అగ్రరాజ్యానికి మరో ఎదురుదెబ్బ  | Seven US manned aircraft lost in conflict with Iran | Sakshi
Sakshi News home page

అగ్రరాజ్యానికి మరో ఎదురుదెబ్బ 

Apr 6 2026 4:03 AM | Updated on Apr 6 2026 6:51 AM

Seven US manned aircraft lost in conflict with Iran

రెండు ఎంసీ–130జే విమానాలు ధ్వంసం 

ఎయిర్‌మ్యాన్‌ను కాపాడే క్రమంలో భారీ నష్టం

టెహ్రాన్‌/దుబాయ్‌:  ఇరాన్‌ యుద్ధంలో అమెరికాకు భారీ ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలు యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను నష్టపోయిన అగ్ర రాజ్యం తాజాగా మరో రెండు ఎంసీ–130జే రవాణా విమానాలను కోల్పోయింది! శుక్రవారం ఇరాన్‌లో నేలకూలిన ఎఫ్‌–15ఇ ఫైటర్‌ జెట్‌ తాలూకు ఎయిర్‌మ్యాన్‌ను కాపాడుకునేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. 

ఆపరేషన్‌ అనంతరం ఇరాన్‌ నుంచి వెనక్కు మళ్లే క్రమంలో రెండు ఎంసీ–130 జే విమానాలు మొరాయించినట్టు సమాచారం. దాంతో ఇరాన్‌కు చిక్కొద్దనే ఉద్దేశంతో అమెరికా దళాలే వాటిని పేల్చేసినట్టు అమెరికా సైనికాధికారి ఒకరు తెలిపారు. శత్రు భూభాగంలో రహస్యంగా ప్రవేశించడానికి, అక్కడ చిక్కిన తమవారిని కాపాడేందుకు ఈ రవాణా విమానాలను అమెరికా ఉపయోగిస్తుంటుంది. 

మంటల్లో కాలి నేలకూలిన అమెరికా రవాణా విమానాల అవశేషాలను ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మొహమ్మద్‌ బాఘెర్‌ ఖలిబాఫ్‌ ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు. ‘అమెరికా గనుక ఇలాంటి మరో మూడు విజయాలు సాధిస్తే అది పూర్తిగా నాశనమవుతుంది’ అని ఎద్దేవా చేశారు. రెస్క్యూ ఆపరేషన్‌ సందర్భంగా పలు అమెరికా విమానాలను నేలకూల్చినట్టు ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కోర్‌ (ఐఆర్‌జీసీ) వెల్లడించింది. దక్షిణ ఇస్పహాన్‌లో మరో సీ–130 రవాణా విమానంతో పాటు రెండు బ్లాక్‌ హాక్‌ హెలికాప్టర్లను ధ్వంసం చేసినట్లు ఇరాన్‌ పోలీసు కమాండ్‌ ప్రకటించింది. 

సైనికాధికారులు హతం: ట్రంప్‌ 
ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌పై ఆదివారం భీకర స్థాయిలో దాడులకు దిగినట్టు ట్రంప్‌ వెల్లడించారు. వాటిలో పలువురు అగ్రశ్రేణి సైనికాధికారులు హతమయ్యారన్నారు. భారీ పేలుళ్లు కనిపిస్తున్న ఒక వీడియోను ట్రూత్‌ సోషల్‌లో పోస్టు చేశారు. తమతో ఒప్పందం కుదుర్చుకోవడంలో గానీ, హార్మూజ్‌ జలసంధిని తిరిగి తెరవడంలో గానీ ఇరాన్‌ విఫలమైతే భయంకరమైన పరిణామాలకు సిద్ధంగా ఉండాలని ట్రంప్‌ తేల్చిచెప్పారు. 

గల్ఫ్‌ దేశాలపై క్షిపణుల వర్షం  
పశ్చిమాసియా యుద్ధం ఆరో వారంలోకి ప్రవేశించింది. ఇజ్రాయెల్‌–అమెరికా, ఇరాన్‌ పరస్పర దాడులు నిరి్నరోధంగా కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరికలను ఇరాన్‌ ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఆదివారం గల్ఫ్‌ దేశాల్లోని ఇంధన మౌలిక సదుపాయాలపై భీకర దాడులకు దిగింది. కువైట్, యూఏఈ, బహ్రెయిన్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. దాడుల్లో కువైట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (కేపీసీ)కు చెందిన పలు యూనిట్లు దెబ్బతిన్నాయి. మంటలను ఆర్పడానికి అత్యవసర బృందాలను రంగంలోకి దించాల్సి వచ్చింది. 

ఇరాన్‌ చమురు, కేపీసీ ప్రధాన కార్యాలయాలున్న షువైఖ్‌ ఆయిల్‌ సెక్టార్‌ కాంప్లెక్స్‌పైనా క్షిపణి దాడులు జరిగాయి. అయితే ప్రాణనష్టం వాటిల్లలేదని కువైట్‌ మీడియా పేర్కొంది. గల్ఫ్‌లో విద్యుత్‌ ప్లాంట్లు, నీటి శుద్ధి కేంద్రాలను సైతం ఇరాన్‌ టార్గెట్‌గా మార్చుకుంది. కువైట్‌లో రెండు పవర్‌ ప్లాంట్లను మూసివేయాల్సి వచ్చింది. అబూదాబీలోనూ ఇరాన్‌ దాడులు కొనసాగాయి. క్షిపణుల శకలాలు నేలకూలడంతో పెట్రో కెమికల్‌ కేంద్రాలు మంటల్లో చిక్కుకున్నాయి. అక్కడ ఉత్పత్తి ఆగిపోయింది. బహ్రెయిన్‌పైనా ఇరాన్‌ నిప్పుల వర్షం కురిపించింది. 

గల్ఫ్‌ అంతా బుగ్గే: ఇరాన్‌ 
ట్రంప్‌ బూతు పురాణంపై ఇరాన్‌ మండిపడింది. ‘‘ఇలాంటి వ్యాఖ్యల ద్వారా సంక్షోభాన్ని ట్రంప్‌ మరింత పెంచుతున్నారు. గల్ఫ్‌ అంతా భస్మీపటలమయ్యే పరిస్థితులను కల్పిస్తున్నారు’’ అని దుయ్యబట్టింది. ట్రంప్‌ పిల్ల చేష్టలు, వ్యాఖ్యలతో అమెరికాను ఊహించిన దానికంటే వేగంగా రాతియుగంలోకి తీసుకెళ్లారంటూ ఎద్దేవా చేసింది. ఇరాన్‌ను ఓడించామన్న భ్రమే ఓ బురదగుంటగా మారి అందులో అమెరికా కూరుకుపోవడం ఖాయమని ఇరాన్‌ సెంట్రల్‌ మిలటరీ కమాండ్‌ జనరల్‌ అలీయాబాదీ అన్నారు. ట్రంప్‌ వ్యాఖ్యలు ఇస్లాంను కించపరిచేలా ఉన్నాయని అమెరికాలోని కౌన్సిల్‌ ఆన్‌ అమెరికన్‌–ఇస్లామిక్‌ రిలేషన్స్‌ ఆక్షేపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement