భారత పర్యాటకంలో కొత్త యుగం ఆరంభం: ప్రధాన మోదీ

PM Narendra Modi Flags Off World Longest River Cruise Ganga Vilas - Sakshi

వారణాసి: అభివృద్ధి చెందిన భారత్‌ నిర్మాణానికి ప్రాంతాల మధ్య బలమైన అనుసంధానం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన ప్రయాణం సాగించే నదీ పర్యాటక నౌక ‘ఎంవీ గంగా విలాస్‌’కు ఆయన శుక్రవారం వర్చువల్‌గా జెండా ఊపారు. ఉత్తరప్రదేశ్‌లోని చారిత్రక నగరం వారణాసి నుంచి నౌక ప్రయాణం ఆరంభమైంది. 

అలాగే వారణాసిలో గంగా నది ఒడ్డున నిర్మించిన టెంట్‌ సిటీని ప్రధాని మోదీ ప్రారంభించారు. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బిహార్, అస్సాంలో రూ.1,000 కోట్లకుపైగా విలువైన పలు ఇన్‌లాండ్‌ వాటర్‌ వేస్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతోపాటు మరికొన్నింటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. కాశీ–దిబ్రూగఢ్‌ నదీ పర్యాటక నౌకతో ఉత్తర భారతదేశంలోని పర్యాటక ప్రాంతాలకు ఇక ప్రపంచ టూరిజం పటంపై ప్రత్యేక స్థానం లభిస్తుందని ఉద్ఘాటించారు. ఆయా ప్రాంతాల అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందన్నారు. 

నరేంద్ర మోదీ ఇంకా ఏం చెప్పారంటే..  

నమామి గంగా, అర్థ్‌ గంగా..
‘‘భారతీయుల జీవితాల్లో పవిత్ర గంగా నదికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గంగానది పరిసర ప్రాంతాలు అభివృద్దిలో వెనుకబడ్డాయి. అభివృద్ధి లేక ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు పెరిగాయి. సమస్య పరిష్కారానికి రెండంచెల వ్యూహం అమలు చేస్తున్నాం. అందులో ఒకటి గంగా నది ప్రక్షాళన కోసం ఉద్దేశించిన ‘నమామి గంగా’ పథకం. మరొకటి ‘అర్థ్‌ గంగా’. నదీ తీర రాష్ట్రాల్లో ఆర్థిక ప్రగతిని పెంపొందించే వాతావరణం సృష్టిస్తున్నాం. గంగా విలాస్‌ నౌకలో విహరించేందుకు 32 మంది స్విట్జర్లాండ్‌ వాసులు ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషకరం. అన్ని దేశాల నుంచి పర్యాటకులను సాదరంగా ఆహ్వానిస్తున్నాం.

పర్యాటకంలో కొత్త యుగానికి ఆరంభం  
గంగా నదిలో పర్యాటక నౌక ప్రయాణం ప్రారంభం కావడం ఒక మైలురాయి లాంటి సందర్భం. భారతదేశ పర్యాటక రంగంలో కొత్త యుగానికి ఇదొక ఆరంభం.  పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకుంటే కొత్త ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. దేశంలోని నదులు జల శక్తికి, వాణిజ్యానికి, పర్యాటకానికి కొత్త ఊపును తీసుకురానున్నాయి. 2014 కంటే ముందు జలమార్గాలపై పాలకులు దృష్టి పెట్టలేదు. 2014 తర్వాత జల మార్గాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. జాతీయ జలమార్గాలను ఐదు నుంచి 111కు పెంచాం. జల మార్గాల్లో సరుకు రవాణా 30 లక్షల మెట్రిక్‌ టన్నుల నుంచి మూడింతలు పెరిగింది’’ అని మోదీ అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top