
సైబరాబాద్ పోలీసులపై జాతీయ ఎస్టీ కమిషన్ ఆగ్రహం
సినీ నటుడు విజయ్ దేవరకొండ కేసుపై వాదనలు
ఏసీపీ శ్రీధర్ హాజరు కావడంపై అసహనం
15 రోజుల్లో కమిషనర్ వచ్చి సమాధానమివ్వాలని ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: ‘విచారణకు పోలీసు కమిషనర్ కదా హాజరు కావాల్సింది? ఏసీపీ గారూ మీరెందుకు వచ్చారు? అధికారులకు ఈమాత్రం తెలియదా?’అని సైబరాబాద్ పోలీసులపై జాతీయ ఎస్టీ కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. 15 రోజుల్లో సైబరాబాద్ పోలీసు కమిషనర్ విచారణకు స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. ఒకవేళ ఆయన హాజరు కాకపోతే తదుపరి విచారణ తేదీకి రాష్ట్ర డీజీపీని రప్పిస్తామని హెచ్చరించింది. సినీ నటుడు విజయ్ దేవరకొండ గిరిజనులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై విచారణ సందర్భంగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ ఈ హెచ్చరిక చేశారు.
ఏప్రిల్ 26న రెట్రో సినిమా వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. భారత్, పాక్ మధ్య సమస్యను ప్రస్తావించే క్రమంలో గిరిజనులను కించపర్చే అర్థం వచ్చేలా పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై గిరిజన సంఘం నాయకుడు అశోక్‌కుమార్ రాథోడ్ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అశోక్ కుమార్ రాథోడ్ జాతీయ ఎస్టీ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేయటంతో కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ బుధవారం విచారణ చేపట్టారు.
విచారణకు పోలీస్ కమిషనర్ కాకుండా మాదాపూర్ ఏసీపీ శ్రీధర్ హాజరు కావటంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘లక్షల మందిని ప్రభావితం చేసే ఒక నటుడు ఒక వర్గాన్ని కించపర్చేలా ఎలా మాట్లాడతారు? ఆయన వ్యాఖ్యలపై మీరు కేసు నమోదు చేశారు బాగానే ఉంది. ఈ రోజు (బుధవారం) విచారణకు పోలీసు కమిషనర్ హాజరు కావాలని మేం నోటీసులు ఇచ్చాం కదా? ఆయన కదా హాజరు కావాల్సింది? మీరెందుకు వచ్చారు?’అని నిలదీశారు. మరో 15 రోజుల్లో విచారణకు కమిషనర్ హాజరై హీరో విజయ్ దేవరకొండపై తీసుకున్న చర్యలను వివరించాలని ఆదేశించారు. ఆ రోజు కమిషనర్ రాకపోతే డీజీపీని రప్పిస్తామని హెచ్చరించారు.