ఎన్సీఎల్‌ఏటీ చైర్మన్‌గా జస్టిస్‌ చీమా కొనసాగొచ్చు

Justice Cheema to continue as NCLAT chairperson till 20 September - Sakshi

తీర్పులూ వెలువరించవచ్చు

సుప్రీంకోర్టుకు తెలియజేసిన కేంద్ర ప్రభుత్వం  

న్యూఢిల్లీ: నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌(ఎన్సీఎల్‌ఏటీ) చైర్‌పర్సన్‌ జస్టిస్‌ అశోక్‌ ఇక్బాల్‌సింగ్‌ చీమాను గడువు కంటే ముందే పదవీ విరమణ చేయించడంపై తలెత్తిన వివాదానికి తెరపడింది. ఈయన ఈ నెల 20వ తేదీ దాకా పదవిలో కొనసాగుతూ తీర్పులిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. జస్టిస్‌ చీమా ఎన్సీఎల్‌ఏటీ చైర్‌పర్సన్‌గా ఈ నెల 20న పదవీ విమరణ చేయాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఈ పదవిలో జస్టిస్‌ ఎం.వేణుగోపాల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం ఈ నెల 11వ తేదీ నుంచే అమల్లోకి వస్తుందని తేల్చిచెప్పింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ జస్టిస్‌ చీమా సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా కేంద్ర సర్కారు తరపున అటారీ్న జనరల్‌ వేణుగోపాల్‌ వాదనలు వినిపించారు. ఈ నెల 20 దాకా జస్టిస్‌ చీమా ఎన్సీఎల్‌ఏటీ చైర్‌పర్సన్‌గా కొనసాగవచ్చని, తీర్పులు వెలువరించవచ్చని అన్నారు. జస్టిస్‌ వేణుగోపాల్‌ను అప్పటిదాకా సెలవుపై పంపిస్తామని వెల్లడించారు. ట్రిబ్యునళ్ల నియామకాల విషయంలో ధర్మాసనం కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం ఇటీవల తీసుకొచి్చన ట్రిబ్యునళ్ల సంస్కరణల చట్టం–2021 ప్రకారం. ఎన్సీఎల్‌ఏటీ చైర్‌పర్సన్‌ను మార్చే అధికారం ప్రభుత్వానికి ఉందని వేణుగోపాల్‌ చెప్పగా ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. తమ సుమోటో అధికారాలను ఉపయోగించి ఈ చట్టంపై స్టే విధిస్తామని ఒక దశలో ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top