కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లపై ఈడీ దాడులు | ED RAids On Karnataka Congress Leaders | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లపై ఈడీ దాడులు

Jun 12 2025 7:38 AM | Updated on Jun 12 2025 7:38 AM

ED RAids On Karnataka Congress Leaders

బనశంకరి: కర్ణాటకలో సంచలనం రేకెత్తించిన మహర్షి కర్ణాటక వాల్మీకి గిరిజన అభివృద్ధి మండలి (కేఎం వీఎస్‌టీడీసీ)లో కోట్ల రూపాయల కుంభకోణంలో కేంద్ర ఈడీ అధికారులు మరోసారి దాడులు నిర్వహించారు. బుధవారం ఉదయమే ఉమ్మడి బళ్లారి జిల్లాలో, బెంగళూరులో పలువురు కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేల నివాసాలు, ఆఫీసుల్లో ముమ్మరంగా సోదాలు జరిపారు. 

బళ్లారి జిల్లా ఎంపీ తుకారాం, కంప్లి ఎమ్మెల్యే గణేశ్, కూడ్లిగి ఎమ్మెల్యే ఎన్‌టీ శ్రీనివాస్, బళ్లారి నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, బళ్లారి రూరల్‌ ఎమ్మెల్యే బీ.నాగేంద్ర పీఏ గోవర్ధన్‌ ఇళ్లు, బెంగళూరులోని ఆఫీసుల్లో సోదాలు చేశారు. వారి సన్నిహితులు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. అక్రమ నగదు బదిలీ నియంత్రణ చట్టం కింద చేపట్టిన ఈ తనిఖీలు కర్ణాటక రాష్ట్రంలో కలకలం రేపాయి. వాల్మీకి అభివృద్ధి మండలి స్కాం గతేడాది ఫిబ్రవరిలో బయటకు వచ్చింది. 

ఆర్థికపరమైన అవకతవకలకు పాల్పడాలని ఒత్తిళ్లు వస్తున్నాయని లేఖ రాసి మండలి ఉద్యోగి ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. మండలి ఖాతాల నుంచి ఓ మంత్రి రూ.94 కోట్లు తమ ఖాతాలకు బదిలీ చేసి తెలంగాణ శాసన సభ ఎన్నికలు, బళ్లారి లోక్‌సభ ఎన్నికల్లో ఖర్చు చేశారని ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో అప్పటి మంత్రి బి.నాగేంద్ర రాజీనామా చేశారు. తరువాత ఈడీ ఆయన్ని అరెస్టు చేసింది. మండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌ను, కొందరు ఉన్నతాధికారులను రాష్ట్ర పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇదే కేసులో ఈడీ తాజాగా దాడులు ప్రారంభించింది. మళ్లించిన నిధుల నుంచి కంప్లి ఎమ్మెల్యే గణేశ్‌కు రూ.3 కోట్లు, ఎంపీ తుకారాంకు రూ.10 కోట్లు, ఎన్‌టీ శ్రీనివాస్‌కు కూడా కొంత నగదు చేరినట్లు ఈడీ వర్గాలు చెబుతున్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement