
బెంగళూరు: కర్ణాటకలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విషాద యాత్ర సందర్భంగా విషాదం నెలకొంది. విహార యాత్రకు వెళ్లిన వ్యక్తులు.. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు ఏడుగురు గల్లంతు అవగా.. ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలో మార్కోనహళ్లి ప్రాజెక్ట్ వద్దకు 15 మంది కలిసి విహార యాత్రకు వెళ్లారు. అనంతరం, వారిలో ఒక మహిళ, ఆరుగురు పిల్లలు కలిసి.. నీళ్లు ఉన్న ప్రాంతం వద్ద ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. దీంతో, నీటిలో గల్లంతయ్యారు. వారిని కాపాడేందుకు నవాజ్ అనే వ్యక్తి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
పిల్లలను కాపాడే క్రమంలో నవాజ్ కూడా నీటిలో కొట్టుకుపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, రెస్య్కూ బృందాల అక్కడి చేరుకుని వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కేవలం నవాజ్‌ను మాత్రమే ప్రాణాలతో కాపాడారు. అనంతరం, ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన మహిళ, పిల్లల కోసం గాలిస్తున్నారు. ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, వీరంతా కర్ణాటకలోని తుమకూరుకు చెందిన వారిగా గుర్తించారు. విహార యాత్రకు వెళ్లి తమ పిల్లలు ఇలా చనిపోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.