తాటాకు చప్పళ్లకు భయపడే ప్రసక్తే లేదు: చిన్నమ్మ

Jayalalithaa death: Sasikala Fire DMK Govt - Sakshi

సాక్షి, చెన్నై: తాను ఎంజీఆర్, జయలలితలను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చానని, రాజకీయంగా తనను అడ్డుకోలేరని చిన్నమ్మ శశికళ అన్నారు. తాటాకు చప్పళ్లకు తాను భయపడే ప్రసక్తే లేదన్నారు. దివంగత సీఎం జయలలిత మృతి మిస్టరీపై జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌ సమరి్పంచిన నివేదిక రెండు రోజుల క్రితం అసెంబ్లీకి చేరిన విషయం తెలిసిందే. ఇందులోని అంశాలన్నీ జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ చుట్టూ తిరుగుతుండడం గమనార్హం. ఆమెతో పాటు మాజీ సీఎస్‌ రామ్మోహన్‌రావు, మాజీ మంత్రి విజయభాస్కర్‌ సహా ఏడుగురి వద్ద సమగ్ర విచారణకు కమిషన్‌ సిఫార్సు చేసింది. ప్రధానంగా అమ్మ మృతి మిస్టరీని కమిషన్‌ విచారణలో తేలనప్పటికీ, శశికళను టార్గెట్‌ చేస్తూ పేర్కొన్న అంశాలు చర్చకు దారి తీశాయి. ఆమెను విచారణలోకి తెచ్చేందుకు ప్రత్యేక సిట్‌పై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. ఈ విషయంపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలు, వ్యూహాలపై శశికళ స్పందించారు. శుక్రవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.  

డీఎంకేది కక్షసాధింపు ధోరణి 
డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినానంతరం అన్ని వర్గాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని ఆరోపించారు. రైతులు కన్నీటి మడుగులో మునిగి ఉన్నారని, విద్యుత్‌ చార్జీల పెంపు, ఆస్తి పన్ను, వాట ర్‌ట్యాక్స్‌ పెంపుతో పేద, మధ్య తరగతి వర్గాలు తీవ్ర ఆర్థిక భారాన్ని మోయాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. వర్షాల రూపంలో గ్రామాలు నీట మునిగాయని, వాటి గురించి పట్టించుకోవడం లేద ని ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలు, ఆరోపణలు పక్కదారి పట్టించేందుకు తనను ఈ పాలకులు టార్గెట్‌ చేశారని మండిపడ్డారు. ప్రజా సమస్యలు ఎలా పరిష్కరించాలో తెలియక ఈ పాలకులు తికమక పడుతున్నారని విమర్శించారు. తాను ఈ పాలకులను ప్రశి్నస్తూనే ఉంటానని, ప్రజల సమస్యలు ఎత్తి చూపిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. తాను దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత మార్గంలో రాజకీయాల్లోకి వచ్చానని, కాకమ్మ బెదిరింపులు, తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తేలేదన్నారు. డీఎంకే ప్రభుత్వం పతనం లక్ష్యంగా, తమిళ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. 

నిందితులను శిక్షించాలి 
ఆర్ముగస్వామి కమిషన్‌ నివేదికలో పేర్కొన్న అంశాలపై జయలలిత మేనకోడలు దీపా స్పందించారు. రాజకీయ స్వలాభం కోసం మేనత్త జయలలితకు శశికళ సరైన వైద్యం అందించలేదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వం విచారణను వేగవంతం చేయాలని కోరారు. జయలలిత మరణం వెనుక ఎవరెవరు ఉన్నారో, ఎందరికి సంబంధాలు ఉన్నాయో వెలుగులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని దీపా కోరారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top