బడ్జెట్ 2021: మొబైల్ ప్రియులకు షాకింగ్ న్యూస్!

Mobile Phones May Get Costlier as Govt Revokes Few Exemptions - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ మొబైల్‌ ప్రియులకు షాకిచ్చింది. బడ్జెట్ 2021 ప్రసంగంలో మొబైల్ విడిభాగాలపైన 2.5శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఆయా వస్తువులపై కస్టమ్స్‌ డ్యూటీ ఐదు నుంచి పది శాతం పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల ఫోన్లు, ఛార్జర్ల ధర 1 నుండి 2 శాతం వరకూ పెరగవచ్చని విశ్లేషకులు అంటున్నారు. (చదవండి: లీకైన శాంసంగ్ ఏ72 ధర, ఫీచర్స్)

ఛార్జర్లపై సుంకాన్ని 15 నుంచి 30 శాతానికి, మదర్‌బోర్డ్‌లపై సుంకాన్ని 10 నుంచి 20 శాతానికి, మొబైల్‌ తయారీలో వినియోగించే ఇతర పరికరాలపై కూడా సుంకాన్ని పెంచారు. మొబైల్‌ ఫోన్లకు ఇస్తున్న 10 శాతం సర్వీస్‌ వెల్ఫేర్‌ సెస్‌ మినహాయింపును కూడా ఈసారి రద్దు చేశారు. మొబైల్ ఫోన్‌లలో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి అవసరమైన భాగాలు, ఉప భాగాలపై ఇప్పటివరకు ఎటువంటి పన్ను విధించలేదు. కానీ, ఇప్పుడు 2.5 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు పేర్కొన్నారు.(చదవండి: బడ్జెట్‌ 2021: ధరలు పెరిగేవి.. తగ్గేవి ఇవే!)

ఇదిలా ఉంటే.. దేశీయంగా ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించేందుకు ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ప్రపంచ ఉత్పత్తి గొలుసులో భారత్‌ను భాగస్వామిగా చేసేందుకు , ఉద్యోగావకాశాలను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం తెలిపింది. మేకిన్‌ ఇండియా విధానంలో భాగంగానే మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రిక్‌ వాహనాలు, వాటి విడిభాగాలపై కస్టమ్స్‌ సుంకాల రేట్లలో పెరుగుదల ఉంటుంది. ఈ చర్య వల్ల దేశీయ ఉత్పత్తి సామర్ధ్యం పెరగనున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఐతే దిగుమతి సుంకంలో పెరుగుదల ప్రభావం వినియోగదారులపై అంతగా ఉండకపోవచ్చని.. దేశీయ మొబైల్‌ ఫోన్‌ మార్కెట్ 97 శాతం అవసరాలు స్థానిక ఉత్పత్తుల వల్లనే సరిపోతాయని కొందరు పరిశీలకులు అంటున్నారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top