పాట్నా: బీహార్‌లో విషాదం చోటు చేసుకుంది. తాళికట్టిన భార్యనే దారుణంగా హతమార్చాడో కసాయి భర్త. కారణం తను నల్లగా ఉన్నా.. తనకు పుట్టిన బిడ్డ తెల్లగా ఉండటమే.
పోలీసుల వివరాల మేరకు.. కతిహార్ జిల్లా అబాద్‌పూర్ థానా పరిధి నారాయణ్‌పూర్ గ్రామంలో మహిళ హత్య కేసు స్థానికంగా తీవ్రంగా కలకలం రేపుతోంది. కుటుంబ కలహాలు,అనుమానం, ఇరుగుపొరుగు వారు సూటి పోటి మాటలు ఈ విషాదానికి కారణమని తెలుస్తోంది.
అజమ్‌నగర్‌లోని జల్కి గ్రామానికి చెందిన సుకుమార్ దాస్, మౌసుమి దాస్ దంపతులకు మూడు నెలల క్రితం బిడ్డ పుట్టాడు. అయితే ఆ బిడ్డ చర్మరంగు తెల్లగా ఉంది. తాను నల్లగా ఉండటంతో దాని గురించి చుట్టుపక్కలవారు అనవసర వ్యాఖ్యలు, ఎగతాళి చేశారు. అవి సుకుమార్‌లో అనుమానాలు పెంచాయి. ఆ అనుమానం కాస్తా పెనుభూతంలా మారింది. దీంతో బిడ్డ పుట్టిన మరుక్షణం నుంచి సాఫిగా సాగిపోతున్న దాంపత్య జీవితంలో చిచ్చు రాజేశాయి.
ఈ క్రమంలో బాధితురాలి తండ్రి మధ్యవర్తిత్వం చేసి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. సరికాదా ఆ తగాదాలు మరింత తీవ్రమయ్యాయి. చేసేది లేక బాధితురాలు పుట్టింటుకొచ్చింది. ఆ మరుసటి రోజే ముందస్తు ప్లాన్ ప్రకారం.. అత్తింట్లో ఉన్న భార్యను భర్త అత్యంత క్రూరంగా దాడి చేసి గొంతుకోసి ప్రాణం తీశాడు. అనంతరం సుకుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.


