ఒక్కడి కోసం సమస్త సైన్యం  | USA airman rescued from Iran | Sakshi
Sakshi News home page

ఒక్కడి కోసం సమస్త సైన్యం 

Apr 6 2026 4:11 AM | Updated on Apr 6 2026 12:09 PM

USA airman rescued from Iran

ఎయిర్‌మ్యాన్‌ కోసం అమెరికా భారీ రెస్క్యూ ఆపరేషన్‌      

యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, ప్రత్యేక బలగాలు 

బాంబుల వర్షంతో ఇరాన్‌ దళాల నిలువరింత 

సురక్షితంగా కువైట్‌ తరలించిన నేవీ సీల్స్‌

న్యూయార్క్‌: ఎఫ్‌–15ఇ యుద్ధ విమానం నేలకూలడంతో ఇరాన్‌లో చిక్కుకున్న ఆయుధ స్పెషలిస్టును కాపాడేందుకు అమెరికా భారీ సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించింది. ఇది ఆద్యంతం సూపర్‌హిట్‌ హాలీవుడ్‌ సినిమా ‘బిహైండ్‌ ఎనిమీ లైన్స్‌’ను తలపించేలా సాగింది. ఎట్టకేలకు నేవీ సీల్‌ కమెండో బృందం ఆదివారం తమ ఎయిర్‌మ్యాన్‌ను కాపాడి వెంటతీసుకెళ్లింది. 

అతని జాడ కనిపెట్టి ఎలాగైనా నిర్బంధించేందుకు ఇరాన్‌ బలగాలు ఆ ప్రాంతమంతటినీ జల్లెడపడుతుంటే, వాళ్లను నిలువరించేందుకు అమెరికా యుద్ధవిమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ప్రతీకారంగా ఆపరేషన్‌లో పాల్గొన్న అమెరికా యుద్ద విమానాలు, సైనిక రవాణా విమానాలు, హెలికాప్టర్లపైకి ఇరాన్‌ బలగాలు క్షిపణుల వర్షం కురిపించాయి. దాంతో రెండు యుద్ధ విమానాలు, బ్లాక్‌హాక్‌ హెలికాప్టర్లు నేలకూలాయి. ఈ హై వోల్టేజీ యాక్షన్‌ ఎపిసోడ్‌లో చివరికి అమెరికాదే పైచేయి అయింది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తమ సేనల సాహసాన్ని వేనోళ్ల పొగిడారు. 

గాయపడి, కేవలం పిస్టల్‌తో... 
శుక్రవారం ఇరాన్‌ గగనతలంలో ఎఫ్‌–15ఇ కుప్పకూలడం తెలిసిందే. దాంట్లోంచి దూకేసిన ఎయిర్‌మ్యాన్‌ ఇరాన్‌లోని దట్టమైన పర్వతప్రాంతంలో పడ్డాడు. గాయాలతో రక్తమోడుతున్నా నడవగలిగే స్థితిలోనే ఉన్నాడు. దాంతో వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్లి ఎత్తయిన కొండను ఎక్కడం మొదలెట్టాడు. దాదాపు 7,000 అడుగులు ఎక్కేశాడు. అతని వెంట ఒక పిస్టల్, రహస్య సంకేతాలిచ్చే పరికరం, జాడ తెలిపే జీపీఎస్‌ ట్రాకర్, రహస్య సందేశాలు పంపే కమ్యూనికేషన్‌ సాధనం మాత్రమే ఉన్నాయి. కానీ అతన్ని ట్రాక్‌ చేయడం అమెరికాకు సాధ్యపడలేదు. 

ఎయిర్‌మ్యాన్‌ సజీవంగానే ఉన్నట్టు తేలడంతో అతని కోసం ఇరాన్‌ బలగాలు భారీ కూంబింగ్‌ చేపట్టాయి. అతని జాడ చెబితే 60,000 డాలర్లు ఇస్తామని స్థానికులకు నజరానా ప్రకటించాయి. అయితే అతను పడ్డ ప్రాంతం ఇరాన్‌ ప్రభుత్వ వ్యతిరేక శక్తుల అ«దీనంలో ఉన్నట్లు సమాచారం. దాంతో అమెరికా నిఘా సంస్థ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ) రంగంలోకి దిగింది. వారికి ఇజ్రాయెల్‌ కచ్చితమైన నిఘా సమాచారంతో సాయపడింది. అలా ఎట్టకేలకు ఎయిర్‌మ్యాన్‌ జాడను కనిపెట్టేశారు. తనను సురక్షితంగా తీసుకెళ్లేందుకు అమెరికా సైన్యం వెంటనే రంగంలోకి దిగింది. 

ఇరాన్‌ సేనలు ఎదురు పడితే పోరాడేందుకు వందల మంది సైనికులతో రవాణా విమానాలు, డజన్ల కొద్దీ యుద్ధ విమానాలను పంపింది. హెలికాప్టర్లు గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఇలా సైనిక దండు మొత్తం కదిలొచ్చింది! ఎయిర్‌మ్యాన్‌ సమీపానికి చేరిన ఇరాన్‌ సైనిక వాహనాలపై అమెరికా యుద్ధ విమానాలు బాంబులతో దాడి చేసి తరిమేశాయి. ఇరాన్‌ బలగాల ప్రతి దాడిలో అమెరికా హెలికాప్టర్లలోని సైనికులు గాయపడ్డారు. దాంతో హెలికాప్టర్‌ను అక్కడే అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. దాడులు, ప్రతిదాడుల్లో అమెరికా ఏ–10 వార్‌థాగ్‌ యుద్ధ విమానం నేలకూలింది.

 అలాగే సైనికులను వెంటతీసుకొచ్చిన రెండు రవాణా విమానాలూ మొరాయించడంతో వాటిని అక్కడే ల్యాండ్‌చేశారు. తిరిగి టేకాఫ్‌ చేయడం సాధ్యపడకపోవడంతో వాటిలోని కీలకమైన ఆయుధాలను బయటకు తీశారు. అనంతరం ఆ రెండు విమానాలను అమెరికా సేనలు పేల్చేశాయి. వీరందరినీ వెనక్కి తీసుకెళ్లేందుకు మరో మూడు విమానాలు చేరుకున్నాయి. అదే సమయంలో ఓ కొండ రాయి కింద దాక్కున్న ఎయిర్‌మ్యాన్‌ను నేవీ సీల్‌ బృందం శనివారం రాత్రి చిమ్మచీకట్లో కనిపెట్టి కాపాడింది. అతడిని వెంటనే కువైట్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

మేం అతడిని కాపాడేశాం 
ఎయిర్‌మ్యాన్‌ను కాపాడిన విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్‌ తన సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌’ ఖాతాలో అధికారికంగా ప్రకటించారు. ‘‘అమెరికా చరిత్రలోనే అత్యంత సంక్లిష్టమైన సైనిక సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశాం. ఆయుధ నిపుణుడైన కల్నల్‌ను కాపాడాం. శత్రు భూతలంపై ఏకాకిగా మిగిలిపోయిన ఎయిర్‌మ్యాన్‌ను ఇరాన్‌ బలగాలు డేగకళ్లతో గాలిస్తున్న వేళ అతడికి మా కమాండర్‌ ఇన్‌ చీఫ్, యుద్ధ కార్యదర్శి, జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ చైర్మన్, యుద్ధనిపుణులు అనుక్షణం ట్రాకింగ్‌ చేస్తూ శత్రువుల కంటపడకుండా కాపాడుకున్నాం. నిన్న పైలట్‌ను, నేడు ఎయిర్‌మ్యాన్‌ను కాపాడేశాం. అమెరికా తమ యుద్ధవీరుల్లో ఒక్కరిని కూడా రణక్షేత్రంలో నిర్లక్ష్యంగా వదిలేయబోదని నిరూపించాం’’ అని ట్రంప్‌ అన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement