
తారస్థాయికి ‘పహల్గాం’ ఉత్కంఠ
సిద్ధమైన ప్రతీకార వ్యూహం!
‘సూపర్ కేబినెట్’లో నిర్ణయం?
‘పుల్వామా’ తర్వాత తొలి భేటీ
రోజంతా వరుస కేబినెట్ భేటీలు
రాత్రి మోదీ ‘అత్యవసర’ సైనిక సమీక్ష... దోవల్, సీడీఎస్, ఆర్మీ చీఫ్‌తో చర్చలు
‘ఆపరేషన్ పహల్గాం’కు సర్వం సిద్ధం
న్యూఢిల్లీ: ఓవైపు పాశవిక దాడి పట్ల దేశ ప్రజల ఆక్రోశం. నానాటికీ పెరిగిపోతున్న ఆగ్రహావేశాలు. అంతకంతా బదులు తీర్చుకోవాల్సిందేనంటూ నానాటికీ పెరుగుతున్న డిమాండ్లు. మరోవైపు ఒక్కో రోజూ గడుస్తున్న కొద్దీ భయంతో వణికిపోతున్న దాయాది. కసితో రగిలిపోతున్న భారత్ ఈసారి ఎలాంటి దెబ్బ కొట్టనుందో పాలుపోక బెంబేలు. ఏ క్షణమైనా తమపై యుద్ధానికి దిగడం ఖాయమని పాక్ మంత్రుల ముచ్చెమట వ్యాఖ్యలు. వ్యూహాత్మక మౌనంతో పాక్‌ను చెప్పలేనంతగా భయపెడుతున్న మోదీ సర్కారు పూర్తి యాక్షన్ మోడ్‌లోకి దిగింది.
ప్రతీకారం విషయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తూ మంగళవారం నిర్ణయం తీసుకోగా బుధవారం మరిన్ని నిర్ణయాత్మక అడుగులు వేసింది. ఆ దిశగా రోజంతా కీలక పరిణామాలు జరిగాయి. ప్రధాని సారథ్యంలో వరుసగా అత్యున్నత స్థాయి సమావేశాలు జరిగాయి. జమ్మూ కశ్మీర్‌లో తాజా పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై ఉదయం భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో మంత్రివర్గ సహచరులతో మోదీ సమీక్షించారు. అనంతరం సూపర్ కేబినెట్‌గా పిలిచే రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) సమావేశమై పలు అంశాలపై లోతుగా చర్చలు జరిపింది. తర్వాత ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ కూడా జరిగింది.
అనంతరం సాయంత్రం మోదీ సారథ్యంలో పూర్తిస్థాయి కేబినెట్ సమావేశం జరిగింది. ఉగ్రవాదులకు, దాయాదికి మర్చిపోలేని గుణపాఠం నేర్పేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశాల్లో లోతుగా చర్చించడమే గాక పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం బుధవారం రాత్రి ప్రధాని తన అధికార నివాసంలో అతి కీలకమైన ‘సైనిక సమీక్ష’ జరపడం ఎనలేని ప్రాధాన్యం సంతరించుకుంది.
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ తదితరులతో రాత్రి పొద్దుపోయేదాకా భేటీ కొనసాగింది. ప్రతీకార చర్యల వ్యూహానికి ఈ సందర్భంగా స్పష్టమైన తుదిరూపు ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో సర్వ త్రా ఉత్కంఠ తారస్థాయికి చేరింది.
మోదీ రష్యా పర్యటన రద్దు
మే 8న రష్యా పర్యటనను మోదీ రద్దు చేసుకున్నారు. అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు రష్యా ‘విక్టరీ డే’ పరేడ్‌లో మోదీ పాల్గొనాల్సి ఉంది. ప్రధానికి బదులు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ వాటిలో పాల్గొంటారని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. పహల్గాం ఉద్రిక్తతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
విపక్షాల పూర్తి మద్దతు: రాహుల్
పహల్గాం ముష్కరులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని విపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. వారికి, దాయాదికి గుణపాఠం చెప్పేందుకు కేంద్రం తీసుకునే ఏ నిర్ణయానికైనా విపక్షాల పూర్తి మద్దతుంటుందని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో మోదీ స్పష్టంగా, సమర్థంగా వ్యవహరించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
మన గగనతలం మూత
పాక్ పౌర, సైనిక విమానాలకు భారత గగనతలాన్ని పూర్తిగా మూసేస్తూ కేంద్రం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫై చేసింది. ఇది మే 23 దాకా అమల్లో ఉంటుందని పేర్కొంది. దీని ప్రభావం పాక్ విమానయాన సంస్థలపై తీవ్రంగా ఉండనుంది. భారత్‌కు పాక్ ఇప్పటికే తన గగనతలాన్ని మూసేయడం తెలిసిందే.
సూపర్ కేబినెట్ భేటీయే కీలకం!
ప్రధాని అధికార నివాసంలో బుధవారం ఉదయం తొలుత సీసీఎస్ భేటీ జరిగింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ అందులో పాల్గొన్నట్టు సమాచారం. భేటీ ఎజెండా, చర్చల వివరాలు తదితరాలను గోప్యంగా ఉంచారు. పహల్గాం దాడి అనంతరం ఈ వారం రోజుల్లోనే సీసీఎస్ సమావేశమవడం ఇది రెండోసారి కావడం విశేషం. అయితే అనంతరం జరిగిన సీసీపీఏ సమావేశమే బుధవారం నాటి భేటీల్లో అతి కీలకమని భావిస్తున్నారు.
ప్రధాని, రక్షణ, హోం, ఆర్థిక, విదేశాంగ, వాణిజ్య, ఉపరితల రవాణా మంత్రులతో కూడిన ఈ కమిటీ అత్యంత కీలకమైన రాజకీయ, ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది. సీసీపీఏ సమావేశమవడం దాదాపు ఆరేళ్ల తర్వాత ఇదే తొలిసారి! చివరిసారి 2019లో ఈ కమిటీ భేటీ అయింది. అప్పుడు కూడా పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల పాశవిక ఆత్మాహుతి దాడి నేపథ్యంలోనే కావడం గమనార్హం.
ఆ వెంటనే పాక్‌లోని బాలాకోట్‌లో జైషే ఉగ్ర స్థావరాలను వైమానిక దాడులతో నేలమట్టం చేయడమే గాక కనీసం 300 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టారు. పహల్గాం దాడికి ప్రతీకారం చేపట్టాల్సిన చర్యలపై సీసీపీఏ కీలక నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. వాటి రాజకీయ, ఆర్థిక పర్యవసానాలను మంత్రివర్గ సహచరులతో మోదీ కూలంకషంగా చర్చించినట్టు తెలుస్తోంది.