పేదింటి బిడ్డ.. చదువుల్లో దిట్ట! ప్రియ ఉన్నత లక్ష్యం కోసం ఊరే కదిలింది

Entire Village Helps For Bihar Board Topper Priya Studies - Sakshi

జ్ఞానం, నైపుణ్యం ఉన్నా.. సరైన ప్రోత్సాహం లేక ముందుకు వెళ్లలేక ఆగిపోతున్నారు ఎందరో. మన దేశంలో ఆర్థిక పరిస్థితులు సహకరించక మధ్యలోనే వదిలేస్తున్న పిల్లల్ని చూస్తున్నాం. పదో తరగతిలో టాపర్‌గా నిలిచిన ప్రియాకి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అమ్మ, నాన్నమ్మల కాయకష్టంతో.. కష్టపడి చదువుకుంది. స్టేట్‌ టాపర్‌గా నిలిచిన చదువుల బిడ్డకు.. ఉన్నత చదువుల కోసం డబ్బుల్లేవు. ఇలాంటి తరుణంలో ఊహించని సాయం.. ఆమె చదువు బండి ముందుకు వెళ్లడానికి చేతులు చాచింది.

ప్రియాన్షు కుమారి.. తండ్రి కౌశలేంద్ర శర్మ ఆమె పసితనంలో ఉన్నప్పుడే చనిపోయాడు. కొద్దిరోజులకే కుటుంబ పెద్దగా ఉన్న తాత కూడా అనారోగ్యంతో కన్నుమూశాడు. అప్పటి నుంచి నాన్నమ్మ, అమ్మ.. ఇద్దరూ ఆ ఇంటిని, ప్రియాన్షు, ఆమె సోదరి పోషణను చూసుకుంటూ వస్తున్నారు. వచ్చే సంపాదనతో ఆ ఇద్దరు ఆడబిడ్డలకు మంచి బట్ట, తిండితో పాటు చదువును సైతం అందిస్తూ వచ్చారు.  

ఈ క్రమంలో.. ప్రియాన్షు ఈ ఏడాది బోర్డు ఎగ్జామ్‌లో 472 మార్కులతో స్టేట్‌ ఫస్ట్‌ వచ్చింది. ఈ వార్త తెలియగానే ఆ కుటుంబమే కాదు.. ఊరు మొత్తం సంబురాలు చేసుకుంది. కష్టపడి చదువుకున్న ప్రియాన్షు గురించి ఆ ఊరికి బాగా తెలుసు. అందుకే ఆ ఊరి మాజీ సర్పంచ్‌, రిటైర్డ్‌ సైనికుడు సంతోష్‌ కుమార్‌.. ఆమె పైచదవులకు అవసరమయ్యేందుకు కొంత డబ్బును అందించాడు. ఇది తెలిసి.. ఊరు ఊరుకుంటుందా?.. మొత్తం కదిలింది. 

స్టేట్‌ టాపర్‌గా నిలిచి.. ఎక్కడో బీహార్‌లోని మారుమూల పల్లె సుమేరా పేరును హెడ్‌లైన్స్‌లో నిలిపింది ప్రియా. అందుకే ఆమె చదువులు ఆగిపోకూడదని నిర్ణయించుకుంది. ఆ తల్లులను విశ్రాంతి తీసుకోమని కోరుతూ.. ప్రియా చదువుల కోసం కొంత ఆర్థిక సాయం అందించింది. అంతేకాదు.. సాయం చేయడానికి ఎవరైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ముందకు వస్తారేమో.. వద్దని అంటున్నారు ఆ ఊరి ప్రజలు. తమ ఊరి బిడ్డను తామే చదివించుకుని.. ఆమె ఉన్నత లక్ష్యమైన సివిల్స్‌ కలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు కూడా.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top