ఎంఈఐఎల్‌కు జోజిల్లా పాస్ టన్నెల్ పనులు

MEIL Bags contract for Zojila tunnel Works - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన హిమాలయాల్లోని జమ్మూకశ్మీర్- లడఖ్‌లోని జోజిల్లా పాస్ టన్నెల్ పనికి సంబంధించిన టెండర్లలో ఎంఈఐఎల్ ఎల్-1 గా నిలిచింది. శుక్రవారం (21-08-2020) జాతీయ రహదారులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌ (NHIDCL) ఫైనాన్స్ బిడ్లను తెరవగా ఎంఈఐఎల్ మిగిలిన సంస్థల కన్నా తక్కువ ధరకు కోట్ చేయడం ద్వారా తొలి స్థానంలో నిలిచింది. 

ఇంతవరకు దేశంలో ఎక్కడా నిర్మించని పద్ధతిలో అధునాతనమైన రీతిలో క్లిష్టమైన పరిస్థితిలో ఈ పనిని చేపట్టాల్సి ఉంటుంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ రోడ్ టన్నెల్‌కు సంబంధించిన పనులను ఎట్టకేలకు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి టెండర్లను పిలిచింది. ఇందులో జోజిల్లా టన్నెల్ కు సంబంధించి 14.15 కిలోమీటర్ల రహదారి నిర్మాణం, ఇతర రోడ్ పనులకు గాను వేరే సంస్థలు అధిక ధరలకు కోట్ చేయగా ఎంఈఐఎల్ 4509.50 కోట్ల రూపాయలకు పనులు చేసేందుకు ముందుకు వచ్చింది. మిగిలిన రెండు కంపెనీలతో పోలిస్తే ఎంఈఐఎల్ తక్కువ ధరకు కోట్ చేయడం ద్వారా ఎల్-1 నిలిచింది. 

జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ నుంచి లడఖ్ లేహ్ ప్రాంతానికి ఉన్న రహదారి ఏడాది పొడవునా వాహనాలు ప్రయాణించేందుకు అనుకూలంగా ఉండడం లేదు. హిమాలయాల్లో ముఖ్యంగా శీతాకాలంతో పాటు మొత్తం ఆరు నెల్లపాటు శ్రీనగర్- లడఖ్ రహదారిని పూర్తిగా మూసివేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మిలటరీ వాహనాలు కూడా ప్రయాణించలేకపోతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల్లో సుదీర్ఘ దూరం ప్రయాణించడానికి అత్యధిక వ్యయ ప్రయాసాలతో పాటు సమయం కూడా వృధా అవుతోంది. ఈ పరిస్థితుల్లో సోనామార్గ్ నుంచి కార్గిల్ మీదుగా లేహ్, లడఖ్ కు రహదారి టన్నెల్ నిర్మించాలని ఎప్పుడో ప్రతిపాదించారు. అయితే ఆచరణలో మొదటి అధ్యాయం ఇప్పటికి సాధ్యం అయ్యింది. 

ఎంఈఐఎల్ ఎల్-1 గా నిలిచిన పనిని జాతీయ రహదారి-1లోని జడ్ -మోర్హ (Z-Morh) టన్నెల్ నుంచి జోజిల్లా టన్నెల్ వరకు కనెక్టింగ్ టన్నెల్‌ను జోజిల్లా పాస్ ప్రాంతంలో సోనామార్గ్- కార్గిల్ మధ్య నిర్మిస్తారు. ఈపీసీ పద్ధతిలో పిలిచిన ఈ పని అత్యంత క్లిష్టమైనది. ప్రపంచంలో ఇంతవరకు ఏ రహదారి టన్నెల్ నిర్మాణంలో ఎదురుకాని అవాంతరాలు ఈ టన్నెల్ నిర్మాణంలో ఎదురుకానున్నాయి. సరాసరిన భూ ఉపరితలం నుంచి 700 మీటర్ల దిగువన టన్నెల్ను నిర్మించాల్సి వస్తుంది. పూర్తిగా క్లిష్టమైన కొండ ప్రాంతంతో పాటు మంచు తుఫాన్‌లు తరచూ సంభవిస్తుంటాయి. దట్టమైన మంచు సంవత్సరంలో 8 నెలల పాటు ఉండడం వల్ల పనులు చేయడం అంత సులభం కాదు. అదే సమయంలో పక్కనే నది కూడా ప్రవహిస్తోంది. దీనివల్ల నిర్మాణ సమయంలో నీరు, మంచు ప్రవేశించి తీవ్ర సమస్యలు ఎదురవుతాయని భావిస్తున్నారు. అమరనాథ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు కూడా ఈ టన్నెల్ రహదారి వాడవచ్చు. ఈ యాత్రకు వెళ్లే వారికి కార్గిల్ సమీపంలోని బల్తల్ బేస్ క్యాంప్‌గా ఉంది.

సింగిల్ ట్యూబ్ టన్నెల్ గా పిలిచే ఈ జోజిల్లా రహదారిలో రెండు వైపులా ప్రయాణించే (బై డైరెక్షనల్ ట్రాఫిక్) రెండు లైన్ల రహదారి నిర్మించాల్సి ఉంటుందని ఎంఈఐఎల్ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ సిహెచ్ సుబ్బయ్య తెలిపారు. రిటైనింగ్ గోడలు, బ్రిస్ట్ గోడలు, గేబియన్ నిర్మాణాలు, మట్టితో నిర్మించే గోడలు మొత్తం దాదాపు 10 కిలోమీటర్ల వరకు ఎంఈఐఎల్ నిర్మించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మంచు తుఫాన్‌లు తలెత్తితే ఎటువంటి ప్రమాదం లేకుండా క్యాచ్ డ్యామ్స్, ఎయిర్ బ్లాస్ట్, ప్రొటెక్షన్ గోడలు, డిఫ్లెక్టర్ డ్యామ్స్ దాదాపు 6 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top