపొందించుకోవాలని అన్నారు. ఉత్తమమైన విధానాలను పంచుకోవాలని తెలిపారు. వాడుకలోని లేని క్రిమినల్‌ చట్టాలను రద్దు చేయాలని అభిప్రాయపడ్డారు. పోలీసు శాఖ ప్రమాణాలను మరింత పెంచాల్సి ఉందన్నారు. వివిధ దర్యాప్తు సంస్థల నడుమ డేటాను ఇచ్చిపుచ్చుకొనే విధానం బలపడాలని, ఇందుకోసం నేషనల్‌ డేటా గవర్నెన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు.

ఇక జైళ్ల సమర్థ నిర్వాహణకు సంస్కరణలు చేపట్టాలని తెలిపారు. నూతన సవాళ్లు, పరిష్కార మార్గాలపై చర్చించుకొనేందుకు పోలీసు ఉన్నతాధికారుల సదస్సులు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా నిర్వహించుకోవాలని సూచించారు. డీజీపీలు/ఐజీపీల సదస్సుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ హాజరయ్యారు. నేషనల్‌ సెక్యూరిటీ, కౌంటర్‌ టెర్రరిజం, సైబర్‌ సెక్యూరిటీ వంటి అంశాలపై సదస్సులో చర్చించారు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 600 మందికిపైగా అధికారులు పాల్గొన్నారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top