breaking news
Private clinic
-
చివరి మజిలీ వీలునామా!
ముందుచూపునకు నిదర్శనం వీలునామా. కుటుంబ ఆస్తులు, అప్పుల పంపకాలు.. నేత్రదానం.. ఇంకా చెప్పాలంటే ‘దేహదానం’పై అంతా బాగున్నప్పుడే వీలునామా రాసిపెట్టుకునే ఆనవాయితీ తెలిసిందే. ఈ కోవలోకి ఒక సరికొత్త వీలునామా వచ్చి చేరింది. అదే తన ‘ఆఖరి చికిత్స’ ఎలా ఉండాలనుకుంటున్నారో స్పష్టంగా ముందే రాసుకునే వీలునామా! కోర్టు మార్గదర్శకాల వెలుగులో మొగ్గ తొడిగిన ఆధునిక వ్యవస్థ. దీన్ని చట్టబద్ధంగా నమోదు చెయ్యటంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముంబైలో ఓ ప్రైవేటు క్లినిక్ ప్రతి శనివారం ప్రత్యేక ఓపీ సేవలందించటం కూడా ప్రారంభించింది. దేశంలోనే తొలి ‘లివింగ్ విల్’ పుట్టు పూర్వోత్తరాలు చదవండి!ఆధునిక వైద్య సదుపాయాలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. మంచాన పడిన దాదాపు ప్రతి మనిషీ పెద్దాసుపత్రి ఐసీయూలోనే అంతిమ శ్వాస విడుస్తున్న పరిస్థితి నెలకొంది. కురువృద్ధులకైనా ఐసీయూ చికిత్సల అనివార్యత ఓ ఆనవాయితీగా స్థిరపడుతున్న సంధి కాలం ఇది. ఈ స్థితిలో ‘ఆఖరు మజిలీలో అనవసర ఆర్భాటపు చికిత్సలు, ఆస్తుల్ని కరిగించే కొండంత అప్పుల వేదన మన కుటుంబాలకు అవసరమా?’ అని కొందరు ఆలోచనాపరులు ప్రశ్నిస్తున్నారు.తమకు మటుకు అటువంటి చివరి మజిలీ వీడుకోలు వద్దని, భీష్ముడిలా గౌరవంగా సహజ మరణం పొందే అవకాశాన్ని ఇవ్వాలని వీలునామాలు రాస్తున్నారు. ముంబై వాసులు కొందరు ఇలా వినూత్న వీలునామాలు రాయటమే కాదు, కోర్టు్ట సాయంతో ఈ సజీవమైన వీలునామా (లివింగ్ విల్)కు చట్టబద్ధతను సంతరింపజేశారు. ఈ కోవలో ముందు నడిచిన వ్యక్తి 55 ఏళ్ల సీనియర్ గైనకాలజిస్టు డాక్టర్ నిఖిల్ దాతర్.లివింగ్ విల్ అంటే?మనిషి ఎంత కూడబెట్టాడన్నది కాదు.. ఎంత సుఖంగా కన్నుమూశాడన్నది ముఖ్యం అంటారు పెద్దలు. ఈ ఆలోచన నుంచి పుట్టిందే లివింగ్ విల్ భావన. నయంకాని రోగాలతో మంచాన పడి, నిర్ణయం తీసుకోలేని స్థితిలో కటుంబ సభ్యులు మరణం ముంగిట ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు ఏ నిర్ణయం తీసుకోవాలనే సంకట స్థితిని ఎదుర్కోకుండా ‘లివింగ్ విల్’ స్పష్టత ఇస్తుంది.సహజంగా మరణించాల్సిన చివరి క్షణాల్లో ఐసీయూ, వెంటిలేటర్ వంటి చికిత్సలు చేయించాలా వద్దా అనేది ముందే రాసి పెట్టుకోవటానికి వ్యక్తులకు ఈ వీలునామా దోహదపడుతుంది. అందువల్ల ఈ వీలునామాకు ‘అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్స్’ అనే పేరొచ్చింది. ప్రాణ రక్షణకు ఇక చేయగలిగిందేమీ లేని విషమ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఐసీయూలో వెంటిలేటర్ పెట్టడం వంటి పనులు చెయ్యనక్కరలేదని ముందే రాసుకోవటమే ఈ వీలునామా పరమార్థం.ఇందులో ఏముంటుంది?ఆఖరి మజిలీ చికిత్సలు ఏవిధంగా ఉండాలన్న అంశంపై రాసుకునే వీలునామా గురించి సుప్రీంకోర్టు 2018లో ఒక తీర్పులో పేర్కొంది. దాని ప్రకారం.. 18 ఏళ్లు నిండిన ఇద్దర్ని (ఒకరు కుటుంబ సభ్యులు, మరొకరు స్నేహితులు లేదా సహోద్యోగి) లివింగ్ విల్లో నామినీలుగా పేర్కొనాలి. ఆ వ్యక్తికి అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఆయన కోరిన విధంగా వీరు అమలు చేయించాలి.మెకానికల్ వెంటిలేషన్, ఫీడింగ్ ట్యూబులు, సీపీఆర్, డయాలసిస్ చెయ్యాలా? పాలియేటివ్ కేర్ లేదా పెయిన్ రిలీఫ్ కేర్ మాత్రమే చెయ్యాలా? అనేది స్పష్టంగా విల్లో రాయాలని నిర్దేశించింది. ఈ నేపథ్యంలో లివింగ్ విల్ నిబంధనల విషయంలో 2023లో సర్వోన్నత న్యాయస్థానం కొన్ని సడలింపులు ఇచ్చింది. ఆ తర్వాత, డాక్టర్ నిఖిల్ ముసాయిదా లివింగ్ విల్‌ను రూపొందించారు.మున్సిపల్ అధికారులే...వీలునామాలు రాస్తారు సరే.. వీటిని ఏ అధికారి ఎక్కడ నమోదు చేస్తారు? అవసరం వచ్చినప్పుడు ఎలా వెలికితీస్తారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఈ అంశాలపై స్పష్టత కోసం డా. నిఖిల్.. బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దాంతో, లివింగ్ విల్లను మున్సిపల్ అధికారులు ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత తొలి లివింగ్ విల్‌ను డాక్టర్ నిఖిల్ నమోదు చేసుకున్నారు. బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లోని వార్డుల్లో మెడికల్ ఆఫీసర్లు, అసిస్టెంట్ హెల్త్ ఆఫీసర్ల వద్ద ఇప్పటికి 40 మంది తమ లివింగ్ విల్లను రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 50 నుంచి 80 ఏళ్ల వయస్కులు ఉన్నారు. వీటిని బీఎంసీ వెబ్సైట్లో భద్రపరుస్తున్నారు. త్వరలో ఆన్లైన్లో కూడా వీటిని నమోదు చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నట్లు బీఎంసీ అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ డా. భూపేంద్ర పాటిల్ తెలిపారు.అనవసరమైన హింస ఎందుకు?‘నా స్నేహితుడు జబ్బుపడి సొంత వారిని కూడా గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నారు. అతన్ని ఐసీయూలో చేర్చిన కుటుంబ సభ్యులు సుమారు రూ.50 లక్షలు ఖర్చు పెట్టారు. చివరికి మనిషి దక్క లేదు. పైగా, బతికినా అతను సొంత మనుషులను కూడా గుర్తుపట్టలేని స్థితి. అలాంటప్పుడు ఐసీయూలో వైద్యం చేయించటం ఎందుకు? ఆర్థికంగా, మానసికంగా అనవసరమైన హింస పడటం ఎందుకు?’ అని ముంబైకి చెందిన 60 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ ప్రఫుల్ పురానిక్ అంటున్నారు. అందుకే తనకైతే ట్యూబులు వేయటం, ఐసీయూలో చికిత్స వద్దే వద్దు.. గౌరవంగా వెళ్లిపోనిస్తే చాలు అంటూ లివింగ్ విల్లో ఆయన పేర్కొన్నారు.తొలి లివింగ్ విల్ క్లినిక్ముంబైలోని పి.డి. హిందూజ ఆసుపత్రి దేశంలోనే తొలి లివింగ్ విల్ క్లినిక్‌ను ప్రారంభించింది. ఆసక్తి కల వారికి అవగాహన కల్పించేందుకు వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి శనివారం రెండు గంటల పాటు ఈ క్లినిక్‌లో అవుట్ పేషంట్ సేవలు అందిస్తున్నారు. లివింగ్ విల్ రాసే వ్యక్తికి లేదా కుటుంబ సభ్యులకు నియమ నిబంధనలు ఏమిటి, ఏయే డాక్యుమెంట్లు అవసరమవుతాయి, అమలు తీరు తెన్నులను వివరించటం వంటి సేవలు అందిస్తున్నారు.అనేక దేశాల్లో ఉన్నదే..చట్టబద్ధమైన రీతిలో లివింగ్ విల్ రాయటం అనే ప్రక్రియ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, కొలంబియా, డెన్మార్క్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో అమల్లో ఉంది. చాలా దేశాల్లో దీనికి చట్టబద్ధత ఉంది. -
ప్రాణం ఖరీదు రూ.లక్ష!.. సూది మందు వికటించి వ్యక్తి మృతి
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పరుగులు తీస్తున్న నేటి రోజుల్లో రాతియుగం నాటి అనాగరిక సంస్కృతికి తెరలేపారు కొందరు. వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందితే... రూ.లక్ష పరిహారం చెల్లించేలా దుప్పటి పంచాయితీ చేశారు. పెద్దల పంచాయితీకి వైద్యాధికారులు, పోలీసులూ తలొగ్గారు. ఆదివారం నిశిరాత్రి జరిగిన ఈ దారుణం సోమవారం తెల్లారేసరికి గుట్టుచప్పుడు కాకుండా తొక్కేశారు. సాక్షి, గుత్తి రూరల్: సూది మందు వికటించి ఓ వ్యక్తి మృతి చెందాడు. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... గుత్తి మండలం తొండపాడుకు చెందిన నల్లబోతుల రంగయ్య (45), సునీత దంపతులు. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ రంగయ్య కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. జ్వరంతో బాధపడుతున్న రంగయ్య ఆదివారం రాత్రి కుమారుడు సాయంతో గుత్తిలో ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ కృష్ణప్రసాద్ నిర్వహిస్తున్న ప్రైవేట్ క్లినిక్‌కు వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. డాక్టర్ సూది మందు వేసిన కాసేపటికి రంగయ్య అపస్మారకస్థితికి చేరుకున్నాడు. దీంతో వైద్యుడి సూచన మేరకు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. అప్పటికే రంగయ్య మృతి చెందాడు. దీంతో డాక్టర్ కృష్ణప్రసాద్ వైద్యం సరిగా చేయకపోవడం వల్లనే రంగయ్య మృతి చెందాడంటూ బంధువులు, కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. అప్పటికే అక్కడకు చేరుకున్న డాక్టర్ కృష్ణప్రసాద్‌పై దాడికి యత్నించారు. సకాలంలో అక్కడకు చేరుకున్న సీఐ వెంకటరామిరెడ్డి, సిబ్బంది వెంటనే ఆందోళనకారులను చెదరగొట్టారు. చదవండి: (అందం చూసి అనుమానం.. నవ వివాహితను చంపిన సైకో భర్త) డ్యూటీ సమయంలోప్రైవేట్ క్లినిక్‌లో ఇటీవల బదిలీపై గుత్తి ప్రభుత్వాస్పత్రిలో వైద్యుడిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కృష్ణప్రసాద్.. స్థానికంగానే ఓ ప్రైవేట్ క్లినిక్ నిర్వహిస్తూ అదనపు ఆదాయంపై దృష్టిసారించారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి కాల్ డ్యూటీలో ఉన్న ఆయన... తన సొంత క్లినిక్‌లో పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న రంగయ్య కుటుంబసభ్యులు నేరుగా ప్రైవేట్ క్లినిక్‌కు చేరుకున్నారు. పరీక్షించిన డాక్టర్ కృష్ణాప్రసాద్ సూది మందు వేసిన కాసేపటికి రంగయ్య అపస్మారక స్థితికి చేరుకున్నాడు. పరిస్థితి చేజారుతున్నట్లు గమనించిన డాక్టర్ వెంటనే... ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని రోగి కుటుంబసభ్యులకు సూచించినట్లు తెలిసింది. ఘటనపై డాక్టర్ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. జ్వర తీవ్రత కారణంగానే రంగయ్య మృతి చెందాడని పేర్కొన్నారు. రోగి ప్రాణాలు కాపాడేందుకు తాను చేసిన ప్రయత్నాలు వివరించారు. పంచాయితీ పెద్దలు పోలీసులేనా? రంగయ్య మృతికి డాక్టర్ కృష్ణ ప్రసాద్‌నే కారణమంటూ పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేయాల్సిన పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ దుప్పటి పంచాయితీకి తెరలేపినట్లు సమాచారం. వైద్యుడిని కాపాడే క్రమంలో బాధిత కుటుంబసభ్యులను రాజీ చేసి రూ.లక్ష పరిహారాన్ని డాక్టర్ కృష్ణప్రసాద్ చెల్లించేలా ఒప్పందం చేసినట్లు తెలిసింది. దీంతో వివాదం సద్దుమణిగినట్లు సమాచారం. -
రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, రేణిగుంట: తిరుపతి జిల్లాలోని రేణిగుంటలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. దీంతో అపార్ట్మెంట్లోని ఓ ప్రైవేటు క్లినిక్ అగ్నికి ఆహుతైంది. ప్రమాదం జరిగిన సమయంలో క్లినిక్‌లో మొత్తం 5 మంది ఉన్నారు. ఆసుపత్రి పైఅంతస్తులో డాక్టర్ కుటుంబం నివాసముంటోంది. దట్టమైన పొగలు అలుముకోవటంతో ఇద్దరు చిన్నారులు సిద్దార్థరెడ్డి, కార్తిక సహా డాక్టర్ రవిశంకర్ ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. డాక్టర్ భార్య, తల్లిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక విభాగం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. ముందుగా ఇద్దరు మహిళలను సురక్షితంగా రక్షించగా.. క్లినిక్ నిర్వహిస్తున్న డాక్టర్ రవిశంకర్ భవనంలోనే చిక్కుకుపోయారు. రవిశంకర్‌ను రక్షించేందుకు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. డాక్టర్ రవిశంకర్‌తో పాటు.. ఆయన ఇద్దరు పిల్లలు సిద్ధార్థ రెడ్డి, కార్తికలు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. ప్రమాదానికి విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా భావిస్తున్నట్లు తెలిపారు. -
వైద్యుడి నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది
- చిన్నారి మృతితో తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన - ముందే చెప్పి ఉంటే బతికించుకునే వారిమని ఆవేదన బేతంచెర్ల: స్థాయికి మించి వైద్య సేవలందించి చివర్లో చేతులెత్తేయ్యడంతో తమ కుమారుడు మృతి చెందాడని పేర్కొంటూ సంజీవనగర్ కాలనీకి చెందిన బాధిత కుటుంబీకులు శుక్రవారం బేతంచెర్లలో ప్రయివేటు క్లినిక్ వద్ద ఆందోళన చేపట్టారు. సంజీవనగర్ కాలనీకి చెందిన మురళీధర్‌రెడ్డి, సుజాత దంపతుల రెండవ కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి(4) డెంగి జ్వరంతో బాధపడుతూ శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో మరణించాడు. అయితే ఈ నెల 19న బాలుడికి జ్వరం రావడంతో స్థానికంగా ఉన్న ప్రయివేటు క్లినిక్‌లో చేర్పించారు. బాలున్ని పరీక్షించిన వైద్యుడు మలేరియా జ్వరం అంటూ చికిత్స నిర్వహించాడు. 4 రోజులైనా నయం కాకపోవడంతో తల్లిదండ్రులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ బాలున్ని పరీక్షించిన వైద్యులు డెంగి జ్వరంగా నిర్ధారించి వైద్యం చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో మరణించాడు. అయితే బాలునికి సోకింది డెంగి జ్వరం అని ముందే చెప్పి ఉంటే తాము మెరుగైన వైద్యం చేయించి బతికించుకునే వారమని, ఏమీ తెలియకున్నా నాలుగురోజులపాటు చికిత్స అందిస్తూ బాలుని ప్రాణాలతో చెలగాటమాడి చివరకు చేతులెత్తేసి ప్రాణాలు పోయేందుకు కారణమయ్యాడని ప్రయివేటు వైద్యుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విషజ్వరంతో విద్యార్థిని మృతి
గాంధీనగరం (శిరివెళ్ల ): విషజ్వరంతో మండలంలోని గాంధీనగరానికి చెందిన పదో తరగతి విద్యార్థి వట్టికట్టి శ్రీలక్ష్మి (16) బుధవారం మృతిచెందింది. ఈ నెల 27వ తేదీన సైన్స్ పరీక్ష రాయాల్సిన ఈ విద్యార్థిని..జ్వరం అధికం కావడంతో వైద్యం కోసం ఆళ్లగడ్డకు చికిత్స చేయించుకుంది. బుధవారం జ్వరం మరింత అధికం కావడంతో హుటాహుటిన యర్రగుంట్లలోని ఓ ప్రై వేట్ క్లినిక్‌కు తరలించగా అక్కడ పరిస్థితి విషమించింది. మెరుగైన lవైద్యం కోసం నంద్యాల ఆస్పత్రికి తరలిస్తుడంగా మార్గమధ్యలో దీబగుంట్ల వద్ద మృతి చెందింది. విషయం తెల్సుకున్న ప్రధానోపాధ్యాయుడు సుబ్రమణ్యం, టీచర్లు గ్రామానికి వెళ్లి విద్యార్థి తల్లిదండ్రులను పరామర్శించారు. జ్వరం కారణంగా ఈ విద్యార్థిని శ్రీకాళహస్తీలో జరగనున్న రాష్ట్రస్థాయి త్వైక్వాండో పోటీలకు హాజరు కాలేకపోయిందని ఉపాధ్యాయులు తెలిపారు. -
క్లినిక్‌లు నిర్వహిస్తే చర్యలు
ప్రభుత్వ వైద్యులకు మంత్రి హెచ్చరిక సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్రైవేట్ క్లినిక్‌లను నిర్వహించే ప్రభుత్వ వైద్యులపై చర్యలు తీసుకుంటామని ఆరోగ్య శాఖ మంత్రి యూటీ. ఖాదర్ హెచ్చరించారు. హాసనలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన సేవలు అందించకుండా, ప్రైవేట్ క్లినిక్‌ల నిర్వహణ ద్వారా సంపాదించాలని చూస్తే ఊరుకోబోమని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల కొరత నిజమేనని అంగీకరిస్తూ, కొత్త నియామకాలకు చర్యలు చేపడతామని చెప్పారు. వచ్చే మూడేళ్లలో వైద్యుల కొరత లేకుండా చూస్తామని తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో స్వచ్ఛతను పాటించడానికి మేనేజ్మెంట్ వ్యవస్థను అమల్లోకి తెస్తామని వెల్లడించారు. ప్రభుత్వ వైద్యులు విధిగా రెండేళ్ల పాటు గ్రామీణ సేవలను అందించాలనే నిబంధన విధించాలని యోచిస్తున్నామని, దీనికి కేంద్ర న్యాయ శాఖ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. కాగా జేడీఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడానికి ప్రయత్నించడం లేదని చెప్పారు. అయితే వారే జేడీఎస్‌ను వీడే యోచనలో ఉన్నారని తెలిపారు. దీనిపై ఆ పార్టీ ఆత్మావలోకనం చేసుకోవాలని ఆయన సూచించారు.