 
													అంత ధైర్యం మోదీకి లేదు
రాహుల్ గాంధీ వ్యాఖ్య
షేక్‌పురా(బిహార్): ఆపరేషన్ సిందూర్ వేళ భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే చేస్తున్న వాదనలకు అడ్డుకట్ట వేసే ధైర్యం ప్రధాని మోదీకి అస్సలు లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. బిహార్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలో భాగంగా గురువారం నలంద, షేక్‌పురాలో సభలో రాహుల్ ప్రసంగిస్తూ మోదీపై విమర్శల వాగ్భాణాలు సంధించారు.
‘‘తన కారణంగానే భారత్, పాక్ యుద్ధం ఆగిందని ఇప్పటికే ఎన్నో సార్లు ట్రంప్ అంతర్జాతీయ వేదికలపై డప్పు కొట్టారు. ఆయన ప్రకటనలను ప్రధాని మోదీ కనీసం అడ్డుకునే సాహసం చేయట్లేరు. మీరు మాట్లాడేది అబద్ధం అని మాట వరసకు కూడా ట్రంప్‌కు చెప్పే ధైర్యం మోదీకి లేదు. ఇటీవల కాలంలో మోదీ అమెరికాకు వెళ్లాల్సింది. కానీ ట్రంప్ భయానికే ఆయన అమెరికా వైపు కన్నెత్తి చూడట్లేరు. నిజంగానే మోదీకి అంతటి ధైర్యం ఉంటే బిహార్ ఎన్నికల ర్యాలీల్లో యుద్ధం ఆపింది ట్రంప్ కానేకాదు అని మోదీ కరాఖండీగా ప్రకటించాలి’’అని రాహుల్‌సవాల్ విసిరారు. 
ధైర్యశాలి ప్రధాని అంటే మా నాన్నమ్మే 
‘‘నిజానికి ప్రధాని అంటే ఎంతటి ధైర్యశాలిగా ఉండాలో మా నాన్నమ్మ, నాటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీని చూసి నేర్చుకోవాలి. 1971లో నాటి అమెరికా అధ్యక్షుడితో ఇందిర సూటిగా ‘మాకు మీరంటే ఏమాత్రం భయంలేదు’అని ముఖం మీదే చెప్పేశారు. ఆమె తెగింపు గల నాయకురాలు’’అని ఇందిరను రాహుల్ గుర్తుచేసుకున్నారు. బిహార్‌లో భూములు అందుబాటులో లేవన్న అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘బడా పారిశ్రామిక సంస్థకు చవగ్గా భూములు అమ్మేస్తూ పోతే ఇక భూముల లభ్యత ఎలా సాధ్యం?’’అని ప్రశ్నించారు.  

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
