
రాజస్తాన్ ఝలవార్ జిల్లా ప్రభుత్వ పాఠశాల పైకప్పు కూలిన ఘటనలో ఏడుగురు పిల్లలు మృత్యవాత పడగా, 25 మంది వరకూ గాయపడ్డారు. శుక్రవారం(జూలై 25) ఉదయం 8.30గం.ప్రాంతంలో మనోహర్ థానాలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాల భవనంలోని ఓ తరగతి పైకప్పు కుప్పకూలడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. విద్యార్థులు అప్పుడే క్లాస్ రూమ్‌కు వచ్చి కూర్చున్న సమయంలో జరగడంతో స్కూల్‌కు ఆలస్యంగా వెళ్లినా ఇంత దారుణం జరిగేది కాదని, బాధిత తల్లి దండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.
నన్ను తీసుకుపోయినా బాగుండు..
తనకు తోడుగా ఉన్న ఇద్దరు పిల్లలు ఆ స్కూల్ పై కప్పు కుప్పకూలిన ఘటనలో మృత్యువాత పడటంతో ఓ తల్లి రోదిస్తున్న తీరు హృదయాల్ని కలిచి వేస్తోంది. ఆ దేవుడు ఇంత పని చేస్తాడనుకోలేదని తనను ఒంటరిని చేసి పిల్లల్ని తీసుకుపోయాడని కన్నీటి పర్యంతమవుతోంది. ‘ ఆ దేవుడు నా పిల్లలకి జీవితాన్నిచ్చి, నన్ను తీసుకుపోయినా బాగుండు. వాళ్లు లేకుండా నేను ఏం చేసేది. పిల్లలు ఇక తిరిగి రారని తెలిసి నా ఇళ్లు ఒంటరిదైంది. పిల్లలు ఆడుకునే ఆట స్థలం వారి కోసం ఎదురుచూస్తోంది. వారితో ఆటలు ఆడుకునే నేను ఇక ఎవ్వరితో ఆడుకోవాలి. నా కూతురు, నా తనయుడు ఆ దేవుడి దగ్గరికి వెళ్లిపోయారు. ఇక నాకు ఈ జీవితం ఎందుకు?’ అంటూ ఆమె బోరున విలపిస్తోంది.
స్కూల్ టీచర్లు బయట ఏం చేస్తున్నారు?
స్కూల్ పైకప్పు కూలిన ఘటనలో మృతి చెందింది అంతా చిన్నారులే. ఈ ఘటనలో ఏ టీచర్‌కు ఏమీ కాలేదు. ఇప్పుడు ఇదే అంశాన్ని లేవనెత్తింది ఇద్దరి పిల్లల్ని కోల్పోయిన తల్లి. ఆ సమయంలో స్కూల్‌కు ఎవరైతే టీచర్లు వచ్చారో వారంతా బయటే ఉండటంతో బ్రతికి పోయారని, పిల్లల్ని లోపలికి పంపి బయట టీచర్లు ఏం చేస్తున్నారని ఆ తల్లి ప్రశ్నిస్తోంది. స్కూల్‌లో పిల్లల సంరక్షణ చూసుకోవాల్సిన టీచర్లు.. తమ పిల్లల్ని మాత్రం వారు పొట్టనపెట్టుకున్నారని చెదిరిన హృదయంతో విలపిస్తోంది. 2 ఏళ్ల మీనా, 6 ఏళ్ల కన్హాలను కోల్పోవడంతో ఆ తల్లి బాధ వర్ణనాతీతంగా మారింది.
ఇక ప్రభుత్వాలు ఎందుకు?
స్కూల్ పైకప్పు కూలిన ఘటనలో అది ప్రభుత్వ పాఠశాల కావడం మరో చర్చకు దారి తీసింది. స్కూల్ పైకప్పుకు మరమ్మత్తులు చేసి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది,. ప్రభుత్వాలు ఉన్నా కనీసం స్కూళ్లను కూడా బాగు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ స్కూల్ మరమ్మత్తులు కోసం చిన్నారులే స్వయంగా ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన రాలేదని సమాచారం.
చిన్నబోయిన గ్రామం..
ఆ ఘటనలో మృతి చెందిన చిన్నారుల్లో 12 ఏళ్ల చిన్నారులు ఐదుగురు ఉన్నారు. పాయల్, ప్రియాంక, కార్తీక్, మీనా, కుందన్‌లు 12 ఏళ్ల వయసు గల పిల్లలు కాగా, ఎనిమిదేళ్ల హరీష్, ఆరేళ్ల కన్హాలు ఉన్నారు. ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో కన్హానే అత్యంత పిన్నవయసు గల చిన్నారి. చిన్నారుల మృత్యువాతతో మనోహర్ థానాలోని పిప్లోడి గ్రామం చిన్నబోయింది. ఎక్కడ చూసినా విషాద చాయలే కనిపిస్తున్నాయి. ఎంతో సరదాగా స్కూల్‌కు వెళ్లిన ఆ చిన్నారులు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ గ్రామంలో శ్మశాన వైరాగ్యం కనిపిస్తోంది.
మృతదేహాలు అప్పగింత..
ఆ ఏడుగురు చిన్నారుల మృతదేహాలను ఈరోజు(శనివారం, జూలై 26) ఆయా కుటుంబాలకు అప్పగించారు. ఝల్‌వార్ ఎస్‌ఆర్‌జీ హాస్పిలల్ మెడికల్ కాలేజ్‌లో పోస్టుమార్టం పూర్తి చేసిన అనంతరం మార్చురీ నుంచి ఆ మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించారు. తమ పిల్లల మృతదేహాలను చూసి బోరున విలిపిస్తున్న తల్లి దండ్రులు ఒకవైపు, కన్నీళ్లను అదిమిపెట్టుకుని పిల్లల ముందు అలా కూర్చిండిపోయి మౌనంగా రోదిస్తున్న పేరెంట్స్ మరొకవైపు. అంతా హృదయ విదారకంగా మారింది.