
వరద బాధితులకు ప్రధాని నరేంద్ర మోదీ భరోసా
హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లో పర్యటన
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే
తక్షణ సాయం కింద హిమాచల్‌కు రూ.1,500 కోట్లు, పంజాబ్‌కు రూ.1,600 కోట్లు
ధర్మశాల/చండీగఢ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. నీట మునిగిన పంట పొలాలు, ధ్వంసమైన ఇళ్లు, రహదారులను స్వయంగా పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. భారీ వర్షాలు, వరదలకు తోడు కొండచరియలు విరిగిపడడంతో తీవ్రంగా నష్టపోయిన హిమాచల్ ప్రదేశ్‌కు తక్షణ సాయం కింద రూ.1,500 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వరదల్లో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం ఇస్తామని వెల్లడించారు.
హిమాచల్ ప్రదేశ్‌లో ఏరియల్ సర్వే అనంతరం కాంగ్రా పట్టణంలో ప్రధాని మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు. సహాయ పునరావాస చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌సింగ్ సుఖూ పాల్గొన్నారు. వరద బాధితులు సైతం హాజరై తమ గోడు వినిపించారు. తమను ఆదుకోవాలని ప్రధాని మోదీని వేడుకున్నారు.
కచ్చితంగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. వరదల్లో దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. ధ్వంసమైన ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పునరి్నరి్మంచాలని సూచించారు. రాష్ట్రంలో ఈ ఏడాది జూన్ 20 నుంచి సెపె్టంబర్ 8 దాకా వరదలు, కొండచరియల కారణంగా ఏకంగా 370 మంది మృతిచెందారు.
పంజాబ్‌లో సహాయక చర్యలపై ఆరా
ప్రధాని మోదీ హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటన అనంతరం పంజాబ్‌కు చేరుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే నిర్వహించారు. బాధితులను కలిసి మాట్లాడారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని, ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలతోనూ మాట్లాడారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. గురుదాస్‌పూర్‌లో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
పంజాబ్‌కు తక్షణ సాయం కింద రూ.1,600 కోట్లు అందజేస్తామని ప్రకటించారు. భారీ వర్షాలతోపాటు సట్లెజ్, బియాస్, రావి నదులు ఉప్పొంగి ప్రవహించడంతో పంజాబ్‌లో భారీ నష్టం వాటిల్లింది. 51 మంది మరణించారు. 1.84 లక్షల హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. రూ.13,000 కోట్ల నష్టం జరిగినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. రూ.20,000 కోట్ల సహాయ ప్యాకేజీ ప్రకటించాలని ప్రధాని మోదీని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది.

చిన్నారి నీతికతో మోదీ
హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రాలో సమీక్షా సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ 14 నెలల చిన్నారి నీతికను ఎత్తుకొని బుజ్జగించారు. ప్రకృతి విలయం వల్ల అనాథగా మారిన నీతిక దీనగాథ విని ఆయన చలించిపోయారు. హిమాచల్‌ప్రదేశ్‌లో మండీ జిల్లాలోని తల్వార గ్రామంలో జూన్ 30న రాత్రిపూట హఠాత్తుగా భారీ వర్షం కురిసింది. గ్రామంపై కొండ చరియలు విరుచుకుపడ్డాయి. ఓ ఇంట్లో రమేశ్ కుమార్(31), రాధాదేవి(24) దంపతులు తమ కమార్తె నీతికతోపాటు తల్లి పూనమ్‌దేవితో కలిసి నిద్రిస్తున్నారు. ఇంట్లోకి బురద చొచ్చుకొచ్చింది.
నీతికను వంట గదిలో పడుకోబెట్టి బురదను తొలగించేందుకు ముగ్గురూ ప్రయత్నించారు. ఇంతలో భారీ కొండచరియ ఆ ఇంటిపైకి దూసుకొచ్చింది. వంట గది మినహా ఆ ముగ్గురున్న గది నేలమట్టమైంది. రమేశ్ కుమార్, రాధాదేవి, పూనమ్‌దేవి బురదతోపాటు కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు. వంట గదికి నష్టం జరగకపోవడంతో నీతిక ప్రాణాలతో బయటపడింది. ఆ సమయంలో నీతిక వయసు 11 నెలలే. నీతికను హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం ‘చైల్డ్ ఆఫ్ ద స్టేట్’గా ప్రకటించింది. ఆమె చదువుతోపాటు జీవనానికి అయ్యే ఖర్చులు భరిస్తామని ప్రకటించింది.