రోజుకు 5 లక్షల కరోనా కేసులు వచ్చినా సిద్ధం

India Prepared To Handle 5 Lakh Covid Cases Day: VK Paul - Sakshi

సర్వసన్నద్దంగా ఉన్నామని కేంద్రం ప్రకటన

రాబోయే మూడు నెలలు అత్యంత కీలమని వ్యాఖ్య

న్యూఢిల్లీ: కరోనా మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్దంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రోజుకు 5 లక్షల కోవిడ్‌ కేసులు నమోదైనా వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించింది. అయితే మున్ముందు కరోనా కేసులు తగ్గే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. 

ఆక్సిజన్‌, ఐసీయూ పడకలు సిద్ధం
కోవిడ్ -19 రోగుల కోసం 8.36 లక్షల హాస్పిటల్ పడకలు అందుబాటులో ఉన్నాయని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) వీకే పాల్‌ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దాదాపు మిలియన్‌ (9,69,885) అదనపు ఐసోలేషన్ పడకలు సిద్ధం చేసినట్టు వెల్లడించారు. వీటితో పాటు 4.86 లక్షల ఆక్సిజన్ పడకలు, 1.35 లక్షల ఐసీయూ పడకలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. 

సన్నద్దతలో ముందున్నాం
కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య ప్రస్తుతం తక్కువగా ఉన్నప్పటికీ.. వైద్య ఏర్పాట్లలో తాము తక్కువగా లేమని అన్నారు. కరోనా వైరస్‌ ఎప్పుడు ఎలా విరుచుకుపడుతుందో తెలియదని, ముందు జాగ్రత్తగా భారీ స్థాయిలో సన్నద్దమవుతున్నామని తెలిపారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు బాగా పనిచేస్తున్నాయని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రైవేట్ రంగం ఇందులో పాలుపంచుకుంటోందన్నారు. 

దేశంలో దాదాపు 1,200 ప్రెజర్ స్వింగ్ అడ్‌జార్షన్‌ (పీఎస్‌ఏ) ఆక్సిజన్ ప్లాంట్లు ఇప్పుడు పనిచేస్తున్నాయని వెల్లడించారు. మున్ముందు ఆక్సిజన్ కొరత తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామని, ఇందుకోసం మరో 4 వేల పీఎస్‌ఏ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు వీకే పాల్‌ చెప్పారు. దేశంలో ఇప్పుడు కోవిడ్‌-19 వ్యాక్సిన్ కొరత లేదని,  ప్రజలు రెండో డోస్‌ టీకాలు వేయించుకునేందుకు ముందుకు రావాలని కోరారు. ‘ఒకవేళ మళ్లీ కరోనా కేసులు పెరిగినా ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. రోజుకు నాలుగున్నర నుంచి 5 లక్షల కోవిడ్‌ కేసులు వచ్చినా చికిత్స అందించేందుకు సన్నాహాలు చేస్తున్నామ’ని అన్నారు. 

ఈ మూడు నెలలు కీలకం: లవ్ అగర్వాల్
ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మాట్లాడుతూ... కరోనా మహమ్మారిపై పోరాటంలో రాబోయే మూడు నెలలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ మూడు నెలలు కరోనా మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top