
సాక్షి, బెంగళూరు: కర్ణాటక మంత్రి ఉమేష్ కత్తి హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 61 సంవత్సరాలు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో బెంగుళూరు డాలర్స్ కాలనీలోని తన ఇంటిలో కుప్పకూలిపోయాడు. వెంటనే మంత్రిని బెంగుళూరులోని రామయ్య ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మంత్రికి స్పృహ లేకపోవడం, శ్వాస తీసుకోకపోవడంతో.. వైద్యులు అత్యవసర చికిత్స విభాగంలో వైద్యం అందించారు. అయినప్పటికీ ఆయన శరీరం స్పందించకపోవడంతో మంగళవారం అర్థరాత్రి 11.40 నిమిషాలకు మంత్రి ఉమేష్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
ఉమేష్ కత్తి మృతి పట్ల సీఎం బసవరాజ్ బొమ్మై సంతాపం తెలిపారు. ఉమేష్ తనకు తమ్ముడు లాంటి వాడని, అతని మరణం రాష్ట్రానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ‘నా సన్నిహిత మిత్రుడిని కోల్పోయాను, నాకు తను సోదరుడు, తనకు కొన్ని గుండె జబ్బులు ఉన్నాయని తెలుసు. కానీ ఇంత త్వరగా మమ్మల్ని విడిచి వెళతాడని ఊహించలేదు. తను రాష్ట్రానికి ఎంతో సేవలు చేశాడు. అనేక శాఖలను సమర్ధవంతంగా నిర్వహించాడు. ఆయన మరణం రాష్ట్రానికి భారీ నష్టం. మాకు పెద్ద శూన్యతను మిగిల్చాడు, దీనిని పూరించడం చాలా కష్టం’ అని బొమ్మై అన్నారు. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో మంత్రి అంత్యక్రియలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
కాగా ఉమేష్ కత్తి స్వస్థలం బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా, ఖడకలాట గ్రామం. ఆయనకు భార్య లీల, కుమారుడు నిఖిల్, కుమార్తె స్నేహా ఉన్నారు. బెళగావి జిల్లా హుక్కేరి నియోజకవర్గం నుంచి ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అయిదుసార్లు మంత్రిగా సేవలందించాడు. ప్రస్తుతం అటవీ, ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రిగా ఉన్నారు.
చదవండి: అమిత్ షా యాక్షన్ ప్లాన్.. ఢిల్లీలో మెగా మీటింగ్