search actions
-
ఒక్కడి కోసం సమస్త సైన్యం
న్యూయార్క్: ఎఫ్–15ఇ యుద్ధ విమానం నేలకూలడంతో ఇరాన్లో చిక్కుకున్న ఆయుధ స్పెషలిస్టును కాపాడేందుకు అమెరికా భారీ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. ఇది ఆద్యంతం సూపర్‌హిట్ హాలీవుడ్ సినిమా ‘బిహైండ్ ఎనిమీ లైన్స్’ను తలపించేలా సాగింది. ఎట్టకేలకు నేవీ సీల్ కమెండో బృందం ఆదివారం తమ ఎయిర్‌మ్యాన్‌ను కాపాడి వెంటతీసుకెళ్లింది. అతని జాడ కనిపెట్టి ఎలాగైనా నిర్బంధించేందుకు ఇరాన్ బలగాలు ఆ ప్రాంతమంతటినీ జల్లెడపడుతుంటే, వాళ్లను నిలువరించేందుకు అమెరికా యుద్ధవిమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ప్రతీకారంగా ఆపరేషన్‌లో పాల్గొన్న అమెరికా యుద్ద విమానాలు, సైనిక రవాణా విమానాలు, హెలికాప్టర్లపైకి ఇరాన్ బలగాలు క్షిపణుల వర్షం కురిపించాయి. దాంతో రెండు యుద్ధ విమానాలు, బ్లాక్‌హాక్ హెలికాప్టర్లు నేలకూలాయి. ఈ హై వోల్టేజీ యాక్షన్ ఎపిసోడ్లో చివరికి అమెరికాదే పైచేయి అయింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ సేనల సాహసాన్ని వేనోళ్ల పొగిడారు. గాయపడి, కేవలం పిస్టల్‌తో... శుక్రవారం ఇరాన్ గగనతలంలో ఎఫ్–15ఇ కుప్పకూలడం తెలిసిందే. దాంట్లోంచి దూకేసిన ఎయిర్‌మ్యాన్ ఇరాన్‌లోని దట్టమైన పర్వతప్రాంతంలో పడ్డాడు. గాయాలతో రక్తమోడుతున్నా నడవగలిగే స్థితిలోనే ఉన్నాడు. దాంతో వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్లి ఎత్తయిన కొండను ఎక్కడం మొదలెట్టాడు. దాదాపు 7,000 అడుగులు ఎక్కేశాడు. అతని వెంట ఒక పిస్టల్, రహస్య సంకేతాలిచ్చే పరికరం, జాడ తెలిపే జీపీఎస్ ట్రాకర్, రహస్య సందేశాలు పంపే కమ్యూనికేషన్ సాధనం మాత్రమే ఉన్నాయి. కానీ అతన్ని ట్రాక్ చేయడం అమెరికాకు సాధ్యపడలేదు. ఎయిర్‌మ్యాన్ సజీవంగానే ఉన్నట్టు తేలడంతో అతని కోసం ఇరాన్ బలగాలు భారీ కూంబింగ్ చేపట్టాయి. అతని జాడ చెబితే 60,000 డాలర్లు ఇస్తామని స్థానికులకు నజరానా ప్రకటించాయి. అయితే అతను పడ్డ ప్రాంతం ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక శక్తుల అ«దీనంలో ఉన్నట్లు సమాచారం. దాంతో అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) రంగంలోకి దిగింది. వారికి ఇజ్రాయెల్ కచ్చితమైన నిఘా సమాచారంతో సాయపడింది. అలా ఎట్టకేలకు ఎయిర్‌మ్యాన్ జాడను కనిపెట్టేశారు. తనను సురక్షితంగా తీసుకెళ్లేందుకు అమెరికా సైన్యం వెంటనే రంగంలోకి దిగింది. ఇరాన్ సేనలు ఎదురు పడితే పోరాడేందుకు వందల మంది సైనికులతో రవాణా విమానాలు, డజన్ల కొద్దీ యుద్ధ విమానాలను పంపింది. హెలికాప్టర్లు గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఇలా సైనిక దండు మొత్తం కదిలొచ్చింది! ఎయిర్‌మ్యాన్ సమీపానికి చేరిన ఇరాన్ సైనిక వాహనాలపై అమెరికా యుద్ధ విమానాలు బాంబులతో దాడి చేసి తరిమేశాయి. ఇరాన్ బలగాల ప్రతి దాడిలో అమెరికా హెలికాప్టర్లలోని సైనికులు గాయపడ్డారు. దాంతో హెలికాప్టర్‌ను అక్కడే అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దాడులు, ప్రతిదాడుల్లో అమెరికా ఏ–10 వార్థాగ్ యుద్ధ విమానం నేలకూలింది. అలాగే సైనికులను వెంటతీసుకొచ్చిన రెండు రవాణా విమానాలూ మొరాయించడంతో వాటిని అక్కడే ల్యాండ్చేశారు. తిరిగి టేకాఫ్ చేయడం సాధ్యపడకపోవడంతో వాటిలోని కీలకమైన ఆయుధాలను బయటకు తీశారు. అనంతరం ఆ రెండు విమానాలను అమెరికా సేనలు పేల్చేశాయి. వీరందరినీ వెనక్కి తీసుకెళ్లేందుకు మరో మూడు విమానాలు చేరుకున్నాయి. అదే సమయంలో ఓ కొండ రాయి కింద దాక్కున్న ఎయిర్‌మ్యాన్‌ను నేవీ సీల్ బృందం శనివారం రాత్రి చిమ్మచీకట్లో కనిపెట్టి కాపాడింది. అతడిని వెంటనే కువైట్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మేం అతడిని కాపాడేశాం ఎయిర్‌మ్యాన్‌ను కాపాడిన విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్ తన సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో అధికారికంగా ప్రకటించారు. ‘‘అమెరికా చరిత్రలోనే అత్యంత సంక్లిష్టమైన సైనిక సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశాం. ఆయుధ నిపుణుడైన కల్నల్‌ను కాపాడాం. శత్రు భూతలంపై ఏకాకిగా మిగిలిపోయిన ఎయిర్‌మ్యాన్‌ను ఇరాన్ బలగాలు డేగకళ్లతో గాలిస్తున్న వేళ అతడికి మా కమాండర్ ఇన్ చీఫ్, యుద్ధ కార్యదర్శి, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్, యుద్ధనిపుణులు అనుక్షణం ట్రాకింగ్ చేస్తూ శత్రువుల కంటపడకుండా కాపాడుకున్నాం. నిన్న పైలట్‌ను, నేడు ఎయిర్‌మ్యాన్‌ను కాపాడేశాం. అమెరికా తమ యుద్ధవీరుల్లో ఒక్కరిని కూడా రణక్షేత్రంలో నిర్లక్ష్యంగా వదిలేయబోదని నిరూపించాం’’ అని ట్రంప్ అన్నారు. -
తెర వెనక ఎవరు..?
సాక్షి ప్రతినిధి, వరంగల్ : వేర్లను వదిలేసి పైపై కొమ్మలను కొడుతుండడంతో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. దాడులు జరుగుతున్న సందర్భాల్లో ప్రధాన వ్యక్తులను పక్కకు తప్పిస్తుండడంతో ఈ దందా మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లుగా కొనసాగుతూనే ఉంది. దీంతో పేదలకు ప్రభుత్వం అందించే రూపాయికి కిలోబియ్యం అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. రేషన్ బియ్యం దుర్వినియోగం అవుతున్న విషయాన్ని గ్రహించి అక్రమ రవాణా చేస్తున్నవారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. వరుస దాడులు చేయడంతోపాటు పీడీ యాక్టు సైతం ప్రయోగిస్తోంది. అయితే.. ఎన్ని సార్లు దాడులు జరిగినా, తిరిగి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. దీనికి ప్రధాన కారణం అక్రమ రవాణాకు కేంద్ర బిందువుగా వ్యవహరించే వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే పక్కకు తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. అక్రమ రవాణా సజావుగా సాగినంత వరకు వీరే అన్ని తామై వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఏదైనా తేడా వచ్చి దాడులు జరిగి బియ్యంతో పట్టుబడిన సందర్భాల్లో నేర్పుగా పక్కకు తప్పుకుని కింది స్థాయి వ్యక్తులను కేసుల్లో ఇరికిస్తున్నారు. ఫలితంగా బియ్యం అక్రమ రవాణా కొంత కాలం మందగించినా ... మళ్లీ తిరిగి జోరుగా సాగుతోంది. సగటున ప్రతి రెండు రోజులకు ఒక లారీ లోడు బియ్యం వరంగల్ నుంచి అక్రమ రవాణా అవుతున్నట్లు సమాచారం. కేసుల్లో ఉండరు తొర్రూరు, జనగామ ఏరియాల్లో ఏర్పాటు చేసుకున్న ఏజెంట్ల ద్వారా గ్రామాల్లో బియ్యాన్ని సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని ఆటోలు, ట్రాలీల ద్వారా వరంగల్‌లో ఉన్న ప్రధాన కేంద్రంలో నిల్వ చేస్తున్నారు. లారీకి సరిపడా లోడు రాగానే.. వెంటనే వరంగల్ నుంచి తరలిస్తున్నారు. ఈ తరహాలో బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి పక్కా సమాచారం లభించడంతో మంగళవారం ఖిలావరంగల్ మండలం బొల్లికుంట శివారు సింగారం క్రాస్ సమీపంలో 500 క్వింటాళ్ల నిల్వ చేసిన బియ్యాన్ని స్టేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను టాస్క్ఫోర్సు అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తులను మామునూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలు వ్యక్తి ఎక్కడ.. వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఈ అక్రమ రవాణాలో కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. గతంలో కొబ్బరికాయల వ్యాపారం చేసి... ప్రస్తుతం బియ్యం అక్రమ రవాణాలో కీలక వ్యక్తిగా మారాడు. ఇతను సాగిస్తున్న దందాకు సంబంధించిన సమాచారాన్ని అనేక సార్లు స్థానికంగా ఉన్న పోలీసులు, విజిలెన్సు సిబ్బందికి అందించినా ఫలితం లేకుండా పోయింది. లోకల్ స్థాయిలో పోలీసు సిబ్బందితో ఉన్న పరిచయాల కారణంగా ఎప్పటికప్పుడు సేఫ్ అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో నేరుగా పౌరసరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయానికి పక్కా ఆధారాలతో సమాచారం అందించారు. దీంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా నేరుగా టాస్క్‌ఫోర్స్ అధికారులు మంగళవారం దాడి చేశారు. దీనికి సంబంధించి కనీసం స్థానిక పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. టాస్క్‌ఫోర్స్, సివిల్ సప్లయీస్ అధికారులు అక్రమ రవాణాపై విచారణ చేస్తున్నారు. మొక్కజొన్న కంకుల వ్యాపారం చేస్తామంటూ మిల్లును లీజుకు తీసుకుని, బియ్యం అక్రమ రవాణాకు అడ్డాగా మార్చినట్లు ఇప్పటికే తేలింది. ఈ మేరకు బియ్యం అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నది ఎవరు, అతనికి అండదండలు అందిస్తున్న వారు ఎవరు అనే అంశాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. పక్కా ఆధారాలు సేకరించిన అనంతరం కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 11 మంది వ్యాపారులపై కేసు నమోదు మామునూరు: ఖిలావరంగల్ మండలం బొల్లికుంట గ్రామ శివారు సింగారం గ్రామ ప్రధాన రహదారిలోని ఓ పాత రైస్ మిల్లు గోదాంలో ప్రజల నుంచి భారీగా సేకరించి అక్రమంగా నిల్వ చేసిన ప్రజాపంపిణీ బియ్యం పట్టుబడింది. వరంగల్ మండల డిప్యూటీ తహసీల్దార్ దురిశెట్టి శ్రీధర్ ఫిర్యాదు మేరకు గురువారం సాయంత్రం 11 మంది వ్యాపారులపై కేసు నమోదు చేసినట్లు మామునూరు సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట గ్రామ సమీపంలోని సింగారం రహదారిలో ఓ పాత రైసు మిల్లు గోదాములో పలు ప్రాంతాలకు చెందిన బియ్యం వ్యాపారులు మాలగాని రమేష్, దొడ్డ శ్రీనివాస్, పులిశేరి శ్రీను, పస్తం మహేందర్, సిరిగి సంపత్, పస్తం నరేందర్, తూర్పాటి కుమారస్వామి, చిదురాల నవీన్, వెంకన్న, ఇమ్మడి సోమ నర్సయ్య, సందీప్ మొత్తం 11 మంది ఒక బృందంగా ఏర్పడ్డారు. వీరందరూ నగర శివార్లల్లోని పాత బడ్డ భవనాలు, గోదాంలను ఎంచుకుని ప్రజల నుంచి అక్రమంగా సేకరించిన రేషన్ బియ్యాన్ని భారీగా నిల్వ చేశారు. రెవెన్యూ, సివిల్ సప్లయీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ శాఖ విజిలెన్స్ బృందం ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం 425.22 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 22.17 క్వింటాళ్ల నూకలు పట్టుబడ్డాయి. వీటి విలువ రూ.10,79,519 రూపాయలు ఉంటుందని అంచనా. వీటితోపాటు బియ్యాన్ని తరలించేందుకు సిద్ధంగా ఉన్న 2 ట్రాలీ ఆటోలను సైతం సీజ్ చేసి స్టేషన్లో ఆప్పగించారు. -
బ్రాండెడ్ పేరుతో కల్తీ దందా
మొయినాబాద్(చేవెళ్ల): సాధారణ బియ్యం, కందిపప్పులను బ్రాండెడ్ పేర్లతో ప్యాకింగ్ చేస్తున్న గోదాంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. గోదాంలోని బియ్యం, కందిపప్పుతోపాటు ఇతర సరుకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మొయినాబాద్ మండలంలోని అమ్డాపూర్ రోడ్డులో ఉన్న ఓ వ్యవసాయ క్షత్రంలో మంగళవారం సాయంత్రం వెలుగుచూసింది. మొయినాబాద్ సీఐ సునీత తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బేగంబజార్‌కు చెందిన రాంనివాస్సోలంకీకి మొయినాబాద్ మండలంలో జేబీఐఈటీ కళాశాల సమీపంలో అమ్డాపూర్ రోడ్డు పక్కన వ్యవసాయ క్షేత్రం ఉంది.అందులో గరిమ ఎంటర్ప్రైజెస్ పేరుతో గోదాం నిర్మించాడు. ఒడిశా నుంచి తక్కువ ధరకు సాదారణ బియ్యం, కందిపప్పు కొనుగోలు చేసి ఇక్కడి గోదాంకు తీసుకొస్తారు. గోదాంలో వాటిని బ్రాండెడ్ పేర్లతో ప్యాకింగ్ చేస్తారు. కోహినూర్ బాస్మతి రైస్, రియల్ డైమండ్, ఇండియా గేట్ వంటి బ్రాండ్ల పేర్లతో తయారు చేసిన కవర్లలో బియ్యాన్ని, అంకుల బ్రాండ్‌తో తయారు చేసిన కవర్లలో కందిపప్పును ప్యాక్ చేసి నగరంలోని బేగం బజార్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు మంగళవారం సాయంత్రం దాడులు నిర్వహించారు.ఎస్ఓటీ సీఐ ప్రవీణ్‌రెడ్డి, ఏఎస్సై అంతిరెడ్డి సిబ్బందితో వచ్చి దాడి చేశారు. గోదాంలో 200 టన్నుల బియ్యం, 12 టన్నుల కందిపప్పు ఉన్నట్లు గుర్తించారు. వీటితోపాటు సాధారణ గోధుమ పిండి ఉంది. స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ సునీత సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బ్రాండెడ్ పేర్లతో ప్యాక్ చేసిన 200 టన్నుల బియ్యం, 12 టన్నుల కందిపప్పును స్వాధీనం చేసుకుని గోదాంను సీజ్ చేశారు. ఈ అక్రమ దందాకు పాల్పడుతున్న వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం, కందిపప్పు విలువ సుమారు రూ. 1 కోటి వరకు ఉంటుందని.. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. రెండేళ్లుగా ఈ దందా సాగుతున్నట్టు తెలుస్తోంది. -
మహరాష్ట్రలో కొనసాగుతున్న గాలింపు
మహారాష్ట్రలో వరదలకు బ్రిడ్జి కూలిపోయి రెండు బస్సులు కొట్టుకుపోయిన ఘటనపై ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. ఈ రెండు బస్సుల్లో కలిపి గల్లంతయిన 22 మందిలో ఇప్పటివరకు అయిదు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇందులో ముగ్గురు పురుషులు, ఇద్దరు స్త్రీలు ఉన్నారు. మరణించిన వారిలో ఓ బస్సు డ్రైవరు కూడా ఉన్నాడు. 20 బోట్లలో 160 మంది కోస్ట్‌గార్డులు, కొంత మంది స్థానిక జాలర్లు, ఈతగాళ్లు ప్రతికూల వాతావరణంలో సైతం గాలింపులు జరుపుతున్నారని అధికారులు తెలిపారు. ఈ రెండు బస్సులే కాకుండా మరిన్ని వాహనాలు కూడా కొట్టుకుపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. స్థానిక యంత్రాంగం ఫిర్యాదుల కోసం ఓ హెల్ప్‌లైన్(1077, 02141-222118) కూడా ఏర్పాటు చేసింది. నీటి ఉధృతి కారణంగా గాలింపులు కష్టంగా ఉన్నాయని భద్రతా బలగాల్లోని ఓ జవాను తెలిపారు. పాత బ్రిడ్జిల స్థితిగతులపై తనిఖీ... మహారాష్ట్రలో ఉన్న పాత బ్రిడ్జిల స్థితిగతులపై తనిఖీలు చేసేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉత్తర్వులు జారీ చేశారు. 2013లో అప్పటి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్‌కు కూలిపోయిన బ్రిడ్జి గురించి ఫిర్యాదులు అందాయని ఫడ్నవీస్ గుర్తు చేశారు.


