రికవరీ రేటు 75.27%

India Covid-19 Tally Crosses 31 Lakh with Single-day - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో సోమవారం మరో 61,408  కోవిడ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 31,06,348కు చేరుకుంది. కరోనా కేసులు 30 లక్షల నుంచి 31 లక్షలకు కేవలం ఒక్క రోజులోనే చేరుకున్నాయి. 24 గంటల్లో 57,469 మంది కోలుకోగా, 836 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 57,542కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 23,38,035కు చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 7,10,771గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల శాతం 22.88గా ఉంది.

యాక్టివ్‌ కేసుల కంటే మూడు రెట్లు కోలుకున్న కేసులు ఉండటం గమనార్హం. దేశంలో కరోనా రికవరీ రేటు 75.27 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.85 శాతానికి పడిపోయిందని తెలిపింది. ఆగస్టు 22 వరకు 3,52,92,220 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. శనివారం మరో 8,01,147 శాంపిళ్లను పరీక్షించినట్లు చెప్పింది. ఆదివారం మరో 6,09,917 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. ఇప్పటి వరకూ నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 3,59,02,137 కు చేరింది. పరీక్షల్లో వస్తున్న పాజిటివిటీ రేటు 8% కంటే తక్కువగా ఉంది.  

హరియాణా సీఎంకు కోవిడ్‌
చండీగఢ్‌/పణజి: హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ కోవిడ్‌ బారిన పడ్డారు.  వారం క్రితం ఆయన కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత షెకావత్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. తన రిపోర్టులో కరోనా పాజిటివ్‌గా వచ్చిందంటూ సీఎం ఖట్టర్‌ సోమవారం ట్విట్టర్‌లో తెలిపారు. అసెంబ్లీ స్పీకర్‌ జ్ఞాన్‌చంద్‌ గుప్తా, బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా పాజిటివ్‌గా తేలింది.

కేంద్ర మంత్రికి తగ్గిన ఆక్సిజన్‌ స్థాయిలు
కోవిడ్‌–19తో చికిత్స పొందుతున్న కేంద్ర మంత్రి శ్రీపాద్‌ నాయక్‌ శరీరంలో ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గినట్లు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ వెల్లడించారు. ఆయన్ను పరీక్షించేందుకు ఢిల్లీ నుంచి వైద్యాధికారుల బృందం రానుందన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top