
2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రం
అంతరిక్ష ప్రయోగాల్లో ముందంజలో భారత్
ప్రధాని నరేంద్ర మోదీ హర్షం
న్యూఢిల్లీ: అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ ముందంజలో దూసుకెళ్తోందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. 2040 నాటికి చందమామపై మన వ్యోమగాములు అడుగు పెట్టబోతున్నారని చెప్పారు. అంగారక(మార్స్), శుక్ర(వీనస్) గ్రహాలపైనా ప్రయోగాలు చేయబోతున్నట్లు వెల్లడించారు. గ్లోబల్ స్పేస్ ఎక్ప్‌ప్లోరేషన్ కాన్ఫరెన్స్(గ్లెక్స్–2025) సందర్భంగా ప్రధాని మోదీ బుధవారం ఈ మేరకు వీడియో సందేశం విడుదల చేశారు. అంతరిక్ష ప్రయోగ ప్రణాళికలు వివరించారు.
2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత 2040 నాటికి చంద్రుడిపై మన పాదముద్ర ఉంటుందని పేర్కొన్నారు. మరో 15 ఏళ్లలో భారతీయ వ్యోమగాములు చందమామపై అడుగుపెట్టడం తథ్యమని స్పష్టంచేశారు. మన అంతరిక్ష ప్రయాణం ఇతరులతో పోటీకి సంబంధించింది కాదని, అందరినీ కలుపుకొని ఈ రంగంలో ఉన్నత శిఖరాలకు చేరాలన్నదే అసలు లక్ష్యమని ఉద్ఘాటించారు. మొత్తం మానవాళికి లబ్ధి చేకూరేలా అంతరిక్ష ప్రయోగాల్లో తమ ఉమ్మడి లక్ష్యాన్ని అందరితో పంచుకుంటామని వ్యాఖ్యానించారు.
జీ20 ఉపగ్రహం ప్రయోగిస్తాం
దక్షిణాసియా దేశాల కోసం ఒక శాటిలైట్ ప్రయోగించామని ప్రధాని మోదీ గుర్తుచేశారు. గ్లోబల్ సౌత్ దేశాలకు బహుమతిగా జీ20 ఉపగ్రహం ప్రయోగించబోతున్నామని చెప్పారు. గగన్‌యాన్ ప్రాజెక్టు మన దేశ ఆకాంక్షలకు ప్రతిబింబిస్తోందని అన్నారు. మన తొలి మానవసహిత స్పేస్–ఫ్లైట్‌ను త్వరలో అంతరిక్షంలోకి పంపించబోతున్నామని చెప్పారు. ఇస్రో–నాసా ఉమ్మడి మిషన్‌లో భాగంగా భారతీయ వ్యోమగామి మరికొన్ని వారాల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్‌ఎస్) చేరుకోబోతున్నాడని వివరించారు.
అంతరిక్షం అంటే కేవలం ఒక గమ్యం కాదని.. ఉత్సకత, ధైర్యం, సమీకృత ప్రగతికి ఒక ప్రతీక అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. భారతదేశ అంతరిక్ష ప్రయాణం ఆ దిశగానే సాగుతోందని చెప్పారు. 1963లో ఒక చిన్న రాకెట్ ప్రయోగంతో మన అంతరిక్ష యాత్ర ఆరంభమైందని గుర్తుచేశారు. అనంతరం ఈ రంగంలో ఎంతగానో పురోగమించామని, చంద్రుడి దక్షిణ ధ్రువంపై స్పేస్‌క్రాఫ్ట్‌ను ల్యాండ్ చేసిన తొలి దేశంగా రికార్డు సృష్టించామని పేర్కొన్నారు. మన ప్రయాణం చరిత్రాత్మకమని అభివరి్ణంచారు. మన రాకెట్లు పేలోడ్స్ కంటే అధికంగా 140 కోట్ల మంది భారతీయుల కలలను మోసుకెళ్తుంటాయని వివరించారు.
తొలి ప్రయత్నంలోనే మార్స్ వద్దకు చేరుకున్న దేశంగా ఇండియా చరిత్ర సృష్టించిందన్నారు. చంద్రయాన్ ప్రయోగాలతో చంద్రుడిపై నీటి జాడ కనిపెట్టామని, అత్యంత నాణ్యమైన చంద్రుడి ఫొటోలు చిత్రీకరించామని, అక్కడి దక్షిణ ధ్రువం గురించి మరింత సమాచారం తెలుసుకున్నామని వెల్లడించారు. రికార్డు సమయంలో క్రయోజెనిక్ ఇంజన్లు తయారు చేశామని, ఒకేసారి 100 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించామని గుర్తుచేశారు. 34 దేశాలకు చెందిన 400కుపైగా శాటిలైట్లను మన అంతరిక్ష నౌకల ద్వారా ప్రయోగించామని అన్నారు. ఈ ఏడాది అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానించామని, ఇదొక గొప్ప ముందడుగు అని తెలియజేశారు.