భారత్‌లో పాకిస్థాన్‌ మాజీ ప్రధాని బడ్జెట్‌ ప్రవేశపెట్టారా? | Sakshi
Sakshi News home page

Budget 2024:భారత్‌లో పాకిస్థాన్‌ మాజీ ప్రధాని బడ్జెట్‌ ప్రవేశపెట్టారా?

Published Wed, Jan 31 2024 9:32 AM

Former PM of Pakistan Also Once Presented Indias Budget - Sakshi

రేపు అంటే 2024, ఫిబ్రవరి  ఒకటిన దేశ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారతదేశంలో బడ్జెట్ చరిత్ర 180 సంవత్సరాల పురాతనమైనది. బ్రిటీష్ వారి కాలం నుంచి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. అయితే పాకిస్తాన్ ప్రధాని ఒకరు భారత బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన  సందర్భముంది. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది.

1946 ఫిబ్రవరి 2న పాకిస్తాన్ మొదటి ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ భారతదేశ బడ్జెట్‌ను సమర్పించారు. నిజానికి ఆ సమయంలో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో లియాఖత్ అలీఖాన్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఈ బడ్జెట్‌ను భారత్‌, పాకిస్తాన్‌ విభజనకు ముందు ప్రవేశపెట్టారు. లియాఖత్ అలీ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. తదనంతర కాలంలో లియాఖత్ అలీ ఖాన్ పాకిస్తాన్ తొలి ప్రధాని అయ్యారు.

మహ్మద్ అలీ జిన్నాకు సన్నిహితుడైన లియాఖత్ అలీఖాన్ ఈ బడ్జెట్‌ను సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (నేటి పార్లమెంట్ హౌస్)లో సమర్పించారు. చరిత్రలో నేటికీ ఈ బడ్జెట్‌ను ‘పేదవారి’ బడ్జెట్‌గా పిలుస్తుంటారు. ఈ బడ్జెట్‌పై దేశంలోని పారిశ్రామికవేత్తలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లియాఖత్ అలీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పన్నులు చాలా కఠినంగా  ఉంచారు. దీని కారణంగా వ్యాపారవేత్తలు తీవ్రంగా నష్టపోయారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలపై ప్రతి లక్ష రూపాయల లాభంపై 25 శాతం పన్ను విధించాలని ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అంతేకాదు కార్పొరేట్ ట్యాక్స్‌ని రెట్టింపు చేయాలని కూడా నిర్ణయించారు.

ఈ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత లియాఖత్‌ అలీపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ బడ్జెట్‌ను ప్రజలు హిందూ వ్యతిరేక బడ్జెట్‌గా అభివర్ణించారు. వ్యాపారవేత్తలు ఉద్దేశపూర్వకంగానే ఇంత పన్ను విధించారని ఆరోపించారు. హిందూ వ్యాపారులంటే లియాఖత్‌కు నచ్చరని, అందుకే వారిని దెబ్బతీసేందుకు ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారనే విమర్శలు వచ్చాయి. 

భారత్‌-పాక్‌ విభజన తరువాత అలీ ఖాన్‌ పాకిస్తాన్ మొదటి ప్రధాని అయ్యారు. అతను అక్కడ ఎక్కువ కాలం పదవిలో కొనసాగలేదు. 1951లో లియాఖత్‌ అలీని కాల్చి  చంపారు. 

Advertisement
Advertisement