భావి అవసరాలు తీర్చేలా నూతన విద్యావిధానం

India National Education Policy is futuristic - Sakshi

అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీస్‌ వార్షిక సదస్సులో ప్రధాని మోదీ

అహ్మదాబాద్‌: భారత్‌  గత సంవత్సరం ఆవిష్కరించిన నూతన విద్యా విధానం భవిష్యత్‌ అవసరాలను తీర్చగలదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆ విధానాన్ని రూపొందించారని ప్రశంసించారు. విద్యార్థి నేర్చుకునే జ్ఞానం దేశాభివృద్ధికి ఉపయోగపడాలనే డాక్టర్‌ ఎస్‌ రాధాకృష్ణన్‌ ఆకాంక్షను తీర్చేదిగా ఉందన్నారు. ప్రజాస్వామ్య విలువలు భారత సామాజిక జీవనంలో అంతర్లీనంగా ఉన్నాయన్నారు.

అహ్మదాబాద్‌లోని బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ నిర్వహించిన ‘అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీస్‌’ 95వ వార్షిక సమావేశం, యూనివర్సిటీ వైస్‌ చాన్సెలర్ల జాతీయ సెమినార్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ బుధవారం ప్రసంగించారు. ప్రతీ విద్యార్థికి వేర్వేరు ప్రత్యేక సామర్థ్యాలు ఉంటాయని, వాటిని గుర్తించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుడిపై ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు. ‘విద్యార్థి సామర్థ్యం ఏమిటి? సరిగ్గా బోధిస్తే ఏ స్థాయికి వెళ్లగలడు? ఆ విద్యార్థి లక్ష్యం ఏమిటి? అనే అంశాలను విశ్లేషించాలి’ అని సూచించారు.

కృత్రిమ మేథ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, బిగ్‌ డేటా, 3డీ ప్రింటింగ్, వర్చువల్‌ రియాలిటీ, రోబోటిక్స్, జియో ఇన్ఫర్మేటిక్స్, మొబైల్‌ టెక్నాలజీ, స్మార్ట్‌ హెల్త్‌ కేర్, రక్షణ తదితర రంగాల్లో భారత్‌ను యావత్‌ ప్రపంచం దిక్సూచిగా చూస్తోందన్నారు. భవిష్యత్‌ అవసరాల కోసం మూడు నగరాల్లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్కిల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. జ్ఞానం, ఆత్మగౌరవం, మర్యాదపూర్వక వ్యవహారశైలిని అంబేద్కర్‌ గౌరవించేవారన్నారు. ఆయన చూపిన ఈ మార్గంలో నడిచే బాధ్యతను మన విద్యాలయాలు చేపట్టాలన్నారు. అంబేద్కర్‌పై కిశోర్‌ మాక్వానా రచించిన నాలుగు పుస్తకాలను ప్రధాని ఆవిష్కరించారు.  

అంబేద్కర్‌కు ప్రధాని నివాళులు
బీఆర్‌ అంబేడ్కర్‌ 130వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాలను సామాజిక స్రవంతిలోకి తీసుకురావడానికి అంబేడ్కర్‌ చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తిదాయకమని ప్రధాని పేర్కొన్నారు. జయంతి సందర్భంగా అంబేడ్కర్‌కు శిరçస్సు వంచి నమస్కరిస్తున్నానని బుధవారం ప్రధాని ట్వీట్‌ చేశారు.   

సరిపడా వ్యాక్సిన్లు అందజేస్తాం
► కరోనాపై కలిసికట్టుగా పోరాడుదాం
► ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు

సాక్షి, న్యూఢిల్లీ: దేశ అవసరాలకు సరిపడా కోవిడ్‌–19 వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కరోనా మహమ్మారిపై అందరం కలిసికట్టుగా పోరాడుతామని పిలుపునిచ్చారు. ఈ విషయంలో రాజకీయ పార్టీలు, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు, కమ్యూనిటీ గ్రూప్‌లు ఏకతాటిపైకి రావాలని కోరారు. మోదీ గురువారం అన్ని రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. కరోనాను ఎదుర్కొనే విషయంలో సామాజిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేసేలా చూడాలని అన్నారు. గత ఏడాది వైరస్‌ ఉధృతి అధికంగా ఉన్నప్పుడు జన్‌ భాగీదారి(ప్రజల భాగస్వామ్యం)తో సమర్థంగా కట్టడి చేయగలిగామని గుర్తుచేశారు. ఈసారి కూడా ప్రజలను మరింత కార్యోన్ముఖులను చేయాలని పిలుపునిచ్చారు.

టీమ్‌ ఇండియా స్ఫూర్తితో పోరాటం
కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో అందరినీ కలుపుకొని పోయేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలను పక్కనపెట్టి ఈ పోరాటంలో ‘టీమ్‌ ఇండియా’ స్ఫూర్తితో ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించడం (టెస్ట్‌), వైరస్‌ రూపాంతరం చెందుతున్న తీరుపై దృష్టి పెట్టడం (ట్రాక్‌), సరైన సమయంలో చికిత్సనందించడం (ట్రీట్‌)’ అనే వ్యూహాన్ని సమర్థంగా అమలు చేయాలని సూచించారు. ఆయన బుధవారం గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top