Joshimath Sinking: జోషీ మఠ్‌లో వందలాది ఇళ్లకు పగుళ్లు.. తక్షణం 600 కుటుంబాలు ఖాళీ! ఏమిటీ జోషీమఠ్‌ ?

Joshimath Sinking: Over 500 Homes Develop Cracks As Uttarakhand Holy Town On Brink Of Collapse - Sakshi

జోషిమఠ్‌. చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లే భక్తులకు చిరపరిచితమైన పేరు. ఉత్తరాఖండ్‌లో అత్యంత పురాతమైన పట్టణం పూర్తిగా కనుమరుగయ్యే రోజులు దగ్గరకొస్తున్నాయి. జోషిమఠ్‌లో వందలాది ఇళ్లు బీటలు వారాయి. కొన్ని చోట్ల భూమిలోంచి నీళ్లు ఉబుకుబుకి పైకి వస్తున్నాయి. ఈ పట్టణం నిట్టనిలువుగా భూమిలోకి కుంగిపోవడమే దీనికి కారణం. ఏదో ఒక రోజు జోషిమఠ్‌ మునిగిపోవడం ఖాయమని దశాబ్దాల క్రితమే హెచ్చరికలు జారీ అయ్యాయి.  

ఉత్తరాఖండ్‌లోని జోíషీమఠ్‌లో ప్రజలు గత కొద్ది రోజులుగా ప్రాణాలరచేతుల్లో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. దాదాపుగా 600 ఇళ్లు బీటలు వారాయి. నేలకింద నుంచి ఇళ్లల్లోకి నీరు వచ్చేస్తోంది. భూమి కింద నుంచి శబ్దాలు వస్తూ ఉండడంతో స్థానికులు వణికిపోతున్నారు. చార్‌ధామ్‌ యాత్రికుల కోసం హెలాంగ్‌ నుంచి మార్వారి వరకు రోడ్డుని వెడల్పు చేసే ప్రాజెక్టు పనులు ముమ్మరంగా చేస్తూ ఉండడంతో ప్రస్తుతం ఈ ముప్పు ముంచుకొచ్చింది. దీంతో ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి రంగంలోకి దిగారు. రహదారి నిర్మాణాలన్నీ తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించారు. జోషీమఠ్‌ పరిస్థితిపై శుక్రవారం అధికారులతో సమీక్షించారు. అక్కడి 600 కుటుంబాలను తక్షణం ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. శనివారం అక్కడ పర్యటించనున్నారు. దాంతో విపత్తు సహాయక బృందాలు ప్రజల్ని తరలిస్తున్నాయి.

ఎందుకీ ముప్పు ?  
జోషీమఠ్‌ పట్టణం కొండల్లో ఏటవాలుగా ఉన్నట్టు ఒకవైపు ఒరిగి ఉంటుంది. అత్యంత పురాతనమైన కొండచరియలపై ఇళ్లు నిర్మించడంతో పునాదులు బలంగా లేవు.  అడపా దడపా భూ ప్రకంపనలు పలకరిస్తూనే ఉంటాయి. రైని ప్రాంతంలోని అలకనంద నదికి వరదలు వచ్చినప్పుడల్లా జోíషీమఠ్‌లో మట్టిని బలహీనపరుస్తోంది. ఈ ప్రాంతంలో భారీ నిర్మాణాలు చేపట్టవద్దని ఎందరో నిపుణులు హెచ్చరించినా మన ప్రభుత్వాలు పెడచెవిన పెట్టాయి. అభివృద్ధి కార్యక్రమాల కోసం కొండల్ని పేల్చేయడం, ఇష్టారాజ్యంగా తవ్వకాలు, చెట్లు నరికేయడం వంటి చర్యలు జోíషీమఠ్‌ పట్టణాన్ని ప్రమాదంలో పడేశాయి.

ఎన్‌టీపీసికి చెందిన తపోవన్‌ విష్ణుగఢ్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మాణం అతి పెద్ద ముప్పుగా పరిణమించింది. గత ఏడాది ఈ ప్రాజెక్టు దగ్గర ఆకస్మిక వరదలు సంభవించి 200 మంది మరణించిన విషయం తెలిసిందే. ఏడాది పొడవునా చార్‌ధామ్‌ యాత్ర చేయడానికి వీలుగా హెలోంగ్‌ నుంచి మార్వారి వరకు 20కి.మీ. మేర చేపట్టిన రహదారి వెడల్పు చేసే ప్రాజెక్టు ముప్పుని మరింత పెంచింది. ప్రస్తుతం ఈ నిర్మాణాలన్నీ తాత్కాలికంగా ప్రభుత్వం నిలిపివేసింది. సమస్యకి శాశ్వతమైన పరిష్కారాలు కనుగొనే వరకు చిన్నపాటి తవ్వకాలు కూడా చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  గత ఏడాది    జోషీమఠ్‌కి ముప్పుని తొలిసారి గుర్తించారు. చమోలిలో ప్రమాదకరంగా కొండచరియలు విరిగిపడినప్పుడు జోíషీమఠ్‌లో ఇళ్లు బీటలు వారాయి. అప్పట్నుంచి ఏదో ఒక రూపంలో ప్రమాదాలు వస్తూనే ఉన్నాయి. దీనికి గల కారణాలపై బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాస్త్రవేత్తల బృందం ఈ పట్టణం ఉన్న ప్రాంతంలో సహజసిద్ధంగా వచ్చే ముప్పుతో పాటు మానవ తప్పిదాలు కారణమని తేల్చింది.  

50 ఏళ్ల క్రితమే ప్రమాదం గుర్తించిన నిపుణులు  
జోషీమఠ్‌ పూర్తిగా మునిగిపోతుందని 50 ఏళ్ల క్రితమే నిపుణులు అంచనా వేశారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో తరచూ వరదలు రావడానికి గల కారణాలు అన్వేషించడానికి  ఏర్పాటు చేసిన మిశ్రా కమిటీ 1976లో ఇచ్చిన నివేదికలో జోíషీమఠ్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈ విషయాన్ని ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న వృద్ధులు కథలుగా చెబుతున్నారు. జోషిమఠ్‌ కనుమరుగైపోతుందా అన్న ఆందోళనలో స్థానికులు దినమొక గండంగా బతుకుతున్నారు.  

కుప్పకూలిన జోషిమఠ్‌ ఆలయం
జోషీమఠ్‌: హిమాలయాల్లో ఉన్న ఉత్తరాఖండ్‌లోని జోíషీమఠ్‌లో ఓ ఆలయం శుక్రవారం సాయంత్రం కుప్పకూలింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని స్థానికులు చెప్పారు. ఆలయ గోడలు పగుళ్లు వారుతుండటంతో 15 రోజుల క్రితమే మూసివేసినట్లు చెప్పారు. సింగ్‌ధర్‌ వార్డులోని చాలా ఇళ్లు బీటలు వారుతుండటంతో 50 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు.

అదేవిధంగా, అక్కడికి సమీపంలోనే ఉన్న జల విద్యుత్‌ కేంద్రంలో పనిచేసే 60 కుటుంబాలను కూడా మరో చోటికి తరలించారు. మర్వారీలోని జలాశయం బీటలు వారి నీరు ధారాళంగా మూడు రోజులుగా దిగువకు వస్తుండటంతో చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. చార్‌ధామ్‌లో కొనసాగుతున్న బైపాస్‌ రోడ్డు, జల విద్యుత్‌ ప్రాజెక్టు పనులను, ఔలి రోప్‌ వే సేవలను నిలిపివేశారు. ఆ ప్రాంతంలో ఏడాది కాలంగా భూమి కుంగిపోతోంది. పక్షం రోజులు గా భూమి కుంగుబాటు మరీ ఎక్కువైంది.

ఏమిటీ జోషీమఠ్‌ ?  
హిమాలయాల్లోని ప్రకృతి అందాలకు నెలవు ఈ పట్టణం. చమోలి జిల్లాలో బద్రీనాథ్, హేమ్‌కుంద్‌ సాహిబ్‌ మధ్య 6 వేల అడుగుల ఎత్తులో జోషీ మఠ్‌ ఉంది. కేదార్‌నాథ్, బద్రీనాథ్‌ యాత్రికులకు స్వాగతం చెబుతున్నట్టుగా ఈ పట్టణం ఉంటుంది. జగద్గురు ఆదిశంకరాచార్యుడు ఎనిమిదో శతాబ్దంలో జోíషీమఠ్‌లోనే జ్ఞానోదయం పొందారని ప్రతీతి. ఇప్పటికే అత్యధిక భూకంపం ముప్పు ఉన్న కేటగిరి జోన్‌–5లో ఈ ప్రాంతం ఉంది. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top