తూర్పులద్దాఖ్‌లో పీఎల్‌ఏపై ఆర్మీ పైచేయి

Indian Army fully geared to fight full fledged war in eastern Ladakh - Sakshi

20 పర్వత ప్రాంతాలపై పట్టు సాధించిన భారత సైన్యం

నేడు భారత్, చైనా కమాండర్ల చర్చలు

న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో భారత ఆర్మీ చైనా పీఎల్‌ఏపై పైచేయి సాధించింది. ఒక వైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే గడిచిన మూడు వారాల్లో కీలకమైన 20 పర్వత ప్రాంతాలను భారత సైన్యం ఆధీనంలోకి తీసుకుంది. భారత్‌ ఇచ్చిన షాక్‌తో దిమ్మెర పోయిన చైనా ఆర్మీ అరుణాచల్‌ప్రదేశ్‌తో గల సరిహద్దుల్లో మోహరింపులు పెంచి, కయ్యానికి కాలుదువ్వుతోంది. ఈ నేపథ్యంలో భారత్, చైనా కమాండర్‌ స్థాయి ఆరో విడత చర్చలు సోమవారం జరగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.

ఈ సమావేశంలో భారత బృందంలో విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారి కూడా పాలు పంచుకునే అవకాశముంది. ఈ చర్చలు తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖకు చైనావైపున్న మోల్దోలో జరగనున్నాయి. లద్దాఖ్‌ గగనతలంపై రఫేల్‌ యుద్ధ విమానాలు పహారా కాస్తున్నాయి.‘ఆగస్టు 29 మొదలు సెప్టెంబర్‌ రెండో వారం వరకు భారత సైన్యం 20 ప్రధాన పర్వత ప్రాంతాలను ఆక్రమించింది. ఆర్మీ ఆధీనంలోకి తీసుకున్న వాటిలో మగార్‌ హిల్, గురుంగ్‌ హిల్, రెచెన్‌ లా, రెజంగ్‌ లా, మొఖ్‌పరితోపాటు ఫింగర్‌ 4కు సమీపంలోని పర్వతప్రాంతం ఉన్నాయి’ ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి.

‘ఇంతకుముందు ఈ ప్రాంతాల్లో చైనా ఆర్మీ పీఎల్‌ఏ ఆధిపత్యం ఉండేది. తాజా పరిణామంతో మన బలగాలు ఈ ప్రాంతంలో శత్రువుపై పైచేయి సాధించినట్లయింది’అని ఆ వర్గాలు తెలిపాయి. భారత భూభాగం వైపున పాంగాంగ్‌ సరస్సు ఉత్తర, దక్షిణం  వైపు ఉన్న ఈ పర్వత భాగాలను ఆక్రమించుకునే క్రమంలో చైనా ఆర్మీ ప్రతిఘటించిందనీ, ఈ సందర్భంగా  మూడు పర్యాయాలు గాల్లోకి కాల్పులు కూడా జరిగాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత ఆర్మీ కదలికలతో ఇప్పటికే ఉన్న బలగాలకు తోడు మరో 3,000 బలగాలను చైనా అదనంగా రెజంగ్‌ లా, రెచెన్‌ లా పర్వత ప్రాంతాలకు సమీపంలోకి రప్పించిందని తెలిపాయి. దీంతోపాటు మోల్డో సైనిక స్థావరంలోకి అదనపు బలగాలను తరలించిందని వివరించాయి.

అరుణాచల్‌ సరిహద్దుల్లో చైనా కుట్ర
తూర్పు లద్దాఖ్‌ అనంతరం చైనా దృష్టి అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దులపై పడింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆదేశాలతో అప్పర్‌ సుబన్‌సిరిలోని అసపిలా, లాంగ్జు, బిసా, మఝా ప్రాంతాల్లోకి పీఎల్‌ఏ మోహరింపులు పెరిగాయి. దీంతోపాటు ఎల్‌ఏసీకి సమీపంలోని బిసాలో ఒక రోడ్డును కూడా నిర్మించింది. భారత సైన్యం కూడా దీటుగా స్పందించింది. ఆరు సమస్యాత్మక ప్రాంతాలు, 4 సున్నిత ప్రాంతాల్లో గస్తీని పెంచింది. ఎలాంటి దురాక్రమణనైనా తిప్పికొట్టేందుకు సర్వం సన్నద్ధమైంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top