ఇరాన్‌ యుద్ధం ఎఫెక్ట్‌ .. భారత్‌లో వీటి ధరలు పెరగనున్నాయా? | Gulf War Tensions Threaten India Pharmaceutical Supply Chain | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ యుద్ధం ఎఫెక్ట్‌ .. భారత్‌లో వీటి ధరలు పెరగనున్నాయా?

Mar 26 2026 11:12 AM | Updated on Mar 26 2026 11:31 AM

Gulf War Tensions Threaten India Pharmaceutical Supply Chain

ఢిల్లీ: గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు భారత ఔషధ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ (ఇండియా) వెల్ఫేర్ అసోసియేషన్ (DCOIWA) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు జాతీయ అధ్యక్షుడు జి. కోటేశ్వరరావు ఓ ప్రకటన విడుదల చేశారు. 

 భారత్‌ ప్రపంచంలో అతిపెద్ద ఔషధ ఉత్పత్తి, ఎగుమతి దేశాలలో ఒకటిగా ఉన్నందున అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలతో ముడిపడి ఉందని, గల్ఫ్ ప్రాంతంలో భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు ప్రత్యక్షంగా ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ఫలితంగా మెడిసిన్‌ అ ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. 

గల్ఫ్ ప్రాంతం కీలక రవాణా కేంద్రంగా ఉండటంతో, నౌకాయాన మార్గాల అంతరాయం, మధ్యవర్తి రసాయనాల సరఫరాను దెబ్బతీస్తోంది. రవాణా ఖర్చులు పెరగడం, సరుకు రాకలో ఆలస్యం తయారీదారులకు ఇబ్బందులు కలిగిస్తోంది. అల్యూమినియం ఫాయిల్స్, ప్లాస్టిక్ పాలిమర్స్, గ్లాస్ వైల్స్, రబ్బర్ స్టాపర్స్ వంటి ప్యాకేజింగ్ పదార్థాల కొరత, ధరల పెరుగుదల తయారీ ఖర్చులను పెంచుతున్నాయి.

గల్ఫ్ దేశాలకు ఔషధ ఎగుమతులు రవాణా సమస్యలు, పోర్ట్ ట్రాఫిక్, బీమా సమస్యల కారణంగా ప్రభావితమవుతున్నాయి. కొన్ని ప్రత్యేక ఔషధాల దిగుమతులు కూడా ఆలస్యం అవుతున్నాయి. ఎగుమతిదారులు డిమాండ్ మార్పులు, చెల్లింపుల సమస్యలు, రవాణా ఆలస్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దిగుమతిదారులు అధిక ఖర్చులు, అస్థిర సరఫరా సమస్యలను ఎదుర్కొంటున్నారు. దేశీయ వ్యాపారులు స్టాక్ కొరత, ధరల మార్పులతో ఇబ్బందులు పడుతున్నారు. ఇది వినియోగదారులకు ఔషధాల లభ్యతపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

 యాంటీబయోటిక్స్, గుండె సంబంధిత ఔషధాలు, మధుమేహ ఔషధాలలో  మెడిసిన్‌ పని చేసేందుకు వినియోగించే రసాయనాలు (APIs) కొరత ఏర్పడే అవకాశం ఉందని, ప్యాకేజింగ్ పదార్థాల కొరత వల్ల ఉత్పత్తి తగ్గుదల, ప్రాణ రక్షక ఔషధాల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అసోసియేషన్ హెచ్చరించారు.  

ఈ సమస్యను అధిగమించేందుకు ఏపీఐ, కీలక ముడి పదార్థాల స్వదేశీ తయారీని ప్రోత్సహించాలి. అవసరమైన ఔషధాలు, ముడి పదార్థాల భద్రతా నిల్వలను ప్రభుత్వ స్థాయిలో నిర్వహించాలి. గల్ఫ్ ప్రాంతానికి ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను అభివృద్ధి చేయాలి. పోర్ట్ క్లియరెన్స్ వేగవంతం చేయడం, రవాణా, బీమా ఖర్చులను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలి. ఔషధ ధరల పెరుగుదలను నియంత్రించేందుకు నియంత్రణ సంస్థలు పర్యవేక్షణ చేయాలి. నియంత్రణ సంస్థలు, తయారీదారులు, పంపిణీదారుల మధ్య సమన్వయం పెంచాలని విజ్ఞప్తి చేశారు.  

ప్రస్తుత పరిస్థితి మారుతూ ఉన్నప్పటికీ, ప్రభుత్వం, ఔషధ రంగానికి చెందిన అన్ని భాగస్వాములు సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు అవసరమైన ఔషధాల సరఫరాను నిరంతరంగా కొనసాగించగలమని జి. కోటేశ్వరరావు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement