వ్యాక్సినేషన్‌: ఒకటి నుంచి 60 ఏళ్లపైవారికి..

March 1st Second Phase Covid Vaccination Starts In India - Sakshi

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్‌కు విరుగుడుగా భారతదేశంలో వ్యాక్సినేషన్‌ పంపిణీ శరవేగంగా సాగుతోంది. కరోనా వారియర్స్‌గా ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది, అత్యవసర సేవకులుగా ఉన్న అధికార యంత్రాంగానికి ఇన్నాళ్లు వ్యాక్సినేషన్‌ వేసిన తెలిసిందే. ఇక మార్చి 1వ తేదీ నుంచి 60 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్‌ వేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరితో పాటు రెండు అంతకన్నా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్ల పైవయస్కులకు కూడా వ్యాక్సిన్‌ వేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. 

ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ బుధవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. దేశవ్యాప్తంగా 10 వేల ప్రభుత్వ, 20 వేల ప్రైవేటు వ్యాక్సినేషన్‌ కేంద్రాల ద్వారా వ్యాక్సిన్‌ వేస్తామని మంత్రి వివరించారు. అయితే ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా అందిస్తున్నట్లు, ప్రైవేటు కేంద్రాల్లో వేసుకోవాలని భావించేవారు రుసుము చెల్లించాలని తెలిపారు. ఈ వ్యాక్సినేషన్‌కు ఎంత మొత్తం చెల్లించాలనే విషయమై రెండు రోజుల్లో కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటిస్తుందని చెప్పారు. ఈ రెండో దశలో దాదాపు 27 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ వేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి ప్రకాశ్‌ వెల్లడించారు.

60 ఏళ్ల పైబడిన వారు 10 కోట్ల మంది ఉంటారని భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. మొదటి దశలో 1,07,67,000 మందికి వ్యాక్సినేషన్‌ వేసిన విషయం తెలిసిందే. అమెరికా తర్వాత వ్యాక్సిన్‌ అత్యధిక మందికి వేసిన దేశంగా భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. అత్యవసర వినియోగానికి భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన కోవాగ్జిన్‌, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తయారుచేసిన కోవిషీల్డ్‌ వినియోగిస్తున్న విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top