టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పటికీ కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం (ఏప్రిల్ 5న) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇరాన్‌లోని పవర్ ప్లాంట్లతో పాటు బ్రిడ్జ్‌లపై దాడి చేస్తామని చెప్పారు. ఇరాన్‌లో మంగళవారం పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే.. అన్నీ ఒకేసారి ఉండబోతున్నాయని వార్నింగ్ ఇచ్చారు. హార్మూజ్ జలసంధిని తెరవకపోతే ఇక ఇరాన్‌కు నరకమేనని అన్నారు. దీంతో ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అంతే దీటుగా స్పందించింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన దేశాన్ని నరకంలోకి లాగుతున్నారని, పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభాన్ని మరింత ప్రమాదంలో పడేస్తున్నారని హెచ్చరించింది. "ట్రంప్ నిర్లక్ష్య చర్యలు ప్రతి కుటుంబాన్ని నరకంలోకి నెట్టుతున్నాయి. నెతన్యాహు ఆదేశాలను పాటించే విషయంలో ట్రంప్ పట్టుబడుతుండడంతో మా పశ్చిమాసియా మొత్తం దహనమవుతుంది. తప్పుగా అనుకోకు.. యుద్ధ నేరాల ద్వారా నీకు ఏ లాభం రాదు" అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్-బాఘెర్ ఘాలిబాఫ్ ట్వీట్ చేశారు.
ట్రూత్ సోషల్‌లో ట్రంప్ చేసిన అవమానకర కామెంట్లపై థాయ్‌లాండ్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం కూడా వ్యంగ్యంగా స్పందించింది. "పోటస్ ఒక టీనేజర్ లాగా తిట్టడం చూస్తే.. అమెరికా ఊహించిన దానికంటే త్వరగా రాతియుగానికి చేరినట్లు అనిపిస్తుంది" అని అన్నారు.
ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయి స్పందిస్తూ ట్రంప్ సైకాలజీని "నేరపూరిత మానసిక స్థితి"గా పేర్కొన్నారు. మౌలిక వసతులు, ఎనర్జీ రంగాన్ని లక్ష్యంగా చేసుకోవడం మొత్తం జనాభాను ప్రమాదంలో పడేస్తుందని చెప్పారు. అలాంటి చర్యలు యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలుగా పరిగణించొచ్చని అన్నారు.


