వణికిస్తున్న వైరస్‌.. మీజిల్స్‌తో మరో బాలుడి మృతి

Eight month old Dies of measles in Mumbai, case tally reaches 252 - Sakshi

సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో మీజిల్స్‌ వైరస్‌ రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. వరుసగా మూడు రోజులు ఒక్కొక్కరు చొప్పున ముగ్గురు పిల్లలు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 13కు చేరింది. గురువారం మధ్యాహ్నం గోవండీలోని మురికివాడలో నివాసముంటున్న ఓ 8 మాసాల బాలుడు మీజిల్స్‌ వైరస్‌తో మృతి చెందడం కలకలం రేపింది.

గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు మీజిల్స్‌ వైరస్‌తో 19 మంది పిల్లలు వివిధ ఆస్పత్రుల్లో చేరారు. దీంతో ముంబైలో ఈ సంఖ్య 252కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఖ్య మూడు వేలకుపైనే చేరుకుంది. గోవండీలో మృతి చెందిన 8 నెలల బాలుడు గత 20 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఒంటిపై ఎర్రని దద్దుర్లు రావడంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడసాగాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు వెంటనే బీఎంసీ ఆస్పత్రిలో చేర్పించారు.

చదవండి: (పసిపిల్లలపై మీజిల్స్‌ పంజా.. వ్యాధి లక్షణాలివే...)

నవంబర్‌ 21వ తేదీ వరకు అతడి ఆరోగ్యంలో ఎలాంటి మార్పు జరగలేదు. దీంతో మెరుగైన వైద్యం కోసం బీఎంసీకి చెందిన ప్రత్యేక ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వెంటిలేటర్‌పై చికిత్స అందించినప్పటికీ ఎలాంటి మార్పు కనిపించలేదు. చివరకు గురువారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచాడు. శరీరంలోని అవయవాలన్నీ పాడైపోవడంతో అతడు మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

నగరంలో మృతుల సంఖ్య పెరిగిపోవడంతో బీఎంసీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరింత వేగవంతం చేసింది. బీఎంసీ ఆరోగ్య సిబ్బంది బైకళా, వర్లీ, వడాల, ధారావి, తూర్పు బాంద్రా, తూర్పు అంధేరీ, ఉత్తర మలాడ్, గోవండీ, చెంబూర్, కుర్లా, భాండూప్‌ తదితర ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ చేస్తున్నారు. మీజిల్స్‌ వైరస్‌ను నియంత్రించేందుకు బీఎంసీ ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రాధాన్యత ఇస్తున్నారు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా తమ పిల్లలకు వ్యాక్సినేషన్‌ చేయించాలని వాడవాడ, ఇంటింటికి తిరుగుతూ జన జాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు బీఎంసీ సిబ్బంది 46,03,388 ఇళ్లలో అధ్యయనం చేశారు. అందులో మీజిల్స్‌ వైరస్‌ అనుమానితులు 3,695 మంది పిల్లలున్నట్లు గుర్తించారు. వీరందరికి ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ మందులు, వ్యాక్సినేషన్‌ చేస్తున్నారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top