
ఢిల్లీ: భారత్-పాక్ ఉద్రిక్తతలను తగ్గించుకోవాలంటూ భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్‌కు యూఎస్ విదేశాంగ కార్యదర్శి రూబియా సూచించారు. జై శంకర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఆయన.. రెండు దేశాలు చర్చలు జరుపుకోవాలని కోరారు. పరిస్థితులు సద్దుమణిగేలా చూడాలన్న రూబియో.. అవసరమైతే ఇరుదేశాల మధ్య చర్చలకు సాయం చేస్తామంటూ ప్రతిపాదించారు. భారత్ విధానం ఎప్పుడు కూడా బాధ్యతాయుతంగానే ఉంటుందని జైశంకర్ అన్నారు.
అదే విధంగా.. కొన్ని గంటల ముందు.. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు కూడా ఫోన్ చేసి రూబియో మాట్లాడారు. ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ స్థిరత్వం కోసం ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని, ఇరు దేశాల మధ్య చర్చల అవసరం ఉందని తెలిపారు. వారం రోజుల వ్యవధిలో రూబియో.. జైశంకర్‌తో మాట్లాడటం ఇది రెండోసారి. ఉద్రిక్తతలను తగ్గించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. అలాగే, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌తో కూడా విడిగా మాట్లాడుతూ, ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం మానుకోవాలని చెప్పారు.
మరోవైపు, ఉద్రిక్తతలను చల్లార్చేందుకు తాము నిత్యం సౌదీ అరేబియా, ఇరాన్, ఖతార్, చైనా వంటి దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చెప్పారు. గురువారం సౌదీ విదేశాంగ శాఖ సహాయ మంత్రి అడెల్ అల్ జుబేర్ ఢిల్లీకి రావడం తెల్సిందే. అనంతరం శుక్రవారం ఆయన పాక్ చేరుకున్నారు. ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్‌తో చర్చలు జరపనున్న వేళ మంత్రి ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.