ఈ నేష‌న‌ల్ హైవేల‌పై బీకేర్‌ఫుల్‌! | India most dangerous national highways list | Sakshi
Sakshi News home page

ఈ నేష‌న‌ల్ హైవేల‌పై జాగ్ర‌త్త‌!

Jun 18 2025 7:49 PM | Updated on Jun 18 2025 8:06 PM

India most dangerous national highways list

నేష‌న‌ల్ హైవేల‌పై ర‌య్ అంటూ దూసుకుపోతున్నారా? అయితే ఈ వార్త మీ కోస‌మే. మ‌న దేశంలో ఏటా రోడ్డు ప్ర‌మాదాల్లో ల‌క్ష‌లాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ల‌క్ష‌ల్లో క్ష‌త‌గాత్రులవుతున్నారు. సుదూర ప్రాంతాల‌ను క‌లిపే జాతీయ ర‌హ‌దారుల‌పైనా జ‌రుగుతున్న యాక్సిడెంట్లు ఎంతో మందిని బ‌లితీసుకుంటున్నాయి. 2022 కేంద్ర ప్ర‌భుత్వ గ‌ణాంకాల ప్ర‌కారం దేశంలో మొత్తం 4,61,312 రోడ్డు ప్ర‌మాదాలు జ‌ర‌గ్గా.. నేష‌న‌ల్ హైవేల‌పై 1,51,997 యాక్సిడెంట్లు చోటుచేసుకున్నాయి. అదే ఏడాది మొత్తం రోడ్డు ప్ర‌మాదాల్లో 1,68,491 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. జాతీయ ర‌హ‌దారుల‌పై జ‌రిగిన ప్ర‌మాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 61,038.

మోస్ట్ డేంజ‌ర్‌.. ఎన్‌హెచ్‌-44 
అయితే జాతీయ ర‌హ‌దారుల్లో కొన్ని అత్యంత ప్ర‌మాద‌క‌రంగా మారాయ‌ని సేవ్‌లైఫ్ ఫౌండేష‌న్ వెల్ల‌డించింది. 2023 ప్ర‌మాదాల గ‌ణాంకాల ప్ర‌కారం 100 హైవేల‌కు ఈ సంస్థ ర్యాంకులు ఇచ్చిన‌ట్టు నేష‌న‌ల్‌ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) అధికారులు తెలిపారు. ఉత్తరాన శ్రీనగర్ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు విస్త‌రించి, దేశంలోని అతి పొడవైన రహదారిగా గుర్తింపు పొందిన ఎన్‌హెచ్‌-44 అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన హైవేగా తేలింది. హ‌రియాణా, ఢిల్లీలో 44వ నంబ‌రు జాతీయ ర‌హ‌దారిపై 2023లో జ‌రిగిన ప్ర‌మాదాల్లో ఎక్కువ మ‌ర‌ణాలు సంభ‌వించిన‌ట్టు వెల్ల‌డైంది.

కిలోమీట‌ర్‌కు 3 మ‌ర‌ణాలు
ఎన్‌హెచ్‌-44 హ‌రియాణాలో 266 కిలోమీట‌ర్లు విస్తర్తించి ఉంది. 2023లో ఈ ర‌హ‌దారిపై జ‌రిగిన ప్ర‌మాదాల్లో 715 మంది దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. అంటే కిలోమీట‌ర్‌కు మూడు మ‌ర‌ణాలు సంభ‌వించాయి. ఢిల్లీలో 30 కిలోమీట‌ర్ల మేర విస్త‌రించిన ఈ హైవేపై 63 మంది మృత్యువాత ప‌డ్డారు. కిలోమీట‌ర్‌కు దాదాపు 2 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. ముక‌ర్బా చౌక్‌- సంఘూ బోర్డ‌ర్‌, ఆశారాం- బ‌హ‌దూర్‌పూర్ డేంజ‌ర్ స్పాట్ల‌గా గుర్తించారు. హ‌రియాణా ప‌రిధిలో 85 కిలోమీట‌ర్ల మేర‌ ఎన్‌హెచ్‌-48 విస్త‌రించివుంది. ఈ రూట్లో గుర్గావ్‌- రాజ‌స్థాన్ బోర్డ‌ర్‌ను మూడో డేంజ‌ర్ జోన్‌గా పేర్కొంటున్నారు.

చ‌ద‌వండి: 6 వారాల్లో 3 హెలికాప్ట‌ర్ ప్ర‌మాదాలు.. ఏం జ‌రుగుతోంది?

జాతీయ ర‌హ‌దారుల‌పై ఎక్క‌డెక్క‌డ ఎక్కువ ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయో గుర్తించి, వాటిని నివారించడానికి చేప‌ట్టాల్సిన చ‌ర్య‌లు చేప‌ట్ట‌డానికి ఈ డేటా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఎన్‌హెచ్ఏఐ అధికారులు తెలిపారు. ర‌క్ష‌ణ చ‌ర్య‌ల కోసం హైవే బిల్డ‌ర్లు, ఆప‌రేట‌ర్ల‌ను ఆదేశించ‌డానికి ఈ గ‌ణాంకాలు దోహ‌ద‌ప‌డ‌తాయ‌న్నారు. 


 

Advertisement
 
Advertisement
Advertisement