ప్రతి మొబైల్‌ ఫోన్‌ వర్చువల్‌ జూద గృహమే  | Every Mobile Phone Has Become A Virtual Gambling House | Sakshi
Sakshi News home page

ప్రతి మొబైల్‌ ఫోన్‌ వర్చువల్‌ జూద గృహమే 

Jun 4 2026 4:47 AM | Updated on Jun 4 2026 4:47 AM

Every Mobile Phone Has Become A Virtual Gambling House

ఆన్‌లైన్‌ గేమింగ్‌ వ్యసనం 

ప్రజారోగ్యానికి ముప్పు 

బెట్టింగ్‌ను నిషేధించే అధికారం రాష్ట్రాలకు ఉందని స్పష్టం చేసిన సుప్రీం 

సాక్షి, న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ బెట్టింగ్, జూదం విచ్చ లవిడిగా వ్యాపించడం శాంతిభద్రతలు, ప్రజా ప్రశాంతత, ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పుగా పరిణమించిందని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. సాంకేతిక అభివృద్ధితో ప్రతి మొబైల్‌ ఫోన్‌ ఇప్పుడు ‘వర్చువల్‌ జూదగృహం’గా మారిపోయిందని ఘాటైన వ్యాఖ్యలు చేసింది. దీంతో బెట్టింగ్, జూదం అందరికీ సులభంగా అందుబాటులోకి వచ్చేశాయని జస్టిస్‌ జేబీపార్దీవాలా, జస్టిస్‌ ఆర్‌ మహదేవన్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

ఆన్‌లైన్‌ బెట్టింగ్, రమ్మీ లాంటి ‘నైపుణ్యంతో కూడిన ఆటల’పై డబ్బు పెట్టి ఆడడాన్ని నిషేధిస్తూ తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చాయి. ఈ చట్టాలను ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీలు, ‘ఆల్‌ ఇండియా గేమింగ్‌ ఫెడరేషన్‌’సంస్థలు సుప్రీంకోర్టులో సవాల్‌ చేశాయి. నైపుణ్యంతో కూడిన ఆటలు ‘జూదం’కిందకు రావని, ఆన్‌లైన్‌ గేమింగ్‌ను నియంత్రించే అధికారం కేంద్రానికే ఉంది, రాష్ట్రాలకు లేదు అంటూ కోర్టులో వాదించాయి. దీనిపై కోర్టు స్పందించింది. 

రాష్ట్రాలకు చట్టం చేసే అధికారం ఉంది.. 
రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్, రాష్ట్ర జాబితాలోని 1వ ఎంట్రీ ప్రకారం ‘శాంతిభద్రతల’పై చట్టాలు చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని కోర్టు స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌ మనీ గేమింగ్‌ వ్యసనం, ఆర్థిక నష్టాలు, ఆత్మహత్యలకు దారితీస్తోందని, దీనికి శాంతిభద్రతలతో ప్రత్యక్ష సంబంధం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో నైపుణ్యంతో కూడిన ఆటలు అయినప్పటికీ ఆన్‌లైన్‌ బెట్టింగ్, జూదాన్ని నిషేధిస్తూ తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు చేసిన చట్టాలను ధర్మాసనం సమరి్థంచింది. 

‘శాంతిభద్రతలు’అంటే కేవలం హింస లేకపోవడం కాదని, సమాజంలో ప్రశాంతత, సామాజిక జీవనం సజావుగా సాగడం, ప్రజా భద్రత, సామాజిక, ఆర్థిక అంతరాయాల నుంచి రక్షణ కల్పించడం అని కోర్టు నిర్వచించింది. ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే, విస్తృత భయాందోళనలు సృష్టించే, సాధారణ జీవితానికి అంతరాయం కలిగించే కార్యకలాపాలతోనూ శాంతిభద్రతలకు భంగం కలుగుతుందని కోర్టు పేర్కొంది. 

స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్, డిజిటల్‌ చెల్లింపులతో ఆన్‌లైన్‌ మనీ గేమింగ్‌ వేగంగా విస్తరించిందని ధర్మాసనం గుర్తించింది. గ్రామీణ, తక్కువ ఆదాయ వర్గాల నుంచి పెద్ద సంఖ్యలో ఆటగాళ్లు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయని తెలిపింది. సాంకేతికతతో పబ్లిక్‌ గ్యాంబ్లింగ్‌ చట్టం ఉద్దేశం వృథా అయింది అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది.

సమాజంపై తీవ్ర ప్రభావం 
ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ పర్యవసానాలు వ్యక్తులకే పరిమితం కాకుండా సమాజంపై పడుతున్నాయని కోర్టు స్పష్టం చేసింది. తక్షణ ఆర్థిక లాభాల ఆశతో చాలా మంది తప్పుడు భ్రమల్లో చిక్కుకుంటున్నారని, ఇది రిస్క్‌ తీసుకునే ప్రవర్తనను సాధారణం చేసి సామాజిక జీవితాన్ని ప్రభావితం చేస్తోందని పేర్కొంది. వ్యసనం, డిప్రెషన్, ఆత్మహత్యల నివేదికలు విస్తృత ప్రజారోగ్య సమస్యను సూచిస్తున్నాయని, ఇది కుటుంబాలను, సమాజాన్ని ప్రభావితం చేస్తోందని తెలిపింది. 

ఇంటర్నెట్‌ గ్యాంబ్లింగ్‌ వల్ల పిల్లలు జూద వెబ్‌సైట్‌లను సులభంగా యాక్సెస్‌ చేయగలగడం అదనపు ప్రమాదమని గుజరాత్‌ హైకోర్టు ‘అమిత్‌ ఎం. నాయర్‌’కేసులో చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు ప్రస్తావించింది. తమిళనాడు ప్రభుత్వం చట్టం చేసే ముందు నియమించిన జస్టిస్‌ కె. చంద్రూ కమిటీ నివేదికలో ఆన్‌లైన్‌ గేమింగ్‌తో కలిగే నష్టాలపై అనుభవపూర్వక ఆధారాలు ఉన్నాయని, రాష్ట్రం వాస్తవిక ఆధారం లేకుండా వ్యవహరించలేదని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.  
 

Advertisement
 
Advertisement
Advertisement