
వీలునామాల్లోకెల్లా ఇది వినూత్నమైనది
చివరి మజిలీలో చికిత్స ఎంపిక సౌలభ్యం
ముంబైలో తొలి ప్రైవేటు క్లినిక్ ప్రారంభం
ముందుచూపునకు నిదర్శనం వీలునామా. కుటుంబ ఆస్తులు, అప్పుల పంపకాలు.. నేత్రదానం.. ఇంకా చెప్పాలంటే ‘దేహదానం’పై అంతా బాగున్నప్పుడే వీలునామా రాసిపెట్టుకునే ఆనవాయితీ తెలిసిందే. ఈ కోవలోకి ఒక సరికొత్త వీలునామా వచ్చి చేరింది. అదే తన ‘ఆఖరి చికిత్స’ ఎలా ఉండాలనుకుంటున్నారో స్పష్టంగా ముందే రాసుకునే వీలునామా! కోర్టు మార్గదర్శకాల వెలుగులో మొగ్గ తొడిగిన ఆధునిక వ్యవస్థ. దీన్ని చట్టబద్ధంగా నమోదు చెయ్యటంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముంబైలో ఓ ప్రైవేటు క్లినిక్ ప్రతి శనివారం ప్రత్యేక ఓపీ సేవలందించటం కూడా ప్రారంభించింది. దేశంలోనే తొలి ‘లివింగ్ విల్’ పుట్టు పూర్వోత్తరాలు చదవండి!
ఆధునిక వైద్య సదుపాయాలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. మంచాన పడిన దాదాపు ప్రతి మనిషీ పెద్దాసుపత్రి ఐసీయూలోనే అంతిమ శ్వాస విడుస్తున్న పరిస్థితి నెలకొంది. కురువృద్ధులకైనా ఐసీయూ చికిత్సల అనివార్యత ఓ ఆనవాయితీగా స్థిరపడుతున్న సంధి కాలం ఇది. ఈ స్థితిలో ‘ఆఖరు మజిలీలో అనవసర ఆర్భాటపు చికిత్సలు, ఆస్తుల్ని కరిగించే కొండంత అప్పుల వేదన మన కుటుంబాలకు అవసరమా?’ అని కొందరు ఆలోచనాపరులు ప్రశ్నిస్తున్నారు.
తమకు మటుకు అటువంటి చివరి మజిలీ వీడుకోలు వద్దని, భీష్ముడిలా గౌరవంగా సహజ మరణం పొందే అవకాశాన్ని ఇవ్వాలని వీలునామాలు రాస్తున్నారు. ముంబై వాసులు కొందరు ఇలా వినూత్న వీలునామాలు రాయటమే కాదు, కోర్టు్ట సాయంతో ఈ సజీవమైన వీలునామా (లివింగ్ విల్)కు చట్టబద్ధతను సంతరింపజేశారు. ఈ కోవలో ముందు నడిచిన వ్యక్తి 55 ఏళ్ల సీనియర్ గైనకాలజిస్టు డాక్టర్ నిఖిల్ దాతర్.
లివింగ్ విల్ అంటే?
మనిషి ఎంత కూడబెట్టాడన్నది కాదు.. ఎంత సుఖంగా కన్నుమూశాడన్నది ముఖ్యం అంటారు పెద్దలు. ఈ ఆలోచన నుంచి పుట్టిందే లివింగ్ విల్ భావన. నయంకాని రోగాలతో మంచాన పడి, నిర్ణయం తీసుకోలేని స్థితిలో కటుంబ సభ్యులు మరణం ముంగిట ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు ఏ నిర్ణయం తీసుకోవాలనే సంకట స్థితిని ఎదుర్కోకుండా ‘లివింగ్ విల్’ స్పష్టత ఇస్తుంది.
సహజంగా మరణించాల్సిన చివరి క్షణాల్లో ఐసీయూ, వెంటిలేటర్ వంటి చికిత్సలు చేయించాలా వద్దా అనేది ముందే రాసి పెట్టుకోవటానికి వ్యక్తులకు ఈ వీలునామా దోహదపడుతుంది. అందువల్ల ఈ వీలునామాకు ‘అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్స్’ అనే పేరొచ్చింది. ప్రాణ రక్షణకు ఇక చేయగలిగిందేమీ లేని విషమ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఐసీయూలో వెంటిలేటర్ పెట్టడం వంటి పనులు చెయ్యనక్కరలేదని ముందే రాసుకోవటమే ఈ వీలునామా పరమార్థం.
ఇందులో ఏముంటుంది?
ఆఖరి మజిలీ చికిత్సలు ఏవిధంగా ఉండాలన్న అంశంపై రాసుకునే వీలునామా గురించి సుప్రీంకోర్టు 2018లో ఒక తీర్పులో పేర్కొంది. దాని ప్రకారం.. 18 ఏళ్లు నిండిన ఇద్దర్ని (ఒకరు కుటుంబ సభ్యులు, మరొకరు స్నేహితులు లేదా సహోద్యోగి) లివింగ్ విల్‌లో నామినీలుగా పేర్కొనాలి. ఆ వ్యక్తికి అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఆయన కోరిన విధంగా వీరు అమలు చేయించాలి.
మెకానికల్ వెంటిలేషన్, ఫీడింగ్ ట్యూబులు, సీపీఆర్, డయాలసిస్ చెయ్యాలా? పాలియేటివ్ కేర్ లేదా పెయిన్ రిలీఫ్ కేర్ మాత్రమే చెయ్యాలా? అనేది స్పష్టంగా విల్‌లో రాయాలని నిర్దేశించింది. ఈ నేపథ్యంలో లివింగ్ విల్ నిబంధనల విషయంలో 2023లో సర్వోన్నత న్యాయస్థానం కొన్ని సడలింపులు ఇచ్చింది. ఆ తర్వాత, డాక్టర్ నిఖిల్ ముసాయిదా లివింగ్ విల్‌ను రూపొందించారు.
మున్సిపల్ అధికారులే...
వీలునామాలు రాస్తారు సరే.. వీటిని ఏ అధికారి ఎక్కడ నమోదు చేస్తారు? అవసరం వచ్చినప్పుడు ఎలా వెలికితీస్తారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఈ అంశాలపై స్పష్టత కోసం డా. నిఖిల్.. బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దాంతో, లివింగ్ విల్‌లను మున్సిపల్ అధికారులు ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
ఆ తర్వాత తొలి లివింగ్ విల్‌ను డాక్టర్ నిఖిల్ నమోదు చేసుకున్నారు. బృహన్‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లోని వార్డుల్లో మెడికల్ ఆఫీసర్లు, అసిస్టెంట్ హెల్త్ ఆఫీసర్ల వద్ద ఇప్పటికి 40 మంది తమ లివింగ్ విల్‌లను రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 50 నుంచి 80 ఏళ్ల వయస్కులు ఉన్నారు. వీటిని బీఎంసీ వెబ్‌సైట్‌లో భద్రపరుస్తున్నారు. త్వరలో ఆన్‌లైన్‌లో కూడా వీటిని నమోదు చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నట్లు బీఎంసీ అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ డా. భూపేంద్ర పాటిల్ తెలిపారు.
అనవసరమైన హింస ఎందుకు?
‘నా స్నేహితుడు జబ్బుపడి సొంత వారిని కూడా గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నారు. అతన్ని ఐసీయూలో చేర్చిన కుటుంబ సభ్యులు సుమారు రూ.50 లక్షలు ఖర్చు పెట్టారు. చివరికి మనిషి దక్క లేదు. పైగా, బతికినా అతను సొంత మనుషులను కూడా గుర్తుపట్టలేని స్థితి. అలాంటప్పుడు ఐసీయూలో వైద్యం చేయించటం ఎందుకు? ఆర్థికంగా, మానసికంగా అనవసరమైన హింస పడటం ఎందుకు?’ అని ముంబైకి చెందిన 60 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ ప్రఫుల్ పురానిక్ అంటున్నారు. అందుకే తనకైతే ట్యూబులు వేయటం, ఐసీయూలో చికిత్స వద్దే వద్దు.. గౌరవంగా వెళ్లిపోనిస్తే చాలు అంటూ లివింగ్ విల్‌లో ఆయన పేర్కొన్నారు.
తొలి లివింగ్ విల్ క్లినిక్
ముంబైలోని పి.డి. హిందూజ ఆసుపత్రి దేశంలోనే తొలి లివింగ్ విల్ క్లినిక్‌ను ప్రారంభించింది. ఆసక్తి కల వారికి అవగాహన కల్పించేందుకు వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి శనివారం రెండు గంటల పాటు ఈ క్లినిక్‌లో అవుట్ పేషంట్ సేవలు అందిస్తున్నారు. లివింగ్ విల్ రాసే వ్యక్తికి లేదా కుటుంబ సభ్యులకు నియమ నిబంధనలు ఏమిటి, ఏయే డాక్యుమెంట్లు అవసరమవుతాయి, అమలు తీరు తెన్నులను వివరించటం వంటి సేవలు అందిస్తున్నారు.
అనేక దేశాల్లో ఉన్నదే..
చట్టబద్ధమైన రీతిలో లివింగ్ విల్ రాయటం అనే ప్రక్రియ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, కొలంబియా, డెన్మార్క్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో అమల్లో ఉంది. చాలా దేశాల్లో దీనికి చట్టబద్ధత ఉంది.