నాసా ‘ఆర్టెమిస్-2’ చంద్రయాత్ర దిగ్విజయంగా సాగుతోంది. నలుగురు ఆస్ట్రోనాట్స్ ‘ఆరియన్’ వ్యోమనౌకలో ప్రత్యేకంగా తయారుచేసిన నాలుగు అద్దాల కిటికీల్లోంచి బయటికి అంతరిక్షంలోకి తొంగిచూస్తుంటే... భూమి దూరంగా జరిగిపోతూ చిన్నదిగా కనిపిస్తోంది. నెలరాజు, వెన్నెలరాజు చంద్రుడేమో మెల్లగా దగ్గరికొస్తూ ఎదురుగా పరిమాణం పెరిగిపోయి పెద్దగా దర్శనమిస్తున్నాడు. వ్యోమగాములు జాబిల్లిని చేరుకునే క్రమంలో మూడింట రెండొంతుల ప్రయాణం పూర్తయింది.
సోముడు అంటే చంద్రుడు. నేడు సోమవారం. మండే అంటే మూన్ డే! వారంలోని ఏడు దినాల్లో చంద్రుడికి అంకితమైన రోజు ఇది. ఇదే రోజున హలో... అని పలకరిస్తూ సోముడి చెంతకు చేరబోతున్నారు నలుగురు వ్యోమగాములు. బ్రిటిష్ సమ్మర్ టైమ్ (బీఎస్టీ) ప్రకారం సోమవారం రాత్రి 23.47 గంటలకు అంటే... భారత కాలమానం ప్రకారం మంగళవారం వేకువజామున 4.17 గంటలకు వ్యోమగాములు చంద్రుడి వెనుక/ఆవలి వైపునకు వెళతారు.
ఆ సమయంలో వ్యోమనౌకతో భూమ్మీది గ్రౌండ్ కంట్రోల్ కొనసాగించే రేడియో, లేజర్ సిగ్నల్స్, సమాచార సంబంధాలను స్వయంగా చంద్రుడే అడ్డుకుంటాడు. ఇంచుమించు 40 నిమిషాలపాటు వ్యోమనౌకతో, అందులోని వ్యోమగాములతో మనకు సమాచార సంబంధాలు తెగిపోతాయి.
అంతరిక్షపు నిశీధిలో నిశ్శబ్దంగా ప్రయాణిస్తూ వారు ఒంటరి బహుదూరపు బాటసారులుగా మిగిలిపోతారు! దృష్టినంతటినీ వారు జాబిల్లిపైనే కేంద్రీకరించే సమయం ఇది. ఫొటోలు తీస్తూ, చంద్రుడి జియాలజీని అధ్యయనం చేస్తూ, అద్భుతాన్ని ఆస్వాదించే పనిలో నిమగ్నమవుతారు. ఇటు భూమ్మీద నాసా సిబ్బంది మనోధైర్యాన్ని ఇది రవ్వంత బలహీనపరిచే సమయం. 40 నిమిషాలే అయినా ఆ కొద్ది వ్యవధి ప్రశాంతంగా గడిచిపోయి ‘ఆరియన్’ వ్యోమనౌకతో తమకు సమాచార సంబంధాల పునరుద్ధరణ జరిగే వరకు నాసా సిబ్బందికి ఆందోళన తప్పదు.
ప్రయాణం ముందుకుసాగి, వ్యోమనౌకపై చంద్రుడి ఛాయ తొలగిపోయి, దాన్నుంచి మళ్లీ సంకేతాలను అందుకోవడం మొదలైతేనే నాసా తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటుంది. నైరుతి ఇంగ్లాండులో కార్న్వాల్ లోని గూన్ హిల్లీ ఎర్త్ స్టేషన్ వద్ద ఏర్పాటుచేసిన భారీ యాంటెన్నా... వ్యోమనౌక ‘ఆరియన్’ సంకేతాలను స్వీకరించి వాటిని నాసా ప్రధాన కార్యాలయానికి చేరవేస్తోంది. కాగా, భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 9.30 గంటలకు ‘ఆరియన్’ వ్యోమనౌక చంద్రుడికి 41 వేల మైళ్ల దూరంలో ఉంది.
- జమ్ముల శ్రీకాంత్
(Credits: NASA, ESA, BBC, The Guardian)


