
సాక్షి, బళ్లారి: కర్ణాటకలో అనుమానాస్పద స్థితిలో డిగ్రీ విద్యార్థిని మృతదేహం లభ్యం కావడం కలకలం సృష్టించింది. తనిఖీలో భాగంగా ఆమైపె అత్యాచారం చేసి, హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది.
వివరాల ప్రకారం.. చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకా కోవేరహట్టి గ్రామానికి చెందిన వర్షిత (19) డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. ఆమె పట్టణంలోని ప్రభుత్వ మహిళల డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం బీఏ డిగ్రీ చదువుతూ ఇక్కడ ప్రభుత్వ బాలికల వసతి గృహాల్లో ఉంటోంది. అయితే, వర్షిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది. గుర్తుతెలియని దుండగులు ఆమెను దారుణంగా హత్య చేసి గుర్తించడానికి వీలు లేకుండా పెట్రోలు పోసి దహనం చేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో వర్షం మొదలవడంతో మంటలు ఆరిపోగా మృతదేహం సగం కాలిపోయింది.
అనంతరం, హత్యకు గురైన యువతి మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో యువతి చేతికి వేయించుకొన్న టాటూ ఆధారంగా వర్షితగా గుర్తించారు. ఇక, ఈ కేసులో ఆమెతో స్నేహంగా ఉంటున్న చేతన్ అనే యువకుడిని అరెస్టు చేశారు. పూర్తి విచారణ తర్వాత మాత్రమే అసలు విషయాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. తమ కుమార్తె మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు కాగా బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
కర్ణాటకలో నిరసనలు..
మరోవైపు.. యువతి హత్యను ఖండిస్తూ చిత్రదుర్గలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు జిల్లాధికారి కార్యాలయం ముందు ధర్నా చేశారు. వివిధ కళాశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు తరగతులను బహిష్కరించి పట్టణ వీధుల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.