కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమరం: బీజేపీ ఎన్నికల సారథిగా ఉజ్వల్‌ మ్యాన్‌

Karnataka Election: U Minister Dharmendra Pradhan As BJP Incharge - Sakshi

సాక్షి, ఢిల్లీ: కర్ణాటకలో మరోసారి అధికారం చేపట్టేందుకు పావులు కదుపుతోంది బీజేపీ.  ఇప్పటికే అభివృద్ధి పనులు, బడ్జెట్‌ కేటాయింపులతో అక్కడి ప్రజలను ఆకట్టుకునే యత్నం చేసింది. ఇక ఈ ఏడాది వేసవిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా.. తాజాగా ఆ రాష్ట్రానికి ఎన్నికల సారథిని నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది. 

కర్ణాటక అసెంబ్లీ  బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌(54)ను నియమించింది ఆ పార్టీ. అలాగే..  కో ఇన్‌ఛార్జిగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైను నియమిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా పేరుతో ఒక ప్రకటనను శనివారం విడుదల చేసింది.  


ప్రస్తుతం కేంద్ర విద్యా శాఖతో పాటు స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ మంత్రిత్వ శాఖలను ధర్మేంద్ర ప్రధాన్‌ చూసుకుంటున్నారు. ఒడిషాలో పుట్టిపెరిగిన ధర్మేంద్ర ప్రధాన్‌.. కేంద్ర మాజీ మంత్రి దేవేంద్ర ప్రధాన్‌ తనయుడు. దేవేంద్ర ప్రధాన్‌.. వాజ్‌పేయి హయంలో కేంద్ర సహాయ మంత్రిగా పని చేశారు. ధర్మేంద్ర ప్రధాన్‌..  ఏబీవీపీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి.. బీజేపీలో పలు కీలక పదవులు చేపట్టారు. పలు రాష్ట్రాలకు పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జిగానూ పని చేశారు. 

2004లో దియోగఢ్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. ఆపై బీహార్‌, మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగానే ఉన్నారు. స్వతంత్ర భారతంలో సుదీర్ఘ కాలం పెట్రోలియం, సహజ ఇంధనాల శాఖ మంత్రిగా సుదీర్ఘ కాలం పని చేసిన ఘనత ధర్మేంద్ర ప్రధాన్‌ ఖాతాలో ఉంది.ఈయన హయాంలోనే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ప్రారంభం అయ్యి.. విజయవంతమైంది. అందుకే ఈయన్ని ఉజ్వల మ్యాన్‌గా పిలుస్తుంటారు.   ఆంత్రోపాలజీలో పీజీ చేసిన ధర్మేంద్ర ప్రధాన్‌.. మంచి వక్త కూడా.

ఈ ఏడాది ఏప్రిల్ లేదంటే మే నెలలో కర్ణాటక ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి అధికారం కోసం బీజేపీ, అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ ఉవ్విళ్లూరుతుండగా.. ప్రభుత్వ ఏర్పాటులో అద్భుతం సృష్టిస్తామంటూ జేడీఎస్‌ ప్రకటించుకుంటోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top