
మ్యాతరి సిద్ధయ్య, నిడమానూరి హుస్సేన్‌లకు రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకాలు
మొత్తం 21 మంది పోలీస్ అధికారులు, సిబ్బందికి పతకాలు
79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన కేంద్రం
సాక్షి , న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన కానిస్టేబుల్ కాట్రవత్ రాజు నాయక్ శౌర్య పతకానికి ఎంపికయ్యారు. ఏఎస్‌ఐ మ్యాతరి సిద్ధయ్య, కానిస్టేబుల్ నిడమానూరి హుస్సేన్‌లకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు లభించాయి. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు, సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీసెస్‌కు చెందిన మొత్తం 1,090 మంది అధికారులకు శౌర్య, సేవా పోలీస్ పతకాలను ప్రకటించింది. కేంద్ర హోంశాఖ గురువారం ఈ మేరకు జాబితాను విడుదల చేసింది.
మరో 18 మందికి పతకాలు
దేశవ్యాప్తంగా 226 మందికి శౌర్య పతకాలు (జీఎం), 89 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు (పీఎస్‌ఎం), 635 మందికి ప్రతిభాపూర్వక సేవా పతకాలు (ఎంఎస్‌ఎం) ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రానికి చెందిన ఒకరికి శౌర్య పతకం, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు రాగా.. 11 మంది పోలీసులకు, నలుగురు అగ్నిమాపక శాఖ అధికారులకు, ఇద్దరు హోంగార్డులకు, కరెక్షనల్ సర్వీసెస్ కింద ఒకరికి ప్రతిభాపూర్వక సేవా పతకాలు లభించాయి.
ప్రాణాలు, ఆస్తులను కాపాడటంలో, నేరాలను నిరోధించడంలో లేదా నేరస్తులను అరెస్టు చేయడానికి విధి నిర్వహణలో ప్రదర్శించిన శౌర్యం, తెగువ ఆధారంగా రాష్ట్రపతి శౌర్య పతకం (పీఎంజీ), శౌర్య పతకాలను కేంద్రం అందజేస్తోంది. విధి నిర్వహణలో అందించిన విశిష్ట సేవకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం, విలువైన సేవకు ప్రతిభాపూర్వక సేవా పతకం (ఎంఎస్‌ఎం) ఇస్తున్నారు.
ఉత్తమ ప్రతిభకు ‘ఉన్నత’ పతకం
సిద్ధయ్య సేవలను గుర్తించిన కేంద్రం
సంగారెడ్డి జోన్: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల పరిధిలోని సింగింతం గ్రామానికి చెందిన మ్యాతరి సిద్ధయ్య రాష్ట్రపతి విశిష్ట సేవా పతకానికి ఎంపికయ్యారు. సిద్ధయ్య 1990లో పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. తొలుత కొండాపూర్ పోలీస్ స్టేషన్‌లో విధుల్లో చేరారు. ఆ తర్వాత వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తించారు. సీఐడీ సంగారెడ్డి రీజనల్ ఆఫీస్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహించి వివిధ కేసుల సత్వర పరిష్కారంలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు.
ఈ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం విశిష్ట సేవా పతకానికి ఎంపిక చేసింది. సిద్ధయ్య గతంలో ఇండియన్ పోలీస్ మెడల్ పతకాన్ని పొందారు. ఇటీవల పదోన్నతి పొంది పటాన్‌చెరులో ట్రాఫిక్ విభాగంలో ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. అవార్డుకు ఎంపిక కావటంతో సిద్ధయ్యతో పాటు అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
రక్తమోడుతున్నా ఉడుం పట్టు పట్టి..
కరడుగట్టిన దోపిడీ దొంగను పట్టుకున్న రాజు నాయక్
హైదరాబాద్ (గచ్చిబౌలి): భార్యాభర్తలను హత్య చేసి దోపిడీకి పాల్పడి పరారైన కరడుగట్టిన నేరస్తుడిని పట్టుకోవడంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన కానిస్టేబుల్ కట్రావత్ రాజు నాయక్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన శౌర్య పతకం ప్రకటించింది. 2023 జనవరి 5న నార్సింగి పీఎస్ పరిధిలోని ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డులో పాత నేరస్తుడు కరణ్‌సింగ్, మరో వ్యక్తితో కలిసి.. భార్యాభర్తలను హత్య చేశాడు. మరో వ్యక్తి వద్ద రూ.15 వేలు లాక్కుని ఇద్దరూ ఉడాయించారు.
మాదాపూర్ ఎస్‌వోటీలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రాజు మరో కానిస్టేబుల్‌తో కలి సి కరణ్ సింగ్‌ను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యా రు. మరుసటి రోజు జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో ఉన్న ట్లు కనుగొని అక్కడికి వెళ్లారు. బైక్‌పై కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న కరణ్‌సింగ్‌ను రాజు నాయక్ పట్టుకున్నారు. కరణ్‌సింగ్ తన వద్ద ఉన్న కత్తితో రాజు ఛాతీ, తలపై దాడికి పాల్పడ్డాడు. శరీరమంతా రక్తసిక్తమైనా కరణ్‌సింగ్‌ను రాజు వదలకుండా పట్టుకున్నారు.
మరో కానిస్టేబుల్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రాజు నాయక్‌ను ఆస్పత్రికి తరలించగా..మూడు సార్లు శస్త్ర చికిత్స తర్వాత కోలుకున్నారు. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మక్తా వెంకటాపూర్‌కు చెందిన రాజు నాయక్ ఇటీవలే హెడ్ కానిస్టేబుల్ (3744)గా పదోన్నతి పొంది కొల్లూరు పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రతిష్టాత్మక అవార్డు రావడం సంతోషంగా ఉందని రాజు నాయక్ ‘సాక్షి’తో అన్నారు.
