అదిరిందయ్యా చంద్రం! | Earthset and a solar eclipse: Nasa releases first images from Moon fly-by | Sakshi
Sakshi News home page

అదిరిందయ్యా చంద్రం!

Apr 8 2026 4:28 AM | Updated on Apr 8 2026 6:50 AM

Earthset and a solar eclipse: Nasa releases first images from Moon fly-by

చంద్రుని వెనకగా భూమి అస్తమిస్తున్న అరుదైన దృశ్యం. దీన్ని ఒరియాన్‌ వ్యోమ నౌక తాజాగా కెమెరాలో బంధించింది

గుడ్ బై మూన్.. హోమ్ కమింగ్

భూమ్యోదయం, సూర్యగ్రహణాన్నీ వీక్షించిన ఆర్టెమిస్-2 వ్యోమగాములు. 

చంద్రుడి చుట్టూ ప్రదక్షిణ పూర్తి

భూమికి తిరుగు పయనం ఆరంభం

‘భూమ్యాస్తమయం’ అంటే... చంద్రుడి క్షితిజ రేఖ కిందికి వాలుతున్న భూమి. చంద్రుడి సమీపం నుంచి చూసినప్పుడు ఈ అద్భుత దృశ్యం సాక్షాత్కరిస్తుంది. ఆర్టెమిస్-2 మిషన్లో పాలుపంచుకుంటున్న నలుగురు వ్యోమగాములు చంద్రుడి ఆవలి వైపు నుంచి తొలుత భూమి అస్తమిస్తున్న ఫొటో తీశారు. 

ఈ భూమ్యాస్తమయంతో ‘ఆరియన్’ వ్యోమనౌక 31 నిమిషాల సేపు తాత్కాలికంగా హూస్టన్ (అమెరికా)లోని మిషన్ కంట్రోల్ సిబ్బందితో సమాచార సంబంధాలు కోల్పోయింది. అప్పుడు వ్యోమనౌక చంద్రుడి ఉపరితలం నుంచి 4,070 మైళ్ల దూరంలో ఉంది. ఇదే సందర్భంలో భూమి నుంచి అత్యంత ఎక్కువ దూరం (4,06,773 కిలోమీటర్లు) ప్రయాణించిన మానవులుగా వ్యోమనౌకలోని నలుగురు వ్యోమగాములూ రికార్డు సృష్టించారు. 1979లో ‘అపోలో 13’ మిషన్లో వ్యోమగాములు భూమి నుంచి 4,00,171 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఆ రికార్డును ఆర్టెమిస్-2 ఆస్ట్రోనాట్లు తాజాగా అధిగమించారు. ఆ వెంటనే.. 

మరో సుందర ఘట్టం ‘భూమ్యోదయం’ ఆవిష్కృతమైంది. దీంతో భూమితో వ్యోమనౌక కమ్యూనికేషన్స్ పునరుద్ధరణ జరిగింది. 57 ఏళ్ల క్రితం 1968 డిసెంబరులో అమెరికా వ్యోమగామి బిల్ ఆండర్స్ ‘అపోలో 8’ యాత్రలోనూ ‘భూమ్యోదయం’ ఫోటో తీశారు. ‘అపోలో 8’ మిషన్లో వ్యోమగాములు చంద్రుడి చుట్టూ పది ప్రదక్షిణలు చేసినా జాబిల్లిపై దిగకుండానే భూమికి తిరిగొచ్చారు. ఆ సందర్భంగా చంద్రుడి క్షితిజ రేఖ పైకి వస్తున్న ‘ఉదయిస్తున్న భూమి’ ఫొటోను ఆండర్స్ తీశారు. తాజా యాత్రలో ఈ దృశ్యాన్ని కూడా ‘ఆర్టెమిస్-2’ వ్యోమగాములు తిలకించారు. అలాగే.. 

చంద్రుడి ఆవలి వైపు నుంచి 57 నిమిషాలపాటు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వారు వీక్షించారు. సూర్యుడు, చంద్రుడు, ‘ఆరియన్’ వ్యోమనౌక... ఈ మూడూ ఒకే సరళరేఖ పైకి రావడంతో ఈ సూర్యగ్రహణం సంభవించింది. ప్రస్తుతం వ్యోమగాములు భూమికి తిరుగు ప్రయాణంలో ఉన్నారు. వారి ‘ఆరియన్’ కేప్సూల్ ఈ నెల 10వ తేదీన (శుక్రవారం) అమెరికా కాలమానం (ఈడీటీ- ఈస్టర్న్ డేలైట్ టైమ్) ప్రకారం రాత్రి 8:07 గంటలకు... అంటే భారత కాలమానం ప్రకారం 11వ తేదీన (శనివారం) ఉదయం 5:37 గంటలకు కాలిఫోర్నియా సమీపంలోని శాన్ డియాగో తీరప్రాంతంలో పారాచూట్ల సాయంతో నెమ్మదిగా పసిఫిక్ మహాసముద్రంలో దిగుతుంది. రికవరీ టీమ్స్ వారిని క్షేమంగా భూమిపైకి పట్టుకొస్తాయి.

:::జమ్ముల శ్రీకాంత్‌

Credits: Forbes, Phys.org

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement