విశాఖపట్నం నుంచి తొలిసారిగా కొరాపుట్‌కు రైలు.. షాకిచ్చిన ప్రయాణికులు

Orissa: No Passengers In Visakhapatnam Koraput Vistadome Coach - Sakshi

అరకు మీదుగా కొరాపుట్‌కు విస్టాడోం కోచ్‌ డిమాండ్‌ చేసిన ప్రజలు 

రాయగడ మీదుగా వెళ్లే రైలుకు అనుసంధానించిన అధికారులు

కొరాపుట్‌(భువనేశ్వర్‌): ఎద్దు ఈనిందంటే.. తీసుకొచ్చి వాకిట్లో కట్టేయమన్న చందంగా ఉంది ఈస్టుకోస్టు రైల్వే అధికారుల తీరు. ప్రజలు డిమాండ్‌ చేశారు. అధికారులు మంజూరు చేశారు. కానీ రైలు ఏ మార్గంలో నడపాలో పట్టించుకోక పోవడంతో డొల్లతనం బయటపడింది. విశాఖపట్నంలో ఉదయం 6.35 గంటలకు ప్రత్యేక రైలు బయలుదేరి, రాయగడ మీదుగా తొలిసారిగా కొరాపుట్‌ చేరుకున్న విస్టాడోం కోచ్‌లో ఒక్కరు కూడా ప్రయాణించ లేదు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో రైల్వేశాఖ సిబ్బందే సమాధానం చెప్పాల్సి ఉంది.

వాస్తవానికి విశాఖపట్నం నుంచి అరకు ప్రయాణించే కిరండూల్‌ రైలు(18551) కొరాపుట్‌ మీదుగా జగదల్‌పూర్‌ వెళ్తుంది. తూర్పు కనుమల్లో ఉన్న ఈ మార్గమంతా ప్రకృతి అందాలతో ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు రైల్వేశాఖ కిరండూల్‌ రైలుకు విస్టాడోం కోచ్‌ను గతంలోనే అనుసంధానించారు. దీనిని కొరాపుట్‌ వరకు నడపాలని స్థానిక ప్రజలు డిమాండ్‌ చేశారు. అయితే ప్రతిపాదనకు ఆమోదించిన ఈస్టుకోస్టు రైల్వే అధికారులు.. కోచ్‌ను మాత్రం రాయగడ మీదుగా కొరాపుట్‌ వెళ్లే రైలుకు అనుసంధానించి, చేతులు దులుపుకొన్నారు.

మరోవైపు విశాఖపట్నం నుంచి కొరాపుట్‌కు నిడిపే ప్రత్యేక రైలు(08545)లో సాధారణ టిక్కెట్‌ ధర కేవలం రూ.140లు ఉండగా.. విస్టాడోం కోచ్‌లో రూ.1,300లుగా ఉంది. అరుకు మీదుగా కొరాపుట్‌ చేరు కిరండూల్‌ రైలులో సాధారణ టిక్కెట్‌ రూ.85 మాత్రమే. ఈ లెక్కను అరకు అందాలు చూడకుండా రాయగడ మీదుగా విస్టాడోంలో ప్రయాణించేందుకు అదనంగా రూ.1,160లు చెల్లించేందుకు ప్రయాణికులు ఆసక్తిగా ఉండరని రైల్వేశాఖ గమనించలేదు. అలాగే తిరుగు ప్రయాణంలో రైలు అరకు వెళ్లదని తెలిసి, పర్యాటకుల్లో అసంతృప్తి నెలకొంది.

చదవండి: పెళ్లిలో ‘షేర్వాణీ’ రగడ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top