ఆర్టిమిస్‌–2 సిబ్బందికి... చవులూరించే రుచులు! | Nasa astronauts picked their own food for Artemis II mission | Sakshi
Sakshi News home page

ఆర్టిమిస్‌–2 సిబ్బందికి... చవులూరించే రుచులు!

Apr 6 2026 5:04 AM | Updated on Apr 6 2026 5:48 AM

Nasa astronauts picked their own food for Artemis II mission

మామిడి సలాడ్, స్ట్రాబెర్రీ జామ్‌ 

పలు రకాల ఆహార పదార్థాలు తీసుకెళ్లిన వ్యోమగాములు 

వాషింగ్టన్‌: అంతరిక్షంలో భారరహిత స్థితిలో ఉన్నప్పుడు భూమ్మీద మాదిరిగా నచ్చిన ఆహారాలు తినేందుకు వీలుపడదు. పాలు ఒలికిపోయి వ్యోమనౌక అంతటా గాల్లో చక్కర్లు కొట్టొచ్చు. బిస్కెట్, బ్రెడ్‌ను కొరికితే విడిపోయే చిన్నపాటి ముక్కలు పైకి లేచి కంట్లో పడొచ్చు. వైర్ల మధ్య ఇరుక్కుని షాట్‌సర్క్యూట్‌కు దారితీయొచ్చు. అందుకే వ్యోమగాములు ద్రవ ఆహారాలను పూర్తిగా పక్కన పెడతారు. 

ఘనరూప ఆహార పదార్థాలనే తీసుకెళ్తారు. ఒరియాన్‌ వ్యోమనౌకలో బయల్దేరిన ఆర్టిమిస్‌–2 వ్యోమగాములు సైతం ఈసారి విభిన్న ఆహార పదార్థాలు, వంటకాలను తమతోపాటు తీసుకెళ్లారు. ఆయా ఆహారపదార్థాల జాబితాను ఆర్టిమిస్‌ మిషన్‌ ఆదివారం బయటపెట్టింది. కాఫీ, గ్రీన్‌ టీ, మ్యాంగ్‌–పీచ్‌ స్మూతీ, చాక్లెట్‌ బ్రేక్‌ఫాస్ట్‌ డ్రింక్, వెనిలా బ్రేక్‌ఫాస్ట్‌ డ్రింగ్, లెమనేడ్, యాపిల్‌ సిడార్, పైనాపిల్‌ డ్రింక్, కోకా, స్ట్రాబెర్రీ బ్రేక్‌ఫాస్ట్‌ డ్రింక్‌లను వెంటతీసుకెళ్లారు.  

గట్టిపడిన గోధుమ రొట్టెలు, గోధుమ బ్రెడ్, వెజిటబుల్‌ క్వికే, వాల్‌నట్స్, మామిడి సలాడ్, బ్లూబెర్రీలు, బాదం, జీడిపప్పు, బ్రకోలీ, వేయించిన గ్రీన్‌ బీన్స్, మ్యాకరోలీ అండ్‌ చీజ్, ఫ్రూట్‌ సలాడ్, బట్టర్‌నట్‌ స్క్వాష్, కాలీఫ్లవర్‌లనూ వెంట తీసుకెళ్లారు. ఐదు రకాల హాట్‌ సాస్‌లు, మాపిల్‌ సిరప్, చాక్లెట్, పీనట్‌ బటర్, స్పైసీ మస్టర్డ్, స్ట్రాబెర్రీ జామ్, తేనె, బాదంపొడి, దాల్చిన చెక్క, గొడ్డు మాంసంలనూ వెంట తీసుకెళ్లారు.

 వీటన్నింటినీ థర్మోస్టెబిలైజ్‌ విధానంలో మార్చారు. దీంతో ఎన్నేళ్లయినా పాడవకుండా ప్యాకెట్లలో అలాగే ఉంటాయి. ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. రేడియోధార్మికతకు గురికాకుండా దళసరి రక్షణాత్మక ప్యాకెట్లలో ఆహారాన్ని ప్యాక్‌చేస్తారు. బ్రీఫ్‌కేస్‌ పరిమాణంలో ఒక ఓవెన్‌లాంటి పరికరం సైతం వీళ్లకోసం తయారుచేశారు. ఇందులో కొద్దిసేపు ఉంచితే ఆహారం వేడెక్కుతుంది. దీంతో వేడివేడిగా ఆహారం తినేయొచ్చు. పోషకాల లోపం లేకుండా అన్ని రకాల ఆహారపదార్థాలను ఒరియాన్‌ వ్యోమనౌకలో మెనూను సిద్ధంచేయడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement