అదృష్టం అవకాశం ఇస్తే.. మొహమాటంతో 45 ఏళ్లు ఒంటరిగా

Kerala Man Feared Dead in 1976 Indian Airlines Crash Turns up Alive - Sakshi

45 ఏళ్ల క్రితం విమాన ప్రమాదంలో మరణించినట్లు భావించిన కుటుంబ సభ్యులు

బతికున్నానని చెప్పడానికి సిగ్గుపడి.. 45 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా

తిరువనంతపురం: 1976లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్లు భావించిన ఓ వ్యక్తి.. 45 ఏళ్ల తర్వాత.. తిరిగి తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. ప్రమాదం జరిగిన రోజు అతడు విమానంలో లేడు. అలా మృత్యువు నుంచి తప్పించుకున్న సదరు వ్యక్తి.. ఇంటికి వెళ్లడానికి.. బతికి ఉన్నానని చెప్పడానికి సిగ్గుపడి.. ఎక్కడెక్కడో తలదాచుకున్నాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అతడిని రెండేళ్ల క్రితం పాత మిత్రుడు ఒకరు గుర్తించి స్వచ్ఛంద సంస్థకు చెందిన ఆశ్రమంలో చేర్చాడు. ఈ క్రమంలో రెండేళ్ల తర్వాత సదరు వ్యక్తి తన కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. అదృష్టం కొద్ది మృత్యువు నుంచి తప్పించుకున్నప్పటికి.. మోహమాటంతో దాదాపు 45 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా.. ఒంటరిగా మిగిలిన ఆ వ్యక్తి వివరాలు..

కేరళ, కొట్టాయంకు చెందిన సాజిద్‌ థుంగల్‌ తన 22వ ఏట అనగా 1974లో జీవనోపాధి కోసం నలుగురు అక్కలు, ముగ్గురు సోదరులను, తల్లిదండ్రులను విడిచిపెట్టి గల్ఫ్‌ వెళ్లాడు. అ‍క్కడ మలయాళ సినిమాలు ప్రదర్శిస్తూ.. భారత్‌ నుంచి సింగర్లు, డ్యాన్సర్లును పిలిపించి సాంస్కృతిక కార్యక్రమాలు ననిర్వహిస్తుండేవాడు. ఈ క్రమంలో 1976లో సాజిద్‌ 10 రోజుల పాటు భారత్‌ నుంచి వచ్చిన ప్రదర్శనకారుల బృందంతో కలిసి ఉన్నాడు. 

ఈ క్రమంలో ఇండియా నుంచి వచ్చిన బృందం, సిబ్బందితో కలిసి మొత్తం 95 మంది ప్రయాణీకులున్న విమానం అక్టోబర్‌ 12, 1976న ప్రమాదానికి గురైంది. ఇండియన్ ఎయిర్‌లైన్స్ 171 విమానం చెన్నైకి (అప్పటి మద్రాస్) ప్రయాణిస్తుండగా.. ఇంజన్‌లో మంటలు చేలరేగడంతో.. బొంబాయి విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు విమానం కూలిపోయిందని తెలిసింది. ఇదే ప్రమాదంలో ప్రముఖ మళయాళ నటి రాణి చంద్రా కూడా ప్రాణాలు కోల్పోయారు. సాజిద్‌ కూడా ఇదే ప్రమాదంలో మరణించినట్లు అతడి కుటుంబ సభ్యులు భావించారు. 

కాకపోతే ఆ రోజు అదృష్టం కొద్ది సాజిద్‌ ఆ విమానం ఎక్కలేదు. అలా మృత్యువు నుంచి తప్పించుకున్నాడు. బతికి ఉన్నప్పటికి సాజిద్‌.. తన కుటుంబ సభ్యులను కలిసే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే వారంతా తనను చనిపోయారని భావిస్తున్నారు.. ఇలాంటప్పుడు వారిని కలవాలంటే సాజిద్‌ సిగ్గు పడ్డాడు. దాంతో తన గురించి ఎవరికి చెప్పలేదు. ప్రమాదం జరిగిన ఆరేళ్ల తర్వాత ముంబై వెళ్లి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ.. జీవనం సాగించాడు.

2019 లో అత్యంత దుర్బర స్థితిలో ఉన్న సాజిద్‌ను అతడి స్నేహితుడు గుర్తించాడు. అతను వెంటనే ముంబైలో పాస్టర్ కె.ఎమ్. ఫిలిప్ నడుపుతున్న ఆశ్రమానికి తీసుకువచ్చాడు. ‘‘విమానం ప్రమాదంలో బృందం మరణించిన తరువాత సాజిద్‌ ‘‘నిరాశ, అపరాధం, మద్యపానం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి’’ పలు సమస్యలతో బాధపడుతున్నాడు’’ అని తెలిపాడు సాజిద్‌ స్నేహితుడు. రెండేళ్లుగా ఆశ్రమంలో ఉంటున్నప్పటికి సాజిద్ తన కుటుంబం గురించి ఎవరికి ఏమీ చెప్పలేదు. కొన్ని వారాల క్రితం ఒక సీల్ సామాజిక కార్యకర్త కేరళను సందర్శించి, కొట్టాయంలోని ఒక స్థానిక మసీదులో సాజిద్ గురించి ఆరా తీయడంతో అతడి కుటుంబం గురించి తెలిసింది.

మసీదు ఇమామ్ సాజిద్ కుటుంబానికి తెలుసు. అతడు సీల్ సామాజిక కార్యకర్తను సాజిద్‌ ఇంటికి తీసుకువెళ్ళాడు. 45 సంవత్సరాల తర్వాత సాజిద్ తన కుటుంబాన్ని మొదటిసారి చూడటానికి వీడియో కాల్ చేశారు. వారితో మాట్లాడిన తర్వాత ఇంటికి వెళ్లాలని నిర్ణియంచుకున్నాడు సాజిద్‌. "నేను ఇంటికి వెళ్ళాలి. ఇక్కడి ప్రజలు నన్ను చూసుకోకపోతే, నా కుటుంబంతో తిరిగి కలవకుండానే.. నేను చనిపోయేవాడిని” అన్నాడు సాజిద్‌.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top