యుద్ధం టెన్షన్.. ఇరాన్‌, గల్ఫ్‌తో భారత్‌ చర్చలు | Jaishankar holds talks with Gulf countries, Iran | Sakshi
Sakshi News home page

యుద్ధం టెన్షన్.. ఇరాన్‌, గల్ఫ్‌తో భారత్‌ చర్చలు

Apr 5 2026 11:59 PM | Updated on Apr 6 2026 5:03 AM

Jaishankar holds talks with Gulf countries, Iran

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. ట్రంప్ విధించిన 48 గంటల డెడ్‌లైన్ సమీపిస్తుండంతో అమెరికా, ఇజ్రాయెల్  దేశాలు ఇరాన్‌పై పెద్దఎత్తున దాడులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆందోళనకర పరిస్థితులపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇరాన్‌తో పాటు ఇతర గల్ఫ్ దేశాలతో చర్చలు జరిపారు.

చమురు సరఫరాకు ఎంతో కీలకమైన హర్మూజ్‌ జలసంధిని ఇరాన్ అడ్డుకోవడంతో  ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. ఇరాన్‌ ఈ జలసంధిని అడ్డుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. తాజాగా యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉండడంతో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గల్ప్‌ దేశాలలో  దౌత్య చర్చలు జరిపారు.

ఖతార్ ప్రధాన మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ బిన్ జస్సిమ్ అల్ థానీతో పాటు యూఏఈ   విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో  ఫోన్‌లో సంభాషించారు. ప్రస్తుతం యుద్ధం నేపథ్యంలో వివిధ అంశాలపై ఈ నేతలతో చర్చించినట్లు సమాచారం. ఈ సంక్షోభం వల్ల భారత్‌పై పడే ప్రభావం గురించి జైశంకర్ చర్చల్లో ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

మరోవైపు ట్రంప్ 48 గంటల డెడ్‌లైన్ సమీపిస్తుండడంతో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీతోనూ సమకాలిన అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇరాన్ భారత్ వంటి స్నేహపూర్వక దేశాల నౌకలను హర్మూజ్ జలసంధి గుండా వెళ్లడానికి అనుమతిస్తోంది. కాగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రయోజనాలకు ఎటువంటి భంగం కలగకుండా జైశంకర్ దౌత్య పరంగా ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement